Bihar Elections: నవంబర్ 18న కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం.. తేజస్వీ యాదవ్
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:07 PM
ప్రధాని ఆదివారంనాడు బిహార్ వచ్చిన రోజునే రోహతాస్‌లో తండ్రీకొడుకులు హత్యకు గురయ్యారని, మహా జంగిల్ రాజ్‌లో జరుగుతున్న ఘటనలేవీ ప్రధాని కంటికి కనిపించవని విమర్శించారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాకూటమి' (INDIA bloc) గెలుస్తుందని ఆర్జేడీ నేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 14న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, నవంబర్ 18న ప్రమాణస్వీకారం ఉంటుందని అన్నారు.
మహా జంగిల్ రాజ్..
అధికార ఎన్డీయేపై తేజస్వి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, బిహార్‌లో 'మహా జంగిల్ రాజ్' నడుస్తోందని అన్నారు. మొకామాలో జన్‌సురాజ్ కార్యకర్త దులార్ చంద్ యాదవ్ హత్యకు సంబంధించి జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ అరెస్టుపై తేజస్వి స్పందిస్తూ, తాము అధికారంలోకి రాగానే నవంబర్ 26 నుంచి జనవరి 26 మధ్య ప్రతి ఒక్క నేరస్థుడిని కుల, మత ప్రసక్తి లేకుండా జైలుకు పంపుతామని చెప్పారు. ప్రధాని ఆదివారంనాడు బిహార్ వచ్చిన రోజునే రోహతాస్‌లో తండ్రీకొడుకులు హత్యకు గురయ్యారని, మహా జంగిల్ రాజ్‌లో జరుగుతున్న ఘటనలేవీ ప్రధాని కంటికి కనిపించవని విమర్శించారు.
కాగా, మొకామా ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అనంత్ సింగ్ చెబుతున్నప్పటికీ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసారు. మొకామాలో నవంబర్ 6న తొలి విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగనుంది. తుదివిడత పోలింగ్ నవంబర్ 11న జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి