Jubilee Hills Bypoll: ఫోకస్ అంతా వారిపైనే.. ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్..
ABN , Publish Date - Nov 09 , 2025 | 03:54 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరం ముగింపు దశకు చేరింది. మంగళవారం జరిగే పోలింగ్‌పై ఇన్‌చార్జీలు, స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేలా..
హైదరాబాద్, నవంబర్ 9 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరం ముగింపు దశకు చేరింది. మంగళవారం జరిగే పోలింగ్‌పై ఇన్‌చార్జీలు, స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేలా ఓటర్లను తరలించేందుకు ఆయా పార్టీల నేతలు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగా ఆటోలు, వ్యాన్లను ముందస్తుగా బుకింగ్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవడం ఆసక్తికరంగా మారింది.
ప్రతీ 50 మందికి ఒక ఇన్‌చార్జి..
పోలింగ్ నేపథ్యంలో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను తీసుకున్న నాయకులు రెండు రోజులుగా వారికి నగదు, ఇతరత్రా కానుకలు అందజేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా నోట్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటర్లకు డబ్బులు పంచుతున్న నాయకులు.. ఓటింగ్ రోజున వారిని జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లే బాధ్యతను కూడా చేపడుతున్నారు. ఈ మేరకు పార్టీల అగ్రనాయకులు వారికి దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. బూత్‌లోని ప్రతీ 50మంది ఓట్లర్లను తరలించేందుకు ఒక ఇన్‌చార్జికి బాధ్యతలు అప్పగించారు. వారిని పోలింగ్ సెంటర్లకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి పంపించే వరకు అప్రమత్తంగా ఉండాలని, ఇతర పార్టీల ప్రలోభాలకు వారు తలొగ్గకుండా కనిపెట్టాలని సూచిస్తున్నారు.
ఉదయాన్నే గల్లీలకు వెళ్లేలా..
ఉదయం 6గంటలకే తమకు కేటాయించిన గల్లీలు, బస్తీల్లోకి వెళ్లాలని, స్థానికంగా ఉంటూ వారిని ఆటోలు, వ్యాన్లలో ఎక్కించాలని, ఎక్కడా ఏమరుపాటుగా వ్యవహరించొద్దని నాయకులు, కార్యకర్తలకు సదరు నేతలు ఆదేశించినట్లు తెలుస్తోంది. మహిళా నేతలు కూడా అప్రమత్తంగా ఉండి మహిళా ఓటర్లను ఓటింగ్‌కు తరలించే దానిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఎంత ఎక్కువమంది ఓట్లు వేస్తే అంతమంచిదని, ప్రధానంగా ప్రచారంలో తమకు సానుకూలతను వ్యక్తం చేసిన ఓటర్లను అసలు మరువొద్దని పేర్కొంటున్నారు. ఆదివారంతో బహిరంగ ప్రచారం ముగుస్తున్నప్పటికీ.. బస్తీలు, గల్లీల్లో నిశ్శబ్దంగా తిరగాలని, తటస్థులను, ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని చెబుతున్నారు. ఏదిఏమైనా ప్రచారం ఒక ఎత్తయితే.. పోలింగ్ రోజున ఓటర్లను కేంద్రాలకు తరలించడం మరో ఎత్తని నాయకులు పేర్కొంటున్నారు.
Also Read:
హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్
జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారి జీతాల్లో కోత.!