స్టాలిన్ సమరం
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:38 AM
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కదనోత్సాహంలో ఉన్నారు. రోజుకో కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తూ, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో నెగ్గుకొచ్చి, మళ్ళీ అధికారాన్ని వశం చేసుకోవడం...

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కదనోత్సాహంలో ఉన్నారు. రోజుకో కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తూ, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో నెగ్గుకొచ్చి, మళ్ళీ అధికారాన్ని వశం చేసుకోవడం, కుమారరత్నం వారసత్వాన్ని సుదృఢం చేసుకోవడం కోసం ఆయన అహరహం శ్రమిస్తున్నారు. ఎదురుగా కనిపించే ప్రధాన రాజకీయశత్రువు అన్నాడీఎంకేతో కంటే, తమిళనాడులోకి జొరబడుతున్న బీజేపీతో మరింత ప్రమాదం ఉన్నది కనుక బలమైన అస్త్రాలన్నింటినీ ఆ పార్టీ మీదే ఎక్కువగా సంధిస్తున్నారు. నీట్ పరీక్ష వంటివి ముందుకు తెచ్చి, ఈ రెండుపార్టీల మధ్య మళ్ళీ పొత్తుపొడవకుండా చేయాలన్న స్టాలిన్ ప్రయత్నాలు అంతిమంగా ఫలించలేదు. రెండాకుల మీద ఆధారపడనిదే తమిళనాట సొంతంగా కమలవికాసం సాధ్యంకాదని బీజేపీ నాయకులకూ, కేంద్రం అండదండలు లేనిదే స్టాలిన్‌ను నెగ్గుకురాలేమని పళనికీ అర్థమైపోవడంతో మళ్ళీ పొత్తు చిగురించింది. మూడు ఎన్నికల్లో పెదవి విరిచిన జనం, రేపటిరోజున మెచ్చుతారా, అమిత్ షా అంటున్నట్టుగా 2026లో ఈ కూటమికే అధికారం కట్టబెడతారా అన్నది అటుంచితే, రాబోయే రోజుల్లో స్టాలిన్ రాజకీయయుద్ధం మరింత తీవ్రరూపం దాల్చడం తథ్యం.
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి తన చర్యలూ చేష్టలతో స్టాలిన్‌కు చేజేతులా మేలు చేశారు. స్టాలిన్‌ను ఇరకాటంలో పెట్టాలని, మూడుచెరువుల నీళ్ళు తాగించాలన్న ప్రయత్నంలో కాస్తంత అతిగా, దూకుడుగా పోయి పరువుపోగొట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆయనతో పాటు, ఆయనను వెనకేసుకొస్తున్న బీజేపీ పెద్దలకు కూడా పెద్ద ఎదురుదెబ్బ. విపక్షపాలిత గవర్నర్లందరికీ పెద్ద హెచ్చరిక. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులమీద నిర్దిష్టకాలపరిమితిలోగా ఆమోద ముద్రవేయాలంటూ గవర్నర్లకు గడువు విధించిన ఆ తీర్పు ఫెడరల్ వ్యవస్థమీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న అందరికీ నచ్చింది. రాష్ట్రపతికి కూడా ఆదేశాలిస్తారా, హద్దులుపెడతారా అంటూ ఇప్పుడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఆగ్రహిస్తున్నారు కానీ, పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఆయన ఎలా వ్యవహరించారో తెలియనిదేమీ కాదు. విపక్షాలు ఏలుతున్న రాష్ట్రాలన్నీ వరుసపెట్టి సుప్రీంకోర్టు శరణుజొచ్చవలసి వస్తూ, సదరు గవర్నర్లు అనునయంగా ఎంతచెప్పినా దారికిరానందువల్లనే రవి కేసులో సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా, ఘాటుగా వ్యవహరించాల్సివచ్చింది.
ఈ తీర్పు అందించిన ఉత్సాహం కాబోలు, ఇప్పుడు స్టాలిన్ రాష్ట్రాల స్వయంసాధికారతమీద ముగ్గురు సభ్యులతో ఒక ఉన్నతస్థాయి కమిటీ ప్రకటించారు. బీజేపీ ఏలుబడిలో రాష్ట్రాల హక్కులన్నీ హరించుకుపోతున్న నేపథ్యంలో, ఈ కమిటీ అవసరమని, రాజ్యాంగంలోని విధివిధానాలన్నింటినీ గుదిగుచ్చి, సమీక్షించి, రాష్ట్రాల చట్టబద్ధ హక్కులను రక్షించడంతోపాటు, సహకార సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు దీని అవసరం ఉందని స్టాలిన్ అంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మినహా మిగతా ఇద్దరికీ డీఎంకెతో ఉన్న అనుబంధం ఏనాటిదోనంటూ విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఈ కమిటీ ఏర్పాటు లక్ష్యం తెలిసిందే కనుక, అది ఏమి చెప్పచెబుతున్నదో ఊహకు అందనిదేమీ కాదు. ఇక, ఇదేరీతిలో, అదే లక్ష్యంతో దాదాపు ఐదుదశాబ్దాల క్రితం రాజమన్నార్ కమిటీని అన్నాదురై నియమించడం, రాష్ట్రాలకు రాజ్యాంగం దఖలుపరిచిన అధికారాలు అన్నీఇన్నీ కావంటూ ఆ కమిటీ తన నివేదికలో కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టడం, స్టాలిన్ తండ్రి కరుణానిధి అందించిన ఈ నివేదికను ప్రధాని ఇందిరాగాంధీ తేలికగా కొట్టిపారేయడం చాలామందికి గుర్తు. సర్కారియా, పూంఛీ కమిషన్ల వంటివి ఎన్ని చెప్పినా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చిందేమీ లేదు.
కేంద్రంతో స్టాలిన్ సాగిస్తున్న ఈ యుద్ధం వెనుక రాజకీయ అవసరాలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రాష్ట్రాల హక్కులు హరించుకుపోతున్న తరుణంలో ఇది అవసరం. నీట్, డీలిమిటేషన్ ఇత్యాది విషయాల్లో స్టాలిన్ వాదనలు విస్తృతమైన చర్చకు అవకాశం ఇచ్చాయి. విద్యమీద రాష్ట్రాలకు ఉన్న అధికారాలను హస్తగతం చేసుకొని కొత్త విద్యా విధానాన్నీ త్రిభాషా సూత్రాన్నీ రుద్దడం, వద్దూకాదూ అంటున్న రాష్ట్రాలను ఆర్థికంగా శిక్షించడం వంటివి జోరుగా సాగుతున్న కాలం ఇది. అడ్డుతోవలో సర్‌చార్జీలను తెచ్చి పన్నుల్లో రాష్ట్రాలకు అందించాల్సిన వాటాను సైతం కేంద్రం కుదించింది. జస్టిస్ జోసెఫ్ కురియన్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల్లోగా మధ్యంతర నివేదిక సమర్పిస్తుంది కనుక, రాజకీయంగా స్టాలిన్ లక్ష్యం నెరవేరుతుంది. కానీ, అంతిమంగా వెలుగుచూడబోయే పూర్తినివేదిక కచ్చితంగా కేంద్రరాష్ట్ర సంబంధాలమీద కొత్త చర్చకు, మరింత లోతైన విశ్లేషణలకు వీలుకల్పిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News