Bihar Election Results: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా
ABN , Publish Date - Nov 14 , 2025 | 10:06 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే దూసుకెళ్తోంది. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి 160కి పైగా స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Election Results) ఎన్డీయే దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఎన్డీయే అభ్యర్ధులు మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్(Magic Figure) కు కావాల్సిన 122 ను అధికార కూటమి ఎన్డీయే దాటేసింది. ప్రస్తుతం 162 స్థానాల్లో అధికార కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. మహాగఠ్ బంధన్ 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళి చూస్తే... మహాగఠ్ బంధన్ మరోసారి ప్రతిపక్ష స్థానంలో ఉండనున్నట్లు అర్థమవుతుంది. అలానే ఎన్డీయే(NDA)తమ అధికారాన్ని నిలబెట్టుకోనున్నట్లు కనిపిస్తుంది.
ఇక బిహార్ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా జేడీయూ(JDU) అవతరించేలా కనిపిస్తుంది. ప్రస్తుతం 76 స్థానాల్లో సీఎం నీతీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఆధిక్యంలో ఉంది. 64 స్థానాల్లో బీజేపీ(BJP) అభ్యర్థులు ముందజలో ఉన్నారు. 59 స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా బిహార్ ఓటర్లు, ప్రధాని మోదీ, సీఎం నీతిశ్ కుమార్ వైపే ఉన్నట్లు ఎన్నికల ఫలితాల సరళి చెబుతుంది.
అలానే ఎన్డీయే పై మహాగఠ్ బంధన్(Mahagathbandhan ) కూటమి చేసిన ఆరోపణలు, విమర్శలను బిహార్ ఓటర్లు నమ్మలేదని స్పష్టమవుతుంది. తాము అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్(congress)పార్టీ చతికిల పడింది. కేవలం 15 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బిహార్ ఫలితాలపై క్లారిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భరత్‌రామ్ నుంచి ప్రాణహాని ఉంది