Bihar Election Results Updates: బిహార్‌లో ఎన్డీయే డబుల్ సెంచరీ.. మహాగఠ్‌బంధన్ మహా నిష్క్రమణ.!
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:06 PM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొడుతోంది. అదే సమయంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకి ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపుతోంది. నితీష్ కుమార్, ఎల్‌జేపీ ముందు ఆర్జేడీ పూర్తి స్థాయిలో డీలాపడింది.
పాట్నా, నవంబర్ 14: బిహార్‌లో ఫలితం వన్ సైడ్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి డబుల్ సెంచరీకి పైగా స్థానాలు సాధించబోతోంది. తాజా లెక్కల ప్రకారం 201 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు, ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ తిరోగమనంతో తికమక అవుతోంది.
ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్డీయే కూటమి తన హవా సాగిస్తోంది. దీంతో బిహార్‌లో మళ్లీ నితీష్ కుమార్ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన సంఖ్య 122. ఎన్డీయే కూటమి ఈ సంఖ్యను దాటి సుమారు 200కు పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ కూటమి కుప్పకూలి పోయింది. కేవలం 36 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం సాధించగలిగింది. 2020 ఎన్నికల్లో 114 స్థానాల్లో గెలుపొందిన ప్రతిపక్ష కూటమి.. ఈసారి అందులో సగం కూడా దక్కించుకోలేకపోతోంది.
తాజాగా అందుతున్న ఫలితాల సరళి ప్రకారం.. బీజేపీ 90 స్థానాల్లో ముందంజలో ఉండగా.. జేడీ(యూ) 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ - రామ్ విలాస్) 21 స్థానాల్లో ముందంజలో ఉండగా.. హెచ్ఏఎం(ఎస్) 5, ఆర్ఎల్ఎం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇక, మహాగఠ్‌బంధన్‌లో ఆర్జేడీ కేవలం 27 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. సీపీఐ (ఎం), సీపీఐ (ఎంఎల్).. 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. చివరికి మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాఘోపూర్‌లో ఓటమికి దగ్గరగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..