దశాబ్దాల అన్యాయానికి దిద్దుబాటు!
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:41 AM
దశాబ్దాలుగా తమకు తీరని అన్యాయం జరుగుతోందని బలంగా వాదిస్తున్న ఒక వర్గాన్ని సంతృప్తిపరచటం చాలా కష్టమైన పని. దాన్ని అధిగమించి లక్ష్యాన్ని సాధించటం అరుదు. తెలంగాణలో...

దశాబ్దాలుగా తమకు తీరని అన్యాయం జరుగుతోందని బలంగా వాదిస్తున్న ఒక వర్గాన్ని సంతృప్తిపరచటం చాలా కష్టమైన పని. దాన్ని అధిగమించి లక్ష్యాన్ని సాధించటం అరుదు. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలును నిస్సందేహంగా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎస్సీలకు గంపగుత్తగా అమలవుతున్న రిజర్వేషన్లను వెనుకబాటుతనం ప్రాతిపదికగా వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు కిందటి ఏడాది ఆగస్టు 1న ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును అమలుపరచటానికి తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రకటన, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, తదనంతరం జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్‌ను నియమించటంలోనూ ఆ వేగం కనపడింది.
షమీమ్ అక్తర్ కమిషన్ విస్తృతంగానే అభిప్రాయసేకరణ జరిపింది. వర్గీకరణకు వ్యతిరేక, అనుకూల వాదనలను పరిగణనలోకి తీసుకుని నివేదికను ఇచ్చింది. ఎస్సీల్లోని సంపన్న శ్రేణికి రిజర్వేషన్లను వర్తింపచేయకూడదన్న కీలక సిఫార్సు మినహా మిగతా వాటిని తెలంగాణ మంత్రివర్గం యథాతథంగా ఆమోదించిందనే భావించొచ్చు. మొత్తంగా ఎస్సీలను మూడు సమూహాలుగా విభజించి రిజర్వేషన్ల శాతాలను (9శాతం, 5శాతం, 1శాతం) కమిషన్ ప్రతిపాదించింది. ఆ శాతాల్లో మార్పులు చేయాలని ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం కమిషన్ సిఫార్సులకే కట్టుబడింది. అంబేడ్కర్ జయంతి రోజునే వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి తను అనుకున్న దాన్ని సాధించగలిగింది.
మొత్తంగా చూస్తే దశాబ్దాల నుంచి వర్గీకరణను గట్టిగా కోరుతున్న వర్గం నుంచి గరిష్ఠ సంతృప్తి వ్యక్తమైందనే చెప్పుకోవచ్చు. శాతాల విషయంలో అసంతృప్తులు ఉన్నా అవేమీ ప్రభుత్వంపై ఆగ్రహం పెట్టుకునే స్థాయిలో లేవు. వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో అసంతృప్తి, ఆగ్రహం ఉండటం సహజం. సంఖ్యాపరంగా తక్కువ ఉన్న కులాల్లో తమకు మరింత ఎక్కువ శాతం రిజర్వేషన్లు ఉండాలని కోరుకోవటాన్ని కూడా న్యాయబద్ధంగానే భావించొచ్చు. సామాజిక సామరస్యం దృష్ట్యా వీటిని కూడా ప్రభుత్వం పట్టించుకుని పరిష్కారమార్గాలు ఆలోచించాలి. ఒక నిర్ణయంతో జన సమూహాలు శత్రు శిబిరాలుగా మారకుండా చూడాల్సిన బాధ్యతా ప్రభుత్వంపై ఉంటుంది.
కులాల జనసంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించకూడదని వర్గీకరణ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. విద్య, ఉద్యోగాల్లో వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ల శాతాలను నిర్ణయించాలనీ చెప్పింది. అట్లాకాకుండా రాజకీయ లాభనష్టాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ల శాతాలను నిర్ణయిస్తే న్యాయస్థానాల తలుపులు తట్టవచ్చని కూడా ఖచ్చితంగానే ప్రకటించింది. షమీమ్ అక్తర్ కమిషన్ కూడా వీటిని పరిగణనలోకి తీసుకునే సిఫార్సులు చేసిందని కాంగ్రెస్ నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. వివిధ కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి ఖచ్చితమైన సమాచారం లభిస్తే కొన్ని అపోహలు తొలగిపోతాయి. ఎవరు ఎక్కడున్నారో స్పష్టమవుతుంది. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత సమగ్రంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే నిర్వహించామని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. సర్వేని నిర్వహించి తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని రాహుల్‌గాంధీ ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ సర్వేలో తేలిన అసలు నిజాలు ఇంకా వెలుగులోకి రాలేదు. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల జనాభా శాతాలను మాత్రమే ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రకటించింది. కనీసం ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎవరు ఎక్కడున్నారో తెలిపే గణాంకాలను సైతం బయటపెట్టలేదు. నిజానికి స్థూల శాతాలతో తెలిసిన కొత్త విషయం ఏదీ లేదు. ఏ రాష్ట్రంలోనైనా ఏడెనిమిది కులాలు మినహా మిగతావన్నీ రిజర్వేషన్ల కేటగిరీలోనే ఉంటాయి. సహజంగానే తెలంగాణలో వెల్లడైన శాతాల చిత్రమే అన్ని చోట్లా కనపడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల్లో ప్రాతినిధ్యం చుట్టూనే వర్గీకరణ ఉద్యమం ప్రధానంగా తిరిగింది కాబట్టి ఆ విషయంలో షమీమ్ అక్తర్ కమిషన్ తేల్చిన నిజాలు సంపూర్ణంగా వెల్లడైతే అసంతృప్తులు చల్లారే అవకాశం ఉంది. మాల, మాదిగ వర్గాలు చేస్తున్న వాదనల్లో సహేతుకత ఎంతో తెలుస్తుంది. ఏ ఉద్యమమైనా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టటానికి అసలు విషయాలకు అతిశయోక్తులను జోడిస్తుంది. దీన్ని తప్పుపట్టలేం! ప్రపంచవ్యాప్తంగా ఇది జరిగింది. ఇంకా జరుగుతోంది కూడా! కానీ, ఎప్పుడో ఒకప్పుడు నిజాలు వెల్లడి కావాలి. వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా షమీమ్ అక్తర్ నివేదికను ప్రజల ముందుంచటం పారదర్శకత దృష్ట్యా అత్యవసరం. గట్టి గణాంకాల ఆధారంగా వర్గీకరణ జరిగి, సామాజిక న్యాయం సంపూర్ణతను సంతరించుకుంటే దాన్నుంచి మరెందరో ప్రేరణపొందే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అజెండా అదే కదా!
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్గీకరణకు మార్గం సుగమమైంది. ఎస్సీ రిజర్వేషన్లను మూడు కేటగిరీలుగా విభజించి అమలుచేయటానికి మంగళవారం మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. వర్గీకరణకు ఉమ్మడి రాష్ట్రంలో మూడు దశాబ్దాల ఆందోళనకు రెండు తెలుగు రాష్ట్రాలు సముచిత రీతిలో స్పందించి మార్గదర్శకంగా నిలిచాయి.
కులాల్లో అంతర్గతంగానే గాక విభిన్న కులాల మధ్య నెలకొంటున్న అర్థిక అంతరాలు ఏ సమస్యనీ ఒకే దృక్పథంతో చూడనివ్వటం లేదు. ఇదొక సంక్షిష్ట పరిస్థితి. నిరంతరం మారిపోయే పరిస్థితి అని కూడా చెప్పుకోవాలి. రిజర్వేషన్లు బాగా అందుకున్న కులాలు... అలా అందుకోలేని కులాల మధ్య ఆర్థిక అంతరాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వర్గీకరణతో ప్రస్తుతానికి పరిష్కారం లభించినా కొత్త డిమాండ్లు ఈ అంతరాల ఆధారంగా ఇకపై రావని భావించలేం. అందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాల్సిందే! సంపన్నశ్రేణి సమస్యను ఎల్లకాలమూ వాయిదావేసే పరిస్థితీ ఉండకపోవచ్చు!
ఈ వార్తలు కూడా చదవండి:
Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..
MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..