Share News

పొత్తుపై నీలినీడలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 06:00 AM

కమలంతో స్నేహం ఎన్నికల వరకేనని అన్నాడీఎంకె అధినేత పళనిస్వామి బుధవారం చేసిన వ్యాఖ్యను ఎవరికి తోచినరీతిలో వారు విశ్లేషించుకోవచ్చు. అధికారపక్షం డీఎంకెను ఓడించగలశక్తి ...

పొత్తుపై నీలినీడలు

కమలంతో స్నేహం ఎన్నికల వరకేనని అన్నాడీఎంకె అధినేత పళనిస్వామి బుధవారం చేసిన వ్యాఖ్యను ఎవరికి తోచినరీతిలో వారు విశ్లేషించుకోవచ్చు. అధికారపక్షం డీఎంకెను ఓడించగలశక్తి తమకు ఉన్నదని పళనిపార్టీలో ఎంతమంది నమ్ముతున్నారో తెలియదు కానీ, బీజేపీతో గతవారం మొలిచిన పొత్తు కారణంగా తాము మరింత దెబ్బతినిపోతామన్న భయం మాత్రం అత్యధికుల్లో ఉంది. మరీ ముఖ్యంగా కార్యకర్తల్లో ఉన్న ఈ ఆందోళనను పటాపంచలు చేయడానికీ, వారిలో ఉత్సాహాన్ని నింపడానికి పళని ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది. బీజేపీని కాదు పొమ్మనగలిగే స్థితి పళని పార్టీకి లేదు. డీఎంకెను బలంగా ఢీకొట్టడానికి సమస్త సంపత్తీ ఉన్న బీజేపీ దానికి అవసరం. పొత్తును పునరుద్ధరించుకోవాలా వద్దా అని మల్లగుల్లాలు పడి, చివరకు కుదర్చుకున్నప్పటికీ, డీఎంకె నుంచి వస్తున్న విమర్శలు, ప్రశ్నలు పళని పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఎన్నికలవరకే పొత్తు అనడం ద్వారా, ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటులో కానీ, పాలనలోనే కానీ బీజేపీకి వీసమెత్తు చోటు ఉండదని పళని ముందే సందేశం ఇవ్వదల్చుకున్నట్టు కనిపిస్తోంది.


ప్రధాని మోదీ, అమిత్‌ షా ఇత్యాది బీజేపీ నాయకులు ఈ పొత్తును ఘనంగా ప్రశంసిస్తూ ప్రకటనలు చేశారు. నిజానికి, బీజేపీ నాయకులకంటే ఎక్కువగా ఈ పొత్తును ఆకాశానికి ఎత్తేస్తూ తమిళనాడు అభివృద్ధి, ఇరుపక్షాల ముందుచూపు, రాష్ట్రానికి మోదీ ఆశీస్సులు ఇత్యాది మాటలు వాడింది పళనిస్వామే. పొత్తుకు ఏ కండిషన్లు, డిమాండ్లు లేవని, అన్నాడీఎంకె వ్యవహారాల్లో, నిర్ణయాల్లో బీజేపీ ఏ మాత్రం జోక్యం చేసుకోబోదని, కలసికట్టుగా పనిచేస్తామని అమిత్‌ షా మొన్న శుక్రవారం పొత్తు ప్రకటన నాడు వివరించారు. రెండుపార్టీలను సహజభాగస్వాములని కీర్తించారు. ఈ పొత్తు పునరుద్ధరణ కోసం బీజేపీ అన్నామలై వంటి పోరాటవీరుడిని వదులుకుంది. ఆయన డీఎంకెమీద అస్త్రాలు సంధిస్తున్నంతవరకూ అన్నాడీఎంకె బాగా ఆనందపడింది. ఆయన కారణంగానే రాష్ట్రంలో నాలుగుఓట్లు పడుతున్నాయనీ, పార్టీ పెరుగుతోందని, సిద్ధాంత వ్యాప్తి జరుగుతోందని బీజేపీ నాయకులు కూడా సంతోషించారు. కానీ, ఆ తరువాత అన్నాదురై, జయలలిత సహా అన్నాడీఎంకె నాయకులమీద ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఘాటైన విమర్శలు చేయడంతో సార్వత్రక ఎన్నికలకు ముందే పళనిపార్టీ ఆ పొత్తు తెంపేసుకుంది. బీజేపీతోనూ, ఎన్డీయేతోనూ తెగదెంపులు తమకు అత్యంత సంతోషకరమైన ఘట్టం అని ఈ నాయకులంతా అన్నారు. బీజేపీతో పొత్తు కారణంగా మైనారిటీ ఓట్లు తమకు దక్కకుండా పోతున్నాయని, ముప్పైతొమ్మిది ఎంపీ సీట్లూ తామే గెలుస్తామని చెప్పుకున్నారు. కానీ, ఈ తెగదెంపుల ఎత్తుగడ తర్వాత కూడా సార్వత్రక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకూ ఒక్కసీటు కూడా గిట్టుబాటు కాలేదు.


ఈ విడాకుల సందర్భంలోనే, చాలామందికి జయలలిత మరణానంతరం ఆమె పార్టీ రెండుగా చీలిన ఘట్టం గుర్తుకువచ్చింది. కన్నీరు మున్నీరవుతున్న శశికళ తలనిమిరి ప్రధాని మోదీ ఓదార్చడం, అనూహ్యంగా న్యాయస్థానం ఆదేశాలతో శశికళ జైలుకు పోవడం, పళని–పన్నీరు వైరాలు, న్యాయపోరాటాలు, తరువాత కరచాలనాలు, వెన్నుపోట్లు ఇత్యాది పరిణామాలు అన్నాడీఎంకెను ఎంతగా బలహీనపరిచాయో తెలియందేమీ కాదు. తెరవెనుక బీజేపీ ఉన్నదనీ, తమిళనాడులో ప్రత్యక్షంగా కాలూనడానికి వీలుగా అమ్మ పార్టీని అదే బలహీనపరచిందని చాలామంది నమ్మకం. అదేతరహాలో అన్నాడీఎంకెను మళ్ళీ చీల్చడానికి అన్నామలై పావులు కదుపుతున్నారన్న అనుమానాల నేపథ్యంలో వేరుపడిన ఈ రెండుపార్టీలు, ఇప్పుడు మళ్ళీ చేయీచేయీ కలిపి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అన్నామలై స్థానంలోకి అన్నాడీఎంకె మాజీ నాయకుడైన నయనార్‌ నాగేంద్రన్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా వచ్చి మార్గాన్ని సుగమం చేశారు. అత్యంత బలంగా ఉన్న డీఎంకెను ఓడించడానికి ఉభయపక్షాలకు ఈ పొత్తు ముఖ్యం. మరీముఖ్యంగా, తమిళనాడులో కాలూనడం అంత సులభం కాదని ఈ పదేళ్ళకాలంలో తత్వం బోధపడిన బీజేపీకి అన్నాడీఎంకె ఊతం మరీ అవసరం. గత మూడు ఎన్నికల్లోనూ అంతగా లబ్ధిపొందని ఈ కూటమి కేవలం ఏడాదిలో ప్రజలను తనవైపు ఏమేరకు తిప్పుకోగలదో చూడాలి.

ఈ వార్తలు కూడా చదవండి:

Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..

MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

Updated Date - Apr 17 , 2025 | 06:00 AM