Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:07 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు.
హైదరాబాద్, నవంబర్ 14: అందరూ ఊహించినట్లుగానే జూబ్లీహిల్స్‌లో వార్ వన్‌సైడ్ అయ్యింది.. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పినదాని కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. తన ప్రత్యర్థి.. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలు.. ప్రతి దశలోనూ నవీన్ యాదవ్ లీడ్‌లో నిలుస్తూ వచ్చారు. ఏ దశలోనూ ప్రత్యర్థులు నవీన్‌ను చేరింది లేదు. ఫలితంగా 10 రౌండ్లలో 24 వేల పైచిలుకు ఓట్లతో జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు నవీన్ యాదవ్.
ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన ప్రకారం.. నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా చూసుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి 98,988, బీఆర్ఎస్ పార్టీకి 74,259, బీజేపీకి 17,061 ఓట్లు వచ్చాయి. అలాగే నోటాకు 924 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది.
ప్రతీ డివిజన్ కాంగ్రెస్‌దే..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 డివిజన్లు ఉండగా.. ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనే పైచేయి సాధించింది. ఒక్క షేక్ పేట్ డివిజన్‌లో మాత్రమే టఫ్ కాంపిటేషన్ కనిపించగా.. మిగిలిన అన్ని డివిజన్లలో ఏకపక్షంగా సాగిపోయింది. అన్ని డివిజన్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. మొత్తం 7 డివిజన్ల ఓట్లను 10 రౌండ్లలో కౌంట్ చేశారు. ప్రతీ రౌండ్‌లోనూ కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ లభించింది. ఫలితంగా 24,658 ఓట్ల భారీ మెజార్టీతో సునీతపై నవీన్ యాదవ్ గెలుపొందారు.
ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సూపర్ సక్సెస్ అయ్యింది. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఊహించని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల ముందు వారం రోజుల వరకు కూడా కాంగ్రెస్‌లో తీవ్ర నైరాశ్యం కనిపించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నిరుత్సాహంగా కనిపించారు. కానీ, సరిగ్గా వారం రోజులు ముందు జూబ్లీహిల్స్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. తనదైన శైలిలో వ్యూహ రచన చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కీలక నేతలందరికీ డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఇంటింటి ప్రచారం చేపట్టారు. సీఎం సైతం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. తన ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. పోలింగ్ రోజున పోల్ మేనేజ్‌మెంట్ కూడా అద్భుతంగా చేయడంతో.. విజయం మరింత సునాయాసంగా మారిందని చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి...
చిన్నారులకు చంద్రబాబు, పవన్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
అవే కాంగ్రెస్‌ను గెలిపించాయ్.. జూబ్లీహిల్స్ ఫలితంపై మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News