Indian students abroad: చలో జార్జియా! క్యూ కడుతున్న భారతీయ విద్యార్థులు
ABN , Publish Date - Nov 02 , 2025 | 02:10 PM
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో విదేశాల్లో వైద్య విద్యను చదవాలనుకొనే భారతీయ విద్యార్థులు ఇప్పుడు జార్జియాకు క్యూ కడుతున్నారు. ఆర్బీఐకి చెందిన లిబలరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ డేటా ప్రకారం..
ఇంటర్నెట్ డెస్క్: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో విదేశాల్లో వైద్య విద్యను చదవాలనుకొనే భారతీయ విద్యార్థులు ఇప్పుడు జార్జియాకు క్యూ కడుతున్నారు. ఆర్బీఐకి చెందిన లిబలరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్) డేటా ప్రకారం.. జార్జియాలో ట్యూషన్ ఫీజులు, తదితరాలకు 2024-25లో భారతీయులు 50.25 మిలియన్ డాలర్లు వెచ్చించారు.
2018-19లో చేసిన 10.33 మిలియన్ డాలర్ల వ్యయంతో పోలిస్తే ఇది దాదాపు ఐదురెట్లు ఎక్కువ. ఇక ఉక్రెయిన్‌లో భారతీయుల చెల్లింపులు 2018-19లో 14.80 మిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 2.40 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. యుద్ధానికి ముందు 2020-21, 2021-22 సంవత్సరాల్లో భారతీయ విద్యార్థుల టాప్-10 గమ్యస్థానాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి. అప్పట్లో వారు ఈ దేశంలో 39.12 మిలియన్ డాలర్ల వరకూ ఫీజుల రూపంలో చెల్లించారు.
2022 ఫిబ్రవరిలో రష్యా దాడి అనంతరం 2022-23లో ఇది 10.6 మిలియన్ డాలర్లకు తగ్గింది. అదే ఏడాది విదేశాల్లో విద్య కోసం భారతీయులు డబ్బులు పంపిన టాప్-15 దేశాల జాబితాలో జార్జి యా చోటు దక్కించుకుంది. మరోవైపు ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్న దేశాల జాబితాలో రష్యా ర్యాంకు కూడా మెరుగుపడుతోంది. 2018-19లో 23వ స్థానంలో ఉన్న రష్యా 2024-25నాటికి 11వ స్థానానికి చేరుకుంది.
యూరప్ కు దగ్గరగా ఉండటం, ఇతర దేశాలతో పోలిస్తే ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు తక్కువగా ఉండటం, సరళమైన నివాస చట్టాలు, సులభ వీసా ప్రక్రియ, ఉపాధి అవకాశాలు, యూరోపియన్ ప్రమాణాలతో కూడిన వైద్య విద్య తదితర కారణాలతో భారతీయ విద్యార్థులకు జార్జియా ఆకర్షణీయ ఎంపికగా మారుతోంది.
ఇవి కూడా చదవండి..
లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..
రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి