Maoist Peace Negotiations: శాంతి చర్చలు జరగాలి
ABN , Publish Date - Apr 23 , 2025 | 02:44 AM
మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమవడం అనేది అనూహ్యమైన పరిణామం, అయితే దీనితో పాటు గిరిజనుల పరిస్థితి మరింత కష్టంగా మారింది. ప్రభుత్వాలు, మావోయిస్టుల మధ్య ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు, శాంతి చర్చలన్నీ సమగ్రంగా, విస్తృత దృక్పథంతో జరగాలని కవితా రచయిత గారి సూచన

రాజ్యాధికారమే లక్ష్యమని, అందుకు దీర్ఘకాలిక సాయుధ పోరాటమే ఏకైక మార్గమని ప్రకటించిన మావోయిస్టులు... కారణాలు ఏమైనా కావచ్చు, కాల్పులు విరమించి ప్రభుత్వాలతో చర్చలకు సిద్ధం కావడం అసాధారణ విషయమే. రెండుమూడు రోజులకొకసారి ఇరవై, ముప్పై మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో చనిపోతున్న వార్తలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. దానికి ప్రతిగా మందుపాతరలు పెట్టి పోలీసులను, ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే పేరిట గిరిజనులను, దళితులను మావోయిస్టులు చంపడమూ చూస్తూనే ఉన్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 2026 నాటికి మావోయిస్టులందరినీ ఏరిపారేస్తామని తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. రాబోయే సంవత్సర కాలంలో మరెన్ని భయానక పరిణామాలు చూడాల్సి వస్తుందోనని ఆందోళనపడుతున్న సమయాన శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టుల ప్రకటన అందరికీ ఊరట కలిగించింది. కేంద్ర ఆంక్షలు పెడుతోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది కానీ ఇది ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని విశాల దృక్పథంతో వ్యవహరించి, శాంతి చర్చలను సఫలీకృతం చేయాలి. దశాబ్దాలుగా జరుగుతున్న నక్సలైట్ల ఉద్యమ ఫలితంగా వేలాది నక్సలైట్లు చనిపోయారు. వందలాది పోలీసులు చనిపోయారు. అయితే ఈ ఉద్యమంలో అత్యధికంగా నష్టపోతున్నది అడవి బిడ్డలైన గిరిజనులే. నక్సలైట్లకు సహకరిస్తున్నారని పోలీసులు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని నక్సలైట్లు... గిరిజనులను చంపడం ఆనవాయితీగా మారింది. అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ, పనులు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులు నిత్యం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో దినదిన గండంగా బతకాల్సి వస్తోంది. అసలే విద్యా, వైద్య వసతి, రహదారులు వంటి మౌలిక వసతులులేవు. వాటిని అడిగినా అణచివేసే పరిస్థితే ఉంటోంది.
ఈ పరిస్థితుల నుంచి బయటపడాలని సగటు గిరిజనులు కోరుకుంటున్నారు. శాంతి చర్చలు సాఫీగా జరిగి, మావోయిస్టులు కాల్పులు విరమించి, అజ్ఞాతాన్ని వీడి, ప్రజా స్రవంతిలోకి రావాలని పౌర సమాజం కోరుకుంటోంది. మావోయిస్టులు, వారికి మద్దతిస్తున్న గిరిజనులంతా ప్రభుత్వాలు నిర్మూలించాల్సిన శత్రువులన్నట్లుగా చేస్తున్న కేంద్ర హోంమంత్రి ప్రకటనలు సరైనవి కావు. మావోయిస్టులను అణచటం కోసం వేలాది భద్రతా దళాలను సంవత్సరాల తరబడి దండకారణ్యంలో ఉంచాల్సి రావడం, మావోయిస్టుల ఎన్‌కౌంటర్ల పేరిట అమాయక గిరిజనులను చంపడం, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేవి తప్ప, పెంచేవి కావు. మావోయిస్టులు శాంతి చర్చలకు రావడాన్ని అందిపుచ్చుకొని, చిత్తశుద్ధితో ఆహ్వానించి, సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రతినిధులు సమావేశం కావాలి. చర్చలు సామరస్యంగా జరిగి, సమస్య పరిష్కరం కావాలని ఆశిద్దాం.
– జి. రాములు గౌరవ అధ్యక్షులు, తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం