Share News

Telangana Rashtra Samithi: రజతోత్సవ వేళ రగిలే ప్రశ్నలు

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:38 AM

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్రారంభం, కేసీఆర్ నాయకత్వం, మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అవినీతిపై విమర్శలు, అభివృద్ధి లోపాలు, నిరుద్యోగం, బడ్జెట్ సమస్యలు తెలంగాణ ప్రజలకు పెరిగిన సమస్యలుగా మారాయి

Telangana Rashtra Samithi: రజతోత్సవ వేళ రగిలే ప్రశ్నలు

తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావం, మనుగడ సమీక్షించుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దాని ఉత్థాన పతనాల పయనం ఏ పార్టీకైనా గుణపాఠమే. ఒక నిర్దిష్టమైన లక్ష్యం కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీ అది. 1970లలో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడి, తెలంగాణ డిమాండ్‌కు ఒక రాజకీయ ప్రతిపత్తి మొదటిసారి లభించిన తరుణమది. అనతికాలంలోనే అది కాంగ్రెస్‌లో విలీనమైంది. మళ్లీ తెలంగాణ ఆకాంక్ష సామూహికంగా విజృంభించడానికి రెండు దశాబ్దాల కాలం పట్టింది. ఆ తరువాత ప్రజాసంఘాలు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యావంతులే తొంభయవ దశకంలో మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారు. తెలంగాణ జనసభ వంటి సంఘాలు, మారోజు వీరన్న, గాదె ఇన్నయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవరావు జాదవ్, పాశం యాదగిరి, కొల్లూరి చిరంజీవి, ప్రొ. జయశంకర్, ప్రొ. బియ్యాల జనార్ధన్, బెల్లి లలిత వంటి వ్యక్తులు తెలంగాణ ఆకాంక్షను కాపాడడానికి శక్తిమేరకు కృషి చేశారు. భువనగిరి కేంద్రంగా సమీకరించబడిన ప్రజా చైతన్యం మరోసారి పోరుశంఖం పూరించింది. ఆ తరువాత ఈ ఉద్యమానికి రాజకీయ ప్రతిపత్తి లభించడం అనేది రెండవసారి కేసీఆర్ రూపంలోనే లభించింది. ప్రజల్లో రగులుకుంటున్న ఉద్యమ వేడిని కేసీఆర్ సరిగానే అంచనా వేశారు. 2001లో జలవిహార్ వేదికగా స్వీయ రాజకీయ పార్టీకి అంకురార్పణ చేశారు. ఇది నిజానికి చారిత్రాత్మక నిర్ణయం. అది మొదలు మలిదశ ఉద్యమం ఊరూరికి విస్తరించి తెలంగాణ ఆకాంక్ష మరింత పదునెక్కింది.


తెలంగాణ కావాలనుకునే ప్రతీ పౌరుడికి టీఆర్ఎస్ ఆశాదీపంగా కనిపించింది. తెలంగాణ కోసం గులాబీ జెండాను ప్రజలే నిలబెట్టారు. ఆ విధంగా నిలబెట్టడం వెనకాల రేపటి తెలంగాణ అభివృద్ధి ఆశ దాగి ఉంది. తెలంగాణ వస్తే తప్ప బాగుపడలేమనే అవగాహన ఉంది. అట్లా 2014లో సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించే వరకు ప్రజలు కేసీఆర్‌కు అండగా నిలిచారు. ప్రజలేమో ఇంతటి అంకితభావంతో ఉంటే, కేసీఆర్ మాత్రం పక్కా పొలిటీషియన్‌గా ప్రవర్తించారు. తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ శక్తి అవసరం అన్న ఆలోచన నుండి కేసీఆర్ యూటర్న్ తీసుకోవడం తెలంగాణ రాకముందే మొదలైంది. తెలంగాణ వస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించారు, మాట మీద నిలబడలేదు. ఆ తరువాత దళితుణ్ణే ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి తప్పాడు. ఈ మాట తప్పడం అనేది అధికారంలోకి వచ్చాక నిత్యకృత్యంగా మార్చుకున్నారు. ఏ తెలంగాణ నామ జపమైతే తనకు, తన పార్టీకి ఒక గుర్తింపును ఇచ్చిందో ఆ విషయాన్ని మరిచారు కేసీఆర్. పార్టీ పేరును ‘భారత రాష్ర్ట సమితి’గా మార్చుకొని దేశ రాజకీయాలవైపు అర్రులు చాచి, దారుణంగా విఫలమయ్యారు. ఎందుకంత రాజకీయ దురాశో ప్రస్తుతం కేసీఆర్ అండ్ కంపెనీ ఆలోచించుకోవాలి. ఇది తెలంగాణ ప్రజలను దారుణంగా అవమానించడమే. తెలంగాణ పేరునే కాదనుకోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడమే అని ప్రజలు గుర్తించారు. ఇక అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎందుకంత రాచరికపు పోకడలకు పోయారో ఈ రజతోత్సవవేళ ఆలోచించుకోవాలి. ఉద్యమం ద్వారా పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆ రకమైన పోకడ దేనికోసం? అన్నది ప్రజలకు చెప్పాలి.


రాచరికవ్యవస్థలో రాజులకు అహంకారం ఉన్నట్టు కేసీఆర్ కూడా అదే రీతిగా వ్యవహరించి ఎవ్వరినీ లెక్కచేయలేదు. కనీసం తన క్యాబినెట్లోని మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా కంచెలు కట్టుకోవడం దేనికన్నది రజతోత్స సభలో చెప్పాలి. ఇక అసెంబ్లీకి సైతం రాకుండా చట్టసభలను అవమానిస్తూ ఫాంహౌజుకే పరిమితం కావడం వెనకాల ఉన్న మతలబు ఏమిటో కూడా చెప్పాలి. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ర్టం ఎట్లా అప్పుల పాలైందో కూడా తెలియజేయాలి. కనీసం ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి ఎట్లా తన నాయకత్వంలో తీసుకెళ్లారో వివరించాలి. అంతేకాదు తెలంగాణ కోసం తమ విలువైన ప్రాణాలను బలిదానమిచ్చిన 1300 మంది అమరవీరుల కుటుంబాలకు ఏం చేశారో చెప్పాలి. తెలంగాణ రాష్ర్ట సాధనలోని ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి ఉద్యోగాల భర్తీ. తెలంగాణలో ఉన్న 12 యూనివర్సిటీల్లో కనీసం ఒక్క కొలువునైనా ఎందుకు భర్తీ చేయలేకపోయారో చెప్పాలి. తమ జేబులు నింపడానికి, తమ కుటుంబ నేతల బొజ్జలు నింపడానికి జరిగిన ప్రాజెక్టుల అవినీతి మీద వివరణ ఇవ్వాలి. ఏ రాష్ర్టమైనా అభివృద్ధి చెందడానికి విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి జరగాలి. మరెందుకు ముఖ్యమైన ఈ రంగాలకు బడ్జెట్‌ను తగ్గించి విద్యా, వైద్య రంగాలను దశాబ్దకాలం పాటు నిర్వీర్యం చేశారో ప్రజలకు కేసీఆర్ వివరించాలి. పైగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారేలా అమలు చేసిన ‘కేసీఆర్ మద్యం పాలసీ’ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసి, ఎన్ని కుటుంబాలను కుప్పకూల్చిందో ఈ గులాబీ పండుగ వేళ సమాధానం చెప్పాలి. తనకు అధికారం మూడోసారి ఎందుకు ప్రజలు కట్టబెట్టలేదో విడమరిచి చెప్పాలి. తన నాయకత్వంలో అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ, నిరుద్యోగ తెలంగాణ, బాధల తెలంగాణ, మద్యం తెలంగాణను ఎట్లా తయారు చేశారో ప్రజలకు వివరించాలి. అప్పుడే ఈ రజతోత్స సభకు అర్థం, పరమార్థం. లేకుంటే తెలంగాణ ప్రజల విశ్వసనీయతను కూడగట్టుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు.

పసునూరి రవీందర్

Updated Date - Apr 26 , 2025 | 05:40 AM