Share News

ఆ స్కాంలన్నీ బలాదూర్‌!

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:42 AM

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారి ఆయనను చుట్టుకోబోతున్నాయా? నాటి పాపాలలో చేదోడు వాదోడుగా ఉండిన వాళ్లు ఇప్పుడు అడ్డం తిరిగి...

ఆ స్కాంలన్నీ బలాదూర్‌!

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారి ఆయనను చుట్టుకోబోతున్నాయా? నాటి పాపాలలో చేదోడు వాదోడుగా ఉండిన వాళ్లు ఇప్పుడు అడ్డం తిరిగి ఆయా కేసులలో కుండబద్దలు కొట్టినట్టు అప్పుడు ఏమి జరిగిందో విచారణాధికారులకు చెప్పేయబోతున్నారా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ప్రకటన ఈ అనుమానాలను రేకెత్తిస్తోంది. జగన్‌రెడ్డి హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అని, కాకినాడ పోర్టు యాజమాన్యం చేతులు మారడంలో కర్త, కర్మ, క్రియ ప్రస్తుత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డి అని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. భయం అనేది తన రక్తంలో లేదని, అప్పట్లో ఏం జరిగిందో విచారణాధికారుల ఎదుట చెప్పేస్తానని కూడా ఆయన స్పష్టంచేశారు. మరోవైపు మద్యం కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. మద్యం కొనుగోళ్లలో అప్పట్లో కీలకంగా వ్యవహరించిన వాళ్లు ఒక్కొక్కరుగా న్యాయాధికారి ఎదుట 164 కింద వాంగ్మూలం ఇస్తున్నారు. ఈ క్రమంలో సత్యప్రసాద్‌ అనే అధికారి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాతో పాటు కేసీఆర్‌ కుమార్తె కవిత ప్రభృతులు జైలుకు వెళ్లి వచ్చారు. తాజాగా కేరళ, తమిళనాడులో చోటుచేసుకున్న మద్యం కుంభకోణాలు కలకలం సృష్టిస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తు కాగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి పాలనలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం లోతుల్లోకి వెళుతున్నప్పుడు విచారణ అధికారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒకటి కాదు–రెండు కాదు.. ఐదేళ్లలో పది వేల కోట్లకు పైగా చేతులు మారినట్టు ఇప్పటివరకు జరిగిన విచారణలో స్పష్టమవుతోంది. యావత్‌ దేశం బిత్తరపోయేలా చోటుచేసుకున్న ఈ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అని విజయసాయిరెడ్డి చెబుతున్నప్పటికీ సొమ్ములు మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌కు ప్రవహించాయని తేటతెల్లమవుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే ఈ కుంభకోణానికి సంబంధించిన స్కెచ్‌ను అమలు చేశారు. దీన్నిబట్టి తాము అధికారంలోకి వస్తే ఏయే రంగాలలో ఎంతెంత దోచుకోవచ్చో జగన్‌ అండ్‌ కో ముందుగానే స్కెచ్‌ రూపొందించుకున్నారని అర్థమవుతోంది. అవినీతి కేసులలో అరెస్టయి పదహారు నెలలు జైల్లో గడిపిన జగన్‌రెడ్డి, ఆ సమయంలో భవిష్యత్తులో అధికారం లభిస్తే ఏం చేయాలో బ్లూ ప్రింట్‌ రూపొందించుకున్నారని ఆయనతో అప్పట్లో సన్నిహితంగా ఉన్నవాళ్లు చెబుతారు. సంక్షేమం పేరిట ప్రజలను మాయ చేస్తూ చాటుగా ఎలా దోచుకోవాలో ప్రణాళికలు రూపొందించుకున్నారట. ఈ కారణంగానే 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా రంగాలలో దోపిడీకి తెర తీశారు. మామూలుగా అయితే కొత్తగా అధికారంలోకి వచ్చినవాళ్లు పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి కనీసం ఆరు నెలలు సమయం పడుతుంది. దోచుకోవడానికి ఉన్న అవకాశాలను గుర్తించడానికి కూడా సమయం పడుతుంది. ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ల పాటు పనిచేసిన చంద్రబాబు కూడా ఇప్పుడు పరిస్థితులను చక్కదిద్దడానికి ఆరు నెలలకు పైగా సమయం పట్టిందని చెబుతున్నారు. అలాంటిది ముఖ్యమంత్రిగా ఏ మాత్రం అనుభవం లేని జగన్‌రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నాటి నుంచే తాను రూపొందించుకున్న దోపిడీ స్కెచ్‌ను అమలు చేయడం మొదలు పెట్టారు. ఈ స్కెచ్‌ అమలులో సహకరించే అధికారులను గుర్తించి అంతే వేగంగా ఆయా స్థానాలలో నియమించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏయే అధికారులను ఏయే పోస్టులలో నియమించాలో నిర్ణయించుకొని అంతా సెట్‌ చేసుకున్నారు. అందుకే ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా అధికారంలోకి రాగానే దోపిడీ మొదలుపెట్టారు. మద్యం కుంభకోణం ఒక్కటి చాలు నాటి పాలకులు ఎంతటి ఘనాపాటీలో చెప్పడానికి! రజత్‌ భార్గవ వంటి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కూడా ఈ కుంభకోణం సాఫీగా జరగడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారంటే ఆ స్కాం లోతు తెలుస్తోంది. పైనుంచి కింది వరకు ఎవరి వాటాలు వారికి నెలవారీగా అందేవట. ఏపీ బ్రూవరీస్‌ కార్పొరేషన్‌ను ప్రభుత్వ సంస్థగా కాకుండా ప్రైవేటు సంస్థలా నడిపారు. భారతి సిమెంట్‌లో పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి తన మనుషులతో మద్యం అమ్మకాలను పర్యవేక్షించేవారు. ఆయన మనుషులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించడం హైలైట్‌.


ఓ డిస్టిలరీ.. 200 కోట్ల బంగారం!

ఈ మద్యం కుంభకోణంపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ అధికారులు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు న్యాయాధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి అందిన ఆదేశాల ప్రకారం బ్రూవరీస్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఎక్సైజ్‌ అధికారులు– విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డిలను కలిసి ఏయే డిస్టిలరీల నుంచి ఎంతెంత మద్యం కొనుగోలు చేయాలో ఆదేశాలు తీసుకునేవారు. ఈ ముగ్గురి కనుసన్నల్లోనే అంతా జరిగేదట! ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాత్ర నేరుగా ఎక్కడా కనిపించేది కాదు. కానీ, ఆదేశాలు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే వచ్చేవి. డిస్టిలరీస్‌ నుంచి లభించిన ముడుపులను కూడా మూల విరాట్‌ ఆదేశాల ప్రకారం ఎక్కడకు చేర్చాలో అక్కడకు చేర్చేవారు. మద్యం మాఫియా అంటే ఇది కదా? హవాలా వ్యాపారానికే మెళకువలు నేర్పించిన మనుషులు వీళ్లు. హైదరాబాద్‌లోని ఒక డిస్టిలరీ యాజమాన్యం 200 కోట్ల రూపాయలతో దాదాపు మూడున్నర క్వింటాళ్లు, అంటే 350 కిలోల బంగారు నాణేలను కొనుగోలు చేసింది. పద్మావతి జ్యువెలర్స్‌ అనే సంస్థకు సదరు డిస్టిలరీ నుంచి 200 కోట్ల రూపాయలు చెక్కు రూపంలోనే అందాయి. ఆ డబ్బు తీసుకున్న పద్మావతి జ్యువెలర్స్‌ సంస్థ 350 కిలోల బంగారాన్ని నాణేలుగా మార్చి అందజేసింది. సదరు బంగారాన్ని అహ్మద్‌ అనే వ్యక్తికి ఇవ్వవలసిందిగా సదరు డిస్టిలరీ కంపెనీ ఆథరైజేషన్‌ లేఖను పద్మావతి జ్యువెలర్స్‌కు ఇచ్చింది. బంగారు నాణేలు తీసుకున్న అహ్మద్‌ అనే వ్యక్తి వాటిని ఎవరికి అందజేసి ఉంటారో తదుపరి విచారణలో తేలుతుంది. ఏ డిస్టిలరీ కంపెనీ అయినా ముడి సరుకు కొంటుంది. బంగారం ఎందుకు కొంటుంది? అది కూడా 200 కోట్ల రూపాయలతో దాదాపు 350 కిలోల బంగారం ఎందుకు కొంటుంది? దీన్నిబట్టి ఈ కుంభకోణంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్క డిస్టిలరీకి సంబంధించిన మొత్తం ఇంత ఉంటే మిగతా డిస్టిలరీల నుంచి ఇంకెంత మొత్తం చేతులు మారిందో ఊహించుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో మొత్తం 200 కోట్లు మాత్రమే ముడుపులుగా అందాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఇక్కడ ఒక్క డిస్ట్టిలరీనే 200 కోట్లతో బంగారం కొన్నది. అంటే కుంభకోణం ఎంత పెద్దదో, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయో అంచనా వేయడం కష్టం కాదు. పేదలతో నాసిరకం మద్యాన్ని తాగించి పాపపు సొమ్ము మూటగట్టుకున్న వారికి ఆ పేదల ఉసురు తగలదా? నాసిరకం మద్యం తాగి ఎందరో మరణించగా, మరెందరికో కిడ్నీలు పాడయ్యాయి. వీరి ఉసురు ఊరికే పోతుందా? ఈ పాపంలో ఎవరి వాటా ఎంతో తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు. పేదల ఉసురు మాత్రం ఊరికే పోదు. ఇందులో అవినీతి మాత్రమే కాదు.. పాపం కూడా ఉంది. పేదల శవాల మీద పేలాలు ఏరుకున్నారు. మద్యం వ్యాపారం చేసిన ఏ కుటుంబం కూడా బాగుపడిన దాఖలాలు లేవు. విజయ మాల్యానే తీసుకుందాం. లిక్కర్‌ వ్యాపారానికి పర్యాయ పదంగా ఉండిన విజయ మాల్యా ప్రస్తుత దుస్థితి తెలిసిందే. అలాగే తెలుగు రాష్ర్టాలలో మద్యం వ్యాపారం చేసిన కుటుంబాలు కూడా రెండవ తరం వచ్చేసరికి చితికిపోయాయి. అలాంటిది ఇంత దారుణంగా స్పిరిట్‌లో నీళ్లు, రంగు కలిపి నాసిరకం మద్యం సరఫరా చేసి తాగించిన వాళ్లు మాత్రం బాగుపడతారా? డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఇంత నీచానికి, అందునా అధికారంలో ఉన్నవారు పాల్పడ్డారంటే అది వారి మనో వికారాలకు అద్దం పడుతోంది. అధికారంలో ఉన్నవాళ్లు ఈ స్థాయిలో వ్యవస్థీకృత నేరాలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు వ్యక్తులకు మేళ్లు చేసి లబ్ధి పొందడం పరిపాటి అయింది. జగన్‌రెడ్డి హయాంలో మాత్రం నాసిరకం మద్యం సరఫరా చేసి కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటం ఆడారు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవడం వేరు.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడటం వేరు.


సాయిరెడ్డి.. రాజ్యసభ వేట!

ఇప్పుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారానికి వద్దాం. మద్యం కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పవలసి వస్తే భవిష్యత్తులో చెబుతానని ఆయన స్పష్టంచేశారు. దీన్నిబట్టి ఆ కుంభకోణం నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం మరిన్ని వివరాలను బయటపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ కుంభకోణానికి సంబంధించి సిట్‌ అధికారులు ఇప్పటికే అనేక రుజువులు సేకరించారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డిని కూడా అధికారులు త్వరలోనే విచారణకు పిలుస్తారు. అప్పుడు ఆయన నిజంగా నోరు విప్పుతారో లేదో చూడాలి. న్యాయాధికారి ఎదుట అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ప్రస్తుతానికి విజయసాయిరెడ్డి ఈ కుంభకోణంలో ఒక నిందితుడిగా ఉన్నారు. మరిన్ని వివరాలు చెబుతానని అంటున్నందున విజయసాయిరెడ్డి ఈ వ్యవహారంలో అప్రూవర్‌గా మారతారా? అనే అనుమానం వస్తోంది. ఈ కుంభకోణంతో తనకు ఏ సంబంధం లేదని ఆయన చెప్పలేదు. ప్రారంభంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉండిందని ఇప్పటికే అధికారులు సాక్ష్యాధారాలు సేకరించారు. వాస్తవంలో కూడా అధికారం కోల్పోవడానికి రెండేళ్ల ముందు విజయసాయిరెడ్డిని ఆ వ్యవహారం నుంచి తప్పించారు. వాటాల విషయంలో విభేదాలు రావడం వల్లనే ఆయనను తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాల మేరకు తప్పించినట్టు చెబుతారు. ముడుపుల చేరవేతలో అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పాత్ర కూడా ఉంది. మద్యం వ్యవహారం నుంచి తప్పుకోవలసిందిగా ఈ ఇద్దరు అధికారులే ముఖ్యమంత్రి తరఫున విజయసాయిరెడ్డికి సూచించారని తెలిసింది. కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, మిథున్‌రెడ్డిని కూడా విచారిస్తే మరిన్ని విస్తుగొలిపే నిజాలు బయటకు రావొచ్చు. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. ఇప్పుడు జగన్‌రెడ్డి పాలనలో చోటుచేసుకున్న పాపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నాడు ఆ పాపాలలో పాలుపంచుకొన్న వారే ఇప్పుడు వాటిని బయటపెడుతున్నారు. పాపం పండుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. అది విజయసాయిరెడ్డి రూపంలోనా లేక మరొకరి రూపంలోనా అని తేలడానికి మరికొంత సమయం వేచి చూడాలి. బ్రూవరీస్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నోరు విప్పితే మూల విరాట్‌ ముసుగు తొలగవచ్చు. భయం అనేది తన రక్తంలోనే లేదని విజయసాయిరెడ్డి బయటకు చెబుతున్నప్పటికీ ఆయనకు ప్రాణ భయం పట్టుకుంది. వివేకానందరెడ్డి హత్య ఉదంతంలో ఏం జరిగిందో, హత్య వెనుక ఎవరెవరు ఉన్నారో పూర్తిగా తెలుసు కనుక విజయసాయిరెడ్డి భయపడకుండా ఎలా ఉంటారు? వైఎస్‌ రాజశేఖరరెడ్డి సొంత సోదరుడు, జగన్‌ చిన్నాన్న అయిన వివేకానందరెడ్డిని అలవోకగా చంపేసిన వారికి విజయసాయి రెడ్డిపై గొడ్డలి వేటు వేయడం పెద్ద పని కాకపోవచ్చు.


ఈ కారణంగా మద్యం కుంభకోణంలో మూల విరాట్‌ ముసుగు తొలగే వరకైనా విజయసాయిరెడ్డికి భద్రత కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా చనిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతానికి ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉన్నారు. సాక్షుల మరణాలు చూస్తుంటే పరిటాల రవి హత్య కేసులో నిందితులు కూడా ఒక్కొక్కరు చనిపోవడం గుర్తుకొస్తోంది. పరిటాల రవి హత్యలో పాల్గొన్న వారందరూ దాదాపుగా హత్యకు గురయ్యారు. బావ కళ్లలో ఆనందం చూడాలనుకున్న మొద్దు శీనును కూడా చంపేశారు. రవి హత్యకు స్కెచ్‌ రూపొందించిన మద్దెలచెర్వు సూరి కూడా చివరకు హత్యకు గురయ్యారు. హత్యా రాజకీయాలలో ఇదొక కొత్త మలుపు. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు కాకుండా సాక్షులు చనిపోతున్నారు. ఇంతే తేడా! ఈ చావుల వెనుక ఎవరున్నారో ప్రస్తుతానికి ఆ పరమాత్ముడికే ఎరుక. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా చావులు ఆగకపోవడం వింతగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించని పక్షంలో దస్తగిరి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడవచ్చు. అతను జీవించి ఉండని పక్షంలో వివేకానందరెడ్డి హత్య కేసు కథ కంచికి చేరుకుంటుంది. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత అలుపెరుగకుండా ఆరేళ్లుగా చేస్తున్న పోరాటం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణం విషయంలో కూటమి ప్రభుత్వం మరింత ఆచితూచి వ్యవహరించాలి. నాటి పాపాలను బయటపెట్టడానికి సిద్ధపడిన అధికారులకు, ఇతరులకు రక్షణ కల్పించాలి. వేంకటేశ్వరస్వామి సాక్షిగా తాను నిజమే చెబుతానని విజయసాయిరెడ్డి చెబుతున్నప్పటికీ ఆయన కాకినాడ పోర్టు విషయంలో నిజాలను మింగేశారు. విజయసాయి నిజంగా నిజం చెబుతానంటే ఆయనను ఎరిగిన వారెవరూ నమ్మరు. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే విక్రాంత్‌రెడ్డి రంగ ప్రవేశం చేసి పోర్టు యాజమాన్యం చేతులు మారే ప్రక్రియను పూర్తి చేయించారు. అయినా తనకు తెలిసి ఇందులో జగన్‌రెడ్డి ప్రమేయం లేదని విజయసాయిరెడ్డి చెబుతున్నారంటే ఆయనను నమ్మలేం. రాజకీయాలకు దూరమవుతానని ప్రకటించిన విజయసాయిరెడ్డి, ఇతర రాష్ర్టాల నుంచి రాజ్యసభ సీటును డబ్బుతో కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో అటువంటి అవకాశం ఉంటుందేమోనని ఆయన ఆరా తీశారు. అయితే తమిళనాట ద్రవిడ పార్టీలు డబ్బు కోసం రాజ్యసభ సీట్లు అమ్ముకోవని, పార్టీని నమ్ముకున్న వారికే ఆ సీట్లు కట్టబెడతాయని తేలడంతో ఆయన తన ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇప్పుడు ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ర్టాల నుంచి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీన్నిబట్టి విజయసాయిరెడ్డి నమ్మదగిన వ్యక్తి కాదని, మాట మీద నిలబడరని అర్థమవుతోంది. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీకి కూడా తను రాజీనామా చేసినప్పుడు పెద్దగా పట్టించుకోని ఆ పార్టీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించడం విశేషం. జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసేవారా? అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ప్రశ్నించారు? నిజమే– జగన్‌రెడ్డి వద్ద విజయసాయిరెడ్డికి అవమానాలు కొత్త కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా మౌనంగా భరించారు. ప్రధానమంత్రి కార్యాలయంతో సంబంధాలను విజయసాయిరెడ్డి చూసేవారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ, ప్రధానమంత్రిని కలవడానికి వెళ్లిన అప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇకపై తన తరఫున అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్న చూసుకుంటారని ప్రధాని కార్యాలయం అధికారులతో విజయసాయిరెడ్డి సమక్షంలోనే చెప్పారు. అయినా ఆయన అప్పుడు మౌనంగానే ఉండిపోయారు. ఆర్థిక నేరాలు చేయడంలో అవిభక్త కవలలుగా వ్యవహరించిన జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి నిజంగా విడిపోతే పాపం పండినట్టే. అవినీతి కేసులలో కాకపోయినా మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతారా? అన్నదే ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్న.


తెలంగాణలో చావు భాష!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ జమానా అరాచకాల విషయం అలా ఉంచితే, తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు చావు భాష వినిపిస్తోంది. నిన్నటివరకు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకులు, శాసనసభ్యులు జుగుప్సాకరమైన భాషను వాడేవారు. తెలుగు ప్రజలు ఆ భాషను మౌనంగా భరిస్తూ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణలో నాయకులు భాష విషయంలో అదుపు తప్పలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా పరిస్థితి మారుతోంది. రాష్ర్టానికి సంబంధించిన అంశాలను కేంద్రం నుంచి సాధించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలని, అది కూడా చచ్చే వరకు దీక్ష చేయాలని కేటీఆర్‌ కటువుగా అన్నారు. ఆమరణ నిరాహార దీక్ష అనడం వేరు, చచ్చే వరకు దీక్ష అనడం వేరు. కేటీఆర్‌ మాటలతో నొచ్చుకున్నారో ఏమో తెలియదు గానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా తాజాగా నోరు జారారు. కేసీఆర్‌ స్టేచర్‌ నుంచి స్ట్రెచర్‌ మీదకు వచ్చారని, ఇలాగే వ్యవహరిస్తే మార్చురీకి వెళతారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమైనప్పటికీ బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు వాడాల్సిన భాష ఇది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి భాషను మాట్లాడిన వారు ఏం బావుకున్నారు? అలాంటి భాషను ప్రోత్సహించిన జగన్‌రెడ్డి కూడా 11 సీట్లకే పరిమితమయ్యారు. వైసీపీతో పాటు రాష్ట్రం కూడా దెబ్బతింది. రాజకీయాలు కలుషితమయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో ఈ జాడ్యం అవసరమా? రాజకీయాలు హుందాగా ఉండాలే గానీ రొచ్చుగా మారకూడదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తనకు ఉన్న అక్కసును కేటీఆర్‌ దాచుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కూడా కేసీఆర్‌ కుటుంబంపై అంతే అక్కసుగా ఉంటున్నారు. అటు కేసీఆర్‌ అండ్‌ కో ఇటు రేవంత్‌రెడ్డి అండ్‌ కో ఇకనైనా పరుష పదజాలానికి దూరంగా ఉండాలి. వాద ప్రతివాదాలు వేరు, దూషించుకోవడం వేరు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. హద్దు మీరిన వారిని తగిన సమయంలో శిక్షిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో కూర్చొని తమ భాషా నైపుణ్యంతో ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా సభలో నవ్వులు పూయించే వారు. ఆ ఇరువురు నాయకుల వాగ్ధాటి ముచ్చటగా ఉండేది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి కూడా వారిపై కోపగించుకునేవారు కారు. అంతే స్పోర్టివ్‌గా బదులిచ్చేవారు. దూషణ భూషణల వల్ల నాయకుల స్థాయి గానీ, ఔన్నత్యం గానీ పెరగదు. ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది మాజీ మంత్రులను ఇప్పటికీ బూతుల మంత్రులని పిల్లలు కూడా పిలుచుకోవడాన్ని తెలంగాణ రాజకీయ నాయకులు గుర్తించి తమను తాము సంస్కరించుకుంటే మంచిది. రాజకీయాల్లో ఉన్నవారు ప్రత్యర్థుల చావు కోరుకోవడం సమర్థనీయం కాదు. ఇకనైనా తెలంగాణలో ప్రజలు ఎంత స్వచ్ఛంగా ఉంటారో రాజకీయ నాయకులు కూడా అలాగే ఉండాలని, ఉంటారని కోరుకుందాం!

ఆర్కే

Also Read:

ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన.. విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

టీడీపీ కార్యకర్త హత్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. పుంగనూరు పోలీసులకు షాక్..

For More Telangana News and Telugu News..


2-Ed.gif

యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - Mar 16 , 2025 | 04:37 AM