మాటల యుద్ధం
ABN , Publish Date - May 29 , 2025 | 01:21 AM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ అన్నేసి మాటలన్న తరువాత రష్యా ఊరుకుంటుందా? బుధవారం సీనియర్ నాయకుడు దిమిత్రీ మెద్వదేవ్ ఏకంగా మూడో ప్రపంచయుద్ధానికి సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. తమ అధ్యక్షుడిని ట్రంప్...

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ అన్నేసి మాటలన్న తరువాత రష్యా ఊరుకుంటుందా? బుధవారం సీనియర్ నాయకుడు దిమిత్రీ మెద్వదేవ్ ఏకంగా మూడో ప్రపంచయుద్ధానికి సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. తమ అధ్యక్షుడిని ట్రంప్ పిచ్చోడన్నందుకు ఈయనకు మా చెడ్డ కోపం వచ్చింది. అధికారంలోకి వచ్చిన అరగంటలోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానన్నంత స్థాయిలో గొప్పలకు పోయిన ట్రంప్‌కు ఆ పనిచేయలేకపోతున్నందుకు చాలా చిరాకుగా ఉంది. పుతిన్ దారికొస్తాడన్న నమ్మకం తరిగిపోతూండటంతో ఇటీవల ట్రంప్ మాటల్లో పుతిన్‌మీద కోపం హెచ్చింది. వందలాది మిసైళ్ళు, డ్రోన్లతో ఆదివారం ఉక్రెయిన్ మీద రష్యా జరిపిన దాడి ఇప్పటివరకూ యుద్ధంలో చూడనిది. కాల్పుల విరమణకు సిద్ధపడకుండా ఇలా సామాన్యులను పుతిన్ చంపుతున్నందుకు ట్రంప్‌కు కోపం వచ్చింది. హద్దులు దాటిమాట్లాడటం అలవాటే కనుక, ఇప్పటివరకూ తానే రష్యాను రక్షిస్తున్నట్టూ, తానే గనుక లేకపోతే ఈపాటికి రష్యాకు అత్యంత చెడు దాపురించి, ఏకంగా చెరిగిపోయేదన్నట్టుగా ట్రంప్ మాట్లాడారు. పుతిన్ నిప్పుతో చెలగాటమాడుతున్నారనడమే కాదు, తన ప్రభావ ప్రాభవాలవల్లనే రష్యా ఇంకా ఉనికిలో ఉన్నదన్నట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో మూడో ప్రపంచయుద్ధం హెచ్చరిక రష్యాకు కనిపించినట్టుంది.
కొంతకాదు, పుతిన్‌కు మొత్తం ఉక్రెయిన్ కావాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని, ఆ అత్యాశ రష్యా పతనానికి దారితీస్తుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అంత కచ్చితంగా చెప్పగలిగిన ట్రంప్ ఇంతకాలమూ అదే వ్యక్తిని ఎందుకు నమ్మారో, వెనకేసుకొచ్చారో తెలియదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఓవల్ ఆఫీసులో అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎంతగా అవమానించారో చూశాం. అసలు, యుద్ధం మొదలుకావడానికి జెలెన్స్కీ కారకుడని, కొండలాంటి రష్యాని ఢీకొని తనదేశాన్ని నాశనం చేస్తున్నాడని ట్రంప్ అప్పట్లో మండిపడ్డారు. అచ్చంగా పుతిన్ భాషనే ట్రంప్ కూడా వాడుతూండటంతో జెలెన్స్కీకి విషయం అర్థమైపోయింది. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో ఘర్షణపడినప్పటికీ ఆ తరువాత ట్రంప్ కోరిక మేరకు, యుద్ధానికి అమెరికా అందించిన ఆయుధసాయానికి రుణం తీర్చుకోవడంలో భాగంగా అమెరికాకు అతివిలువైన, అరుదైన లోహాలను అప్పగించడానికి జెలెన్స్కీ సిద్ధపడ్డారు. రష్యా కూడా ట్రంప్‌కు ఇదేరకమైన ఆఫర్ ఇచ్చిన విషయాన్ని అటుంచితే, యుద్ధాన్ని ఆపేందుకు ఒక బలమైన ప్రయత్నం జరుగుతోందని, కాల్పుల విరమణ జరిగి, అంతిమంగా ఏదో ఒప్పందం మేరకు యుద్ధం ఆగుతుందన్న ఆశలు క్రమంగా అడుగంటిపోతున్నాయి.
ఒప్పందం కుదిరితేనే కాల్పుల విరమణ అని రష్యా పట్టుబడుతోంది. కాల్పులు ఆపడమంటే ఉక్రెయిన్‌కూ దానికి వెన్నుదన్నుగా ఉన్న పాశ్చాత్యదేశాలకూ కూడదీసుకోవడానికి సమయం ఇవ్వడమేనని, మళ్ళీ అవే పాతవిధానాల కొనసాగింపును అనుమతించడమేనని రష్యా వాదన. అందువల్ల, నాటో విస్తరణ, ఆయుధ సరఫరాలు, ఉక్రెయిన్ భూభాగాల అప్పగింత ఇత్యాది అన్ని విషయాలూ నిర్దిష్టంగా తేలి, ఒప్పందం కుదిరేవరకూ రష్యా యుద్ధం ఆపదల్చుకోలేదు. యుద్ధానికి కారణం నాటో విస్తరణే కనుక అది ఆగుతుందనీ, ఉక్రెయిన్‌తో పాటు మరికొన్ని మాజీ సోవియట్ యూనియన్‌దేశాలు కూడా అందులో చేరబోవని రష్యాకు హామీ దక్కాలి. ఇకపై ఉక్రెయిన్ ఎవరివైపూ వొంగకుండా తటస్థంగా ఉండాలని, ఆంక్షలు ఎత్తివేసి, స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను విడుదల చేయాలని రష్యా చాలా డిమాండ్లు చేస్తోంది. ఇవన్నీ అటుంచితే, అసలు ట్రంప్ శాంతియత్నాలమీద జెలెన్స్కీకి నమ్మకం లేన్నట్టు కనిపిస్తోంది. రష్యా–అమెరికా మధ్య సాగుతున్న ఈ వాగ్యుద్ధం కూడా ఆయనకు నాటకంగానే తోస్తోంది. యుద్ధం ఇప్పట్లో ఆపకుండా, పుతిన్‌ను సాధ్యమైనన్ని ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకోనిచ్చి, శాంతిఒప్పందంలో భాగంగా వాటిని ఆయనకే కట్టబెట్టే ఆలోచనలో ట్రంప్ ఉన్నారని ఈయన అనుమానం. అమెరికా–రష్యా అధ్యక్షులతోపాటు తాను కూడా కూచుంటేనే చర్చలు విజయవంతమవుతాయని అదేపనిగా జెలెన్స్కీ పోరుతున్నారు. కాల్పుల విరమణో, నేరుగా ఒప్పందమో అతిత్వరలో జరగనిపక్షంలో రష్యామీద మరిన్ని ఆంక్షలు విధించాల్సిన అగత్యం ట్రంప్‌కు తప్పదు. రష్యాను వేధిస్తున్నకొద్దీ ఇరాన్, ఉత్తరకొరియా, చైనాలతో పాటు మరిన్ని దేశాల మోహరింపుతో యుద్ధం విస్తరించే ప్రమాదం హెచ్చుతుంది.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News