Trump Tariff Policy: శ్రామిక వర్గ కోణంలో ‘సుంకాల యుద్ధం’
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:19 AM
సుంకాల యుద్ధం పెట్టుబడిదారీ దేశాల మధ్య లాభాల పోటీ మాత్రమేనని, దీనివల్ల కార్మిక వర్గం మోసపోతుందని రచయిత విశ్లేషించారు. రక్షణ సుంకాలూ, స్వేచ్ఛా వ్యాపారమూ చివరకు కార్మికుల శ్రమదోపిడీకి దారితీయవని మార్క్సిస్టు కోణంలో వివరణ ఇచ్చారు

కొన్ని వారాలుగా, వార్తల్లో వినవస్తున్న మాటలు: ‘సుంకాలు!’, ‘ప్రతీకార సుంకాలు!’, ‘సుంకాల యుద్ధం!’ ‘సుంకాలు’ అంటే, తేలిక మాటల్లో, చెప్పాలంటే, ప్రభుత్వాలకు చెల్లించవలిసిన ‘పన్నులే!’ ఒక దేశం తన సరుకుల్ని ఇంకో దేశానికి ఎగుమతి చేస్తే, దానికోసం తన ప్రభుత్వానికి కొంత పన్ను కట్టాలి. అది ఎగుమతి సుంకం. ఆ సరుకుల్ని దిగుమతి చేసుకున్న వేరే దేశపు వ్యాపారి కూడా తన ప్రభుత్వానికి కొంత పన్ను కట్టాలి. అది దిగుమతి సుంకం. ఆ ఎగుమతి సుంకమూ, ఈ దిగుమతి సుంకమూ - రెండూ కూడా, పెట్టుబడిదారీ విధానంలో, సరుకు ధరలో భాగాలే! ఇప్పుడు ‘సుంకాల యుద్ధం’ అనే మాట ఎందుకు మొదలైందంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల నించీ అమెరికాకు వచ్చే సరుకుల మీద ఇప్పటికే వున్న దిగుమతి సుంకాల్ని బాగా పెంచేశాడు– -అని! దానికి అతను చెప్పే కారణాలు ఏమిటంటే, ‘ఇన్నాళ్ళూ ఇతర దేశాలు అమెరికా నించీ దిగుమతి చేసుకున్న సరుకుల మీద భారీ సుంకాలు విధిస్తున్నాయి. అమెరికా మాత్రం ఇన్నాళ్ళూ విదేశాల నించీ వచ్చే సరుకుల దిగుమతుల మీద భారీ సుంకాలు వెయ్యలేదు. దాని వల్ల, అమెరికాకు చాలా ఆదాయం రాకుండా పోతున్నది. పైగా ఆ ఇతర దేశాల సరుకుల దిగుమతి వల్ల, జనాలు దిగుమతుల మీదే ఆధారపడతారు. అమెరికాలో పరిశ్రమల అభివృద్ధి జరగదు. అమెరికా నించీ ఎగుమతులు తక్కువై, దిగుమతులు ఎక్కువైతే అమెరికాకు నష్టం కదా!-’ ఇవీ ట్రంపు మాటలు! ఈ రకపు వాదనల్ని, పెట్టుబడిదారీ ఆర్ధిక శాస్త్రం భాషలో, ‘రక్షణ వాదం’ అనీ, ‘రక్షణ సుంకాలు’ అనీ అంటారు. స్వదేశంలోనే పరిశ్రమల్ని అభివృద్ధిపరిచి, దేశ ప్రజలకి ఆ పరిశ్రమల్లోనే ఉద్యోగాలు కల్పిస్తానని, ట్రంప్ చెప్పే మాటలు మంచివిగానే కనపడతాయి.
కానీ, ఈ ‘మంచి’ అనేక ఇతర విషయాల్ని బట్టి వుంటుంది. నిజానికి పెట్టుబడిదారీ ఆర్ధిక విధానానికి స్వతహాగా వున్న లక్షణం ఏమిటంటే, ఒక దేశంలో తయారయ్యే సరుకులు ఆ దేశ సరిహద్దులు దాటి, ప్రపంచమంతటా, ఎటువంటి నిబంధనలూ, అడ్డంకులూ లేకుండా అమ్మకాలు జరగాలి– -అని! దీన్నే ‘స్వేచ్ఛా వ్యాపారం’ అంటారు. ఇందులో, సుంకాల సమస్య ఘర్షణగా వుండదు. ఏ ఖర్చు ఎంత అవసరం అయితే, అంతకు మించి చేరదు. కానీ, పెట్టుబడిదారీ విధానానికి పుట్టుకతో వున్న అసలు జబ్బు ‘పోటీ’. ఈ పోటీలో నెగ్గుకు రావడానికి, కొన్ని దేశాలలోని పెట్టుబడిదారులు వేసే ఒక ఎత్తుగడ ఈ ‘రక్షణ సుంకాలు’. ఇప్పుడు ట్రంప్ ప్రారంభించిన ఈ సుంకాల యుద్ధం కూడా అలాంటి ఎత్తుగడే! ఇప్పుడు, పత్రికల్లోనూ, టీవీల్లోనూ చర్చలన్నీ ట్రంప్ ప్రకటించిన దిగుమతి సుంకాల పెంపుల గురించే! దిగుమతి సుంకాలు ఎక్కువైతే, ధర పెరిగి, మిగిలే లాభం తక్కువ. సుంకాలు తక్కువ అయితే, ధర తగ్గి, మిగిలే లాభం ఎక్కువ! ట్రంపు పెంచిన సుంకాలు వేరు వేరు దేశాల మీద వేరు వేరు శాతాలుగా వున్నాయి గదా? వీటి వల్ల భారతదేశానికి ఎంత నష్టం, ఎంత లాభం? భారతదేశం కంటే, చైనా వంటి ఇతర దేశాల మీద ఎక్కువ సుంకాలు వెయ్యడం వల్ల, ఆ దేశాల్లో పరిశ్రమలు పెట్టిన పెట్టుబడిదారులు, ఆ పరిశ్రమల్ని అక్కణ్ణించీ తక్కువ సుంకాలు గల భారతదేశానికి తరలించే అవకాశాలు ఏ రంగంలో ఎక్కువ వుంటాయి? – ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి.
ఈ సుంకాల యుద్ధం అంతా అసలు వేరు వేరు దేశాల పెట్టుబడిదారుల మధ్య లాభాల పెంపుల కోసం జరుగుతున్న పోటీ మాత్రమేననే సంగతిని పత్రికల్లోనూ, టీవీల్లోనూ, మేధావులు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. మార్క్సు, ఎప్పుడో, 1847లో రాసిన, ‘రక్షణ సుంకాలూ, స్వేచ్ఛా వ్యాపారమూ, కార్మికవర్గమూ’ అనే వ్యాసంలో ఈ విషయాన్నే గ్రహించి చెప్పాడు, ఇలా: ‘‘రక్షణాత్మక సుంకాల వ్యవస్థ ఒక దేశంలో వున్న పెట్టుబడి చేతుల్లో, ఇతర దేశాల పెట్టుబడిని ప్రతిఘటించే, ఆయుధాలను (‘వెపన్స్’) పెడుతుంది; ఇది విదేశీ పెట్టుబడికి వ్యతిరేకంగా స్వదేశ పెట్టుబడి శక్తిని పెంచుతుంది.’’ అయితే, రక్షణ సుంకాల సమర్ధకుల వాదన ఎలా వుంటుందని మార్క్సు చెబుతాడంటే, ‘విదేశీయుల సరుకులు కొనడం ద్వారా, వాళ్ళ చేతుల్లో దోపిడీకి గురి అవడం కంటే, స్వదేశస్తుల (‘ఫెలో-–కంట్రీమెన్’) చేతుల్లో దోపిడీకి గురిఅవడం మేలు (‘బెటర్’)’– -అని కార్మికులకు చెపుతారట, ఆ సమర్ధకులు! సుంకాల యుద్ధాలు వేరు వేరు దేశాల శ్రామిక ప్రజల్లో అక్కడి ప్రభుత్వాల పట్ల కొన్ని రాజకీయ భ్రమల్ని కూడా కలిగిస్తాయి. ఎలాగంటే, దిగుమతి సుంకాల్ని పెంచిన దేశాల్లో జనాలు ఇలా అనుకుంటారు: ‘‘మన ప్రభుత్వం, విదేశీ సరుకుల మీద ఎక్కువ సుంకాలు వెయ్యడమే మంచిది. దానివల్ల ఆ సరుకులకు ధరలు పెరిగి, వాటిని జనం కొనరు. క్రమంగా, దిగుమతులు తగ్గిపోతాయి. దానివల్ల, మన దేశంలోనే సరుకులు తయారై, మన పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. అంటే, మన నిరుద్యోగులకి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి, మనం మన ప్రభుత్వ విధానాల్ని సమర్ధించాలి’’ అనే అర్ధాలకు వస్తారు. ఇతర దేశాలకు సరుకుల్ని ఎగుమతి చేసే దేశాలలోని కార్మికులేమో, ‘‘మన దేశం నించీ అక్కడికి వెళ్ళే సరుకులమీద దిగుమతి చేసుకునే ఆ దేశాలు భారీ సుంకాలు వేస్తే, అక్కడ మన సరుకులు కొనేవాళ్ళు తగ్గిపోతారు. అలా జరిగితే, ఇక్కడి పరిశ్రమల యజమానులు, తమ సరుకుల ఎగుమతులు ఎక్కువగా జరగవు గనక ఉత్పత్తులు తగ్గిస్తారు. అప్పుడు, మనలో చాలా మందికి ఉద్యోగాలు పోతాయి.
కాబట్టి, మన ఎగుమతుల మీద అక్కడ దిగుమతి సుంకాలు ఎక్కువగా పడకుండా ప్రయత్నించే మన ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి’’ అనుకుంటారు. రక్షణ సుంకాల విధానంవల్ల, ప్రపంచ దేశాలలోని కార్మికులందరూ దేశాల వారీగా విడిపోయి వేరు వేరుగా ఆలోచిస్తారు. వారిలో ఐక్యతకు ఇది పెద్ద అడ్డు. సుంకాల నిజాల్ని అర్ధమే చేసుకోరు. విదేశీ వర్తకంలో రక్షణ సుంకాలకు భిన్నమైన వాదన కూడా ఒకటి వుంది. అదే, స్వేచ్ఛా వ్యాపారం! అంటే, ‘వర్తకం అనేది, ఎటువంటి నిబంధనలూ లేకుండా, సుంకాల పెంపులు లేకుండా, దేశాల సరిహద్దులు దాటి స్వేచ్ఛగా జరగాలి’ అన్నదే ఈ వాదన సారాంశం. శ్రామిక జనాల దృష్టితో చూస్తే, రక్షణ సుంకాల విధానాన్ని సమర్ధించాలా, స్వేచ్ఛా వ్యాపారాన్ని సమర్ధించాలా- అన్న ప్రశ్న వచ్చినప్పుడు, రెంటినీ వ్యతిరేకించాలంటాడు ఎంగెల్సు. కాకపోతే, రెంటినీ పోల్చినప్పుడు, స్వేచ్ఛా వ్యాపార విధానం అనేది, ‘జాతుల మధ్యా, దేశాల మధ్యా వున్న అడ్డంకుల్ని (‘బారియర్స్’ని) బద్దలుకొట్టి, ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గానికీ– -పెట్టుబడిదారీ వర్గానికీ మధ్య వున్న వైరుధ్యాన్ని మరింతగా తీవ్రతరం (‘పుషెస్ టు యాన్ ఎక్‌స్ట్రీమ్ పాయింట్’) చేస్తుందనీ, ఆ రకంగా అది సామాజిక విప్లవాన్ని ఒక రకంగా త్వరితం చేసే అవకాశం వుంటుందనీ మార్క్సు అంటాడు.
అంటే, వేరే మాటల్లో చెప్పాలంటే, అన్ని దేశాల పెట్టుబడులూ, అన్ని దేశాల కార్మికులనూ దోస్తున్నాయి అనే వర్గ చైతన్యం తీసుకురావడానికి అవకాశం వుంటుంది -అని! అసలు గ్రహించవలిసిన విషయం ఏమిటంటే, స్వదేశీ వర్తకమైనా, విదేశీ వర్తకమైనా, వర్తకుడికి వచ్చేది సరుకు ధరలో నించి ‘కమిషను’! ఆ కమిషను, ఆ వర్తకం ఏ సరుకుతో జరుగుతుందో ఆ సరుకులో వుండే కార్మికుల ‘అదనపు విలువ’లో భాగమే తప్ప ఇంకెక్కడినించో రాదు. అంటే, శ్రమ దోపిడీ నించీ అన్నమాట! స్వదేశీ సరుకుల ద్వారా సంపాదించే కమిషను, స్వదేశీ కార్మికుల అదనపు విలువ అయితే, విదేశీ సరుకుల ద్వారా సంపాదించే కమిషను, విదేశీ కార్మికుల అదనపు విలువ. ‘వర్తకం’ అనేది– స్వదేశీ వర్తకమైనా, విదేశీ వర్తకమైనా; మొత్తం అన్ని దేశాల వర్తకాల్నీ కలిపి చూస్తే, ‘ప్రపంచ వర్తక లాభాలన్నీ’, ప్రపంచ కార్మికుల అదనపు విలువలలో భాగమే. అందుకే, ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి!’ అనే నినాదం పుట్టింది! ఏ సమస్యని అయినా, పెట్టుబడిదారీ కోణంలో కాదు, శ్రామికవర్గ కోణంలో చూస్తేనే, అసలు నిజం కనపడుతుంది! కానీ, మన మేధావులు ఇంకా మేల్కొవడం లేదు!
రంగనాయకమ్మ