Share News

Dhankhar controversy: ఆకస్మిక నిష్క్రమణ

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:20 AM

దైవానుగ్రహం తోడైతే, పదవీకాలం పూర్తయ్యేవరకూ ఉంటానని సరిగ్గా పన్నెండురోజుల క్రితం ఘంటాపథంగా చెప్పిన ఉపరాష్ట్రపతి, ఇంతలోనే, ఈమాదిరిగా నిష్క్రమిస్తారని ఊహించలేదు. గిట్టనివాళ్ళు కూడా...

Dhankhar controversy: ఆకస్మిక నిష్క్రమణ

దైవానుగ్రహం తోడైతే, పదవీకాలం పూర్తయ్యేవరకూ ఉంటానని సరిగ్గా పన్నెండురోజుల క్రితం ఘంటాపథంగా చెప్పిన ఉపరాష్ట్రపతి, ఇంతలోనే, ఈమాదిరిగా నిష్క్రమిస్తారని ఊహించలేదు. గిట్టనివాళ్ళు కూడా ఇంకా రెండేళ్ళు ఆయన రాజ్యసభాధ్యక్షస్థానంలో ఉంటారనీ, వేగకతప్పదనే అనుకున్నారు. తప్పుబట్టినవారు, పక్షపాతివంటూ నిందించినవారూ, నడకనీ మాటనీ నమస్కారం చేసే తీరునీ అవహేళన చేసినవారు సైతం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ నాలుగుమంచిమాటలతో, సగౌరవంగా సాగనంపితే బాగుంటుంది కదా అని జాలిపడుతున్నారు. నిర్ణయాన్ని పునరాలోచించుకోమని కూడా విజ్ఞప్తిచేస్తున్నారు. భారత ఉపరాష్ట్రపతి ఇలా అర్థంతరంగా నిష్క్రమించిన చరిత్ర ఇటీవలికాలంలో లేదు. రాష్ట్రపతి కావడానికో, మరో బాధ్యత చేపట్టడానికో రాజీనామా చేయడం చూశాం తప్ప, ఇలా రాత్రివేళ ఆ అత్యున్నత పదవిని వదిలేసిపోవడం లేదు. ధన్‌ఖడ్‌ అసాధారణ పోరాటశక్తి తెలిసిందే కనుక, ఆరోగ్యసమస్యలున్నప్పటికీ, ఈ నిష్క్రమణకు అవే అసలుకారణాలని ఎవరూ నమ్మడం లేదు. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమనుకున్నప్పటికీ, నిండుసభలో కరతాళధ్వనులతోనూ జరగాల్సిన ఈ అధికారిక ప్రక్రియ ఇలా ఒక రాత్రివేళ ట్వీటుతో ముగిసిపోవడం అమితాశ్చర్యం కలిగిస్తుంది. సోమవారం ఆయన రాజ్యసభ వర్షాకాల సమావేశాలను ఆరంభించారు, సభ్యులతో వాదించారు, ఆగ్రహించారు, అనునయించారు, సాయంత్రం వరకూ అంతే ఉత్సాహంతో ఉన్నారు.


ఆయన మర్నాటి ౧షెడ్యూల్‌ను కూడా రాజ్యసభ కార్యాలయం విడుదల చేసింది. కానీ, రాత్రి తొమ్మిదన్నర ప్రాంతంలో ఉపరాష్ట్రపతి అధికారిక ఎక్స్‌ఖాతాలో ఆయన రాజీనామాలేఖ ప్రత్యక్షమైంది, మర్నాడు మధ్యాహ్నం ప్రధానమంత్రి ఇకపై ఆరోగ్యం జాగ్రత్తంటూ సందేశాన్ని అందించారు, రాష్ట్రపతి ఈ రాజీనామాను ఆమోదించారు. అప్పటివరకూ అధికారపక్ష ప్రముఖులెవ్వరూ ఈ పరిణామం మీద నోరువిప్పలేదు. మోదీ ట్వీటు ఒక్కటి చాలు, తెర వెనుక ఆగ్రహాలు తెలియచెప్పడానికి. ఎందుకు, ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఆయన ఒకటీ రెండు కాదు, చాలా లక్ష్మణరేఖలు దాటాడని, ఆదిలో అడపాదడపా అలిగిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు అమితాగ్రహంతో స్పష్టమైన సందేశాన్ని అందించడంతోనే ఈయన వెళ్ళిపోవాల్సి వచ్చిందని అంటారు. ఉపరాష్ట్రపతి అయినా కూడా పార్టీ విధేయతనూ, రాజకీయ వాసనలను వదులుకోలేదన్నది ధన్‌ఖడ్‌మీద ఉన్న విమర్శ. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా మమతాబెనర్జీని మూడుచెరువుల నీళ్ళు తాగించి ఈ ఉన్నత పదవికి చేరిన ఈయన ప్రస్తుత విపక్షపాలిత గవర్నర్లకు ఆదర్శమని గిట్టనివారంటారు. ఆయన గొంతు గట్టిది. ఘాటుగా, రెచ్చగొట్టేట్టుగా, హద్దులు దాటి మరీ మాట్లాడగలరు. సభలో ఆయన ఆదేశాలు తీవ్ర ప్రతిష్ఠంభనకు, నిరసనలకు దారితీసిన సందర్భాలనేకం. ఇప్పుడు అనుకూలంగా మాట్లాడుతున్న ప్రతిపక్షమే అభిశంసనను ప్రతిపాదించిన తొలి ఉపరాష్ట్రపతి ఆయన. కొలీజియం వ్యవస్థమీద న్యాయమంత్రుల ఆరోపణలను ఏకంగా పోరాటస్థాయికి తీసుకుపోయి, ఆ వ్యవస్థను అనుమతించినందుకు ఎంపీలను తీవ్రంగా నిందించిన వ్యక్తి ధన్‌ఖడ్‌.


రాజ్యాంగాన్ని ప్రభుత్వ పెద్దలు చిత్తం వచ్చినట్టుగా మార్చడానికి రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతం అడ్డుపడుతున్నందుకు కేశవానందభారతి తీర్పునుంచి ఇటీవలి తీర్పులవరకూ అనేకం తప్పుబట్టి, న్యాయవ్యవస్థను సూపర్‌ పార్లమెంట్‌గా అభివర్ణించి, దాని చొరవను చొరబాటుగా ప్రకటించి, ప్రభుత్వపెద్దల మనసు గెలుచుకున్నానని అనుకున్నారాయన. ఇప్పుడు, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అభిశంసన ప్రయత్నాల్లో తమదే పైచేయి కావాలన్న అధికారపక్షం కలలను వమ్ముచేసి, విపక్షానిది పైచేయి కానిచ్చినందుకే ఇలా నిష్క్రమించాల్సివచ్చిందని విశ్లేషకుల వాదన. ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చు, తెరవెనుక వ్యూహాలూ కుట్రలూ అనేకం ఉండవచ్చు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ తనకుతానుగా చెప్పేవరకూ ఈ అర్థంతర నిష్క్రమణ గుట్టు ఎవరికీ తెలియదు. జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ మాదిరిగా దానిని ఎప్పటికైనా విప్పుతారేమో చూడాలి. ఉపరాష్ట్రపతి పదవి అత్యున్నతమైనది. దీని విషయంలో ఊహాగానాలు, పుకార్లు, కొనసాగడం దేశానికి అవమానం. నిజం తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉంది, దానిని వెనువెంటనే తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 05:20 AM