US Student Visa 2025 Changes: అమెరికాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు అలర్ట్..
ABN , Publish Date - Aug 03 , 2025 | 07:09 PM
యునైటెడ్ స్టేట్స్ తన స్టూడెంట్ వీసా దరఖాస్తు ప్రక్రియలో ప్రధాన మార్పులను ప్రవేశపెట్టింది. కాబట్టి, అమెరికా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులు ఈ 3 కీలక మార్పులు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం..

ఇంటర్నెట్ డెస్క్: యునైటెడ్ స్టేట్స్ తన స్టూడెంట్ వీసా దరఖాస్తు ప్రక్రియలో ప్రధాన మార్పులను ప్రవేశపెట్టింది. వీటిలో పెరిగిన స్టూడెంట్ వీసా దరఖాస్తు రుసుము, తప్పనిసరి సోషల్ మీడియా స్క్రీనింగ్, స్టూడెంట్ వీసాలపై సమయ పరిమితి ఉన్నాయి. అయితే, కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ, మరికొన్ని ఈ సెప్టెంబర్ నుండి అమలులోకి వస్తాయని తెలుస్తోంది. అమెరికా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులు మరీ ముఖ్యంగా ఈ కీలక మార్పులపై అప్రమత్తంగా ఉండాలి.
పెరిగిన US స్టూడెంట్ వీసా ఫీజు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 4, 2025న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సంతకం చేశారు. ఈ బిల్లులో విదేశీ విద్యార్థులు, సందర్శకులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆర్థిక మార్పులు తీసుకువచ్చారు. ఈ కొత్త చట్టం ప్రకారం, భారతీయ విద్యార్థులతో సహా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరూ 250 US డాలర్ల (రూ. 21,463) కొత్త వీసా సమగ్రత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీరు వీసా దరఖాస్తు సమయంలో అదనంగా చెల్లించాల్సిన తప్పనిసరి రుసుము. అలాగే, విదేశీ సందర్శకులు అమెరికాలో ప్రవేశించినప్పుడు, వారు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్తారు అన్న సమాచారాన్ని ట్రాక్ చేయడానికి ఫార్మ్ I-94 ఉపయోగిస్తారు. ఇప్పుడు, ఈ ఫార్మ్ I-94 కోసం కూడా తప్పనిసరిగా 24 US డాలర్ల (రూ. 2060) రుసుము చెల్లించాలి. మీరు వీసా పొందిన తర్వాత, అమెరికాలోకి ప్రవేశించేటప్పుడు ఈ I-94 రుసుము కూడా చెల్లించాలి. సింపుల్‌గా చెప్పాలంటే..2025లో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయ విద్యార్థులు.. $250 వీసా సమగ్రత రుసుము, $24 ఫార్మ్ I-94 రుసుము అంటే మొత్తం $274 (రూ. 23,500 కి పైగా) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది వీసా ఫీజుకు అదనంగా ఉంటుంది.
2. తప్పనిసరి సోషల్ మీడియా స్క్రీనింగ్
భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy India) ఇటీవల F, M, J వీసా దరఖాస్తుదారులకు సంబంధించిన ఒక కొత్త సూచనను విడుదల చేసింది. సోషల్ మీడియా ఖాతాల (Facebook, Instagram, Twitter, LinkedIn మొదలైనవి) గోప్యతా సెట్టింగ్‌లు పబ్లిక్‌గా ఉండాలి అని సూచించింది. అంటే మీరు దరఖాస్తు చేసేటప్పుడు ఇచ్చే సోషల్ మీడియా హ్యాండిల్‌లు (IDలు) వీసా అధికారులు చూసేలా అందుబాటులో ఉండాలి.
3. విద్యార్థి వీసాలపై సమయ పరిమితి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విద్యార్థి వీసాలపై నిర్ణీత కాలపరిమితిని ప్రతిపాదించారు. ప్రస్తుతం, F-1, J-1 వీసాదారులు స్టేటస్ వ్యవధి వరకు, అంటే వారు చదువు కొనసాగించేవరకూ ఆ వీసా వాలిడ్ అవుతుంది. కానీ, కొత్త ప్రతిపాదన ప్రకారం, నిర్ణీత గడువు (Fixed Time Limit) అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణీత గడువును మించి ఉండాలంటే, వీసా పొడిగింపు కోసం తిరిగి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనర్థం ఏమిటంటే? విద్యార్థులు ఇకపై ఏకకాలంగా 5-6 ఏళ్లు ఉండలేరు. చదువు పూర్తయ్యేలోగా వీసా రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదన ఇంకా అమలులోకి రాలేదు, కానీ అతి త్వరలో రాబోతుందని అంచనా.
Also Read:
తల్లి పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడే 5 ఆహారాలు
పెంపుడు జంతువులతో ప్రయాణం.. ఈ విషయాలు తెలుసుకోండి..