Shubhanshu Shukla: వెలుగుబాట
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:35 AM
‘ఒక వ్యక్తిగా నేను అంతరిక్షానికి ప్రయాణిస్తున్నప్పటికీ, అది 140 కోట్ల మంది భారతీయుల యాత్ర అని మనఃపూర్వకంగా విశ్వసిస్తున్నా’నని శుభాంశు శుక్లా అన్నారు. నలభై సంవత్సరాల అనంతరం అంతరిక్షానికి...

‘ఒక వ్యక్తిగా నేను అంతరిక్షానికి ప్రయాణిస్తున్నప్పటికీ, అది 140 కోట్ల మంది భారతీయుల యాత్ర అని మనఃపూర్వకంగా విశ్వసిస్తున్నా’నని శుభాంశు శుక్లా అన్నారు. నలభై సంవత్సరాల అనంతరం అంతరిక్షానికి ప్రయాణించనున్న ద్వితీయ భారతీయుడు శుక్లా. రాబోయే వారాలలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్లనున్న యాక్సియమ్–2 మిషన్ పైలట్‌గా ఆయన రోదసీయాత్ర చేయనున్నారు. వచ్చే ఏడాది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో మహాఆకాశంలోకి వెళ్లనున్న ప్రప్రథమ భారతీయ వ్యోమగాముల బృందంలో కూడా శుక్లా ఒకరు. యువ భారతీయుల మేధో శక్తి సామర్థ్యాలకు శుక్లా, గగన్‌యాన్‌లు వైయక్తిక, సాముదాయిక ప్రతీకలు. భారతీయ అంతరిక్ష పరిశోధనా పథ నిర్దేశకులు వేసిన వెలుగుబాటల వల్లే ఈ సమున్నత, సాహసిక యాత్రలు సాధ్యమవుతున్నాయి. ఈ దృష్ట్యా, గత శుక్రవారం నాడు 84 ఏళ్ల వయసులో మరణించిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, ఆయన జీవిత కృషి సంస్మరణకు, శుభాంశు శుక్లా, గగన్‌యాన్ ప్రస్తావన ఒక సముచిత నాందీ వాక్యమవుతుంది.
సమాజాభివృద్ధే అంతరిక్ష పరిశోధనలు ధ్యేయంగా ఉండాలని దృఢంగా విశ్వసించిన శాస్త్రవేత్త కస్తూరి రంగన్. ఇస్రో ఆరంభంలోనే ఆ సంస్థలో చేరిన రంగన్ మొదటి రెండు ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహాలు భాస్కర–1, 2ల రూపకల్పన, ప్రయోగాలకు సారథ్యం వహించారు. తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఐఆర్‌ఎస్–1 ఆయన నేతృత్వంలోనే రూపుదిద్దుకున్నది. ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్‌గా ఆయన దూరదృష్టి కారణంగానే భారతీయ భాషలలో కేబుల్ టీవీ కార్యక్రమాలు కోట్లాది కుటుంబాలకు అందుబాటులోకి వచ్చాయి. భారతీయ టీవీ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలకు చేరడం మొదలయింది. స్పేస్ ఫర్ సొసైటీ అన్న ఇస్రో లక్ష్య స్ఫూర్తితో టెలిఎడ్యుకేషన్‌కు ఎడ్యుశాట్, టెలిమెడిసిన్, కమ్యూనికేషన్‌కు ఇన్సాట్, జిశాట్ ఉపగ్రహాలు, ధరిత్రి వనరుల పరిశోధనకు రిసోర్స్‌శాట్, వాతావరణ పరిశోధనలకు మెట్‌శాట్, ఖగోళ అన్వేణలకు ఆస్ట్రోశాట్ మొదలైన వాటిని ఆయన సారథ్యంలోనే రూపొందించి ప్రయోగించడం జరిగింది. ఇవన్నీ గ్రామీణాభివృద్ధి, ప్రాకృతిక విపత్తుల నిర్వహణ, జాతీయ సంధాయతకతకు విశేషంగా తోడ్పడ్డాయి. భారతదేశ రోదసీ ఆకాంక్షల సాఫల్యానికి మేధో స్వావలంబనకు ఆయన చేసిన దోహదం అద్వితీయమైనది.
ఇస్రో డైరెక్టర్ (1994–2003)గా ప్రతిష్ఠాత్మక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను పరిపూర్ణంగా తీర్చిదిద్దారు. అలాగే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను కూడా జయప్రదంగా పరీక్షించారు. పిఎస్‌ఎల్‌విని ఉపయోగించడం ద్వారా చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపవచ్చని 1999లో వెలువరించిన ఒక చరిత్రాత్మక ప్రసంగంలో కస్తూరిరంగన్ ప్రతిపాదించారు. నాటి వాజపేయి ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు సానుకూలంగా ప్రతిస్పందించింది. చంద్రయాన్‌కు అంకురార్పణ జరిగింది. భారతదేశ ఈ మొదటి చంద్రయాత్ర అక్టోబర్ 2008లో ప్రారంభమై ఆగస్టు 2009 దాకా కొనసాగింది. చంద్రునిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించడం చంద్రయాన్–1 సాధించిన గొప్ప విజయం. భారతదేశ వైజ్ఞానిక ప్రతిభాపాటవాలకు అది అద్దం పట్టింది. చంద్రయాన్ విజయస్ఫూర్తితో ఇస్రో శాస్త్రవేత్తలు 2013లో మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) జయప్రదంగా నిర్వహించారు. అంగారక గ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించిన మొదటి ఆసియా దేశంగా భారత్ ఖ్యాతిగాంచింది. పదవీవిరమణ అనంతరం రాజ్యసభసభ్యుడుగా నియమితుడైన కస్తూరి రంగన్ ఇండో –అమెరికన్ పౌర అణు ఒప్పందం పార్లమెంటు ఆమోదం పొందేందుకు తన వాదనలతో తోడ్పడ్డారు. జాతీయ విద్యా విధానం– 2020 రూపకల్పనలో కూడా కీలక పాత్ర వహించారు. భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను రూపొందించి, ప్రయోగించిన బృందంలో సభ్యుడుగా ఉన్న నాటినుంచి చంద్రయాన్, మంగళ్‌యాన్ లకు స్ఫూర్తినిచ్చి, ప్రాతిపదికలు నిర్మించిన నాటిదాకా భారతీయ అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలపై కస్తూరి రంగన్ ముద్ర చెరిపివేయలేనిది. ఆయన మేధో కృషి జాతికి జ్ఞానేంద్రియం, దేశ భవిష్యత్తుకు శాశ్వత వెలుగుబాట.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్