జగన్ పాల్పడిన మద్య పాతకం!
ABN , Publish Date - Apr 27 , 2025 | 02:04 AM
ఇంటి గుట్టు లంకకు చేటుగా మారనుందా? ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణంలో ‘సిట్’ అధికారులు తవ్వుతున్న కొద్దీ వెలుగులోకి వస్తున్న విషయాలను...

ఇంటి గుట్టు లంకకు చేటుగా మారనుందా? ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణంలో ‘సిట్’ అధికారులు తవ్వుతున్న కొద్దీ వెలుగులోకి వస్తున్న విషయాలను గమనిస్తే ఇది నిజం అని నమ్మాల్సిందే! ఈ కుంభకోణానికి సంబంధించిన మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్నాయని, ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు సిట్ అధికారులకు చెబుతున్న దాన్నిబట్టి అర్థమవుతోంది. మద్యం ఉత్పత్తి కంపెనీలు ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం సహజం. అయితే, మద్యం కొనుగోళ్లలో అధికారంలో ఉన్నవాళ్లు గతంలో పెద్దగా జోక్యం చేసుకొనేవారు కారు. డిమాండ్‌కు అనుగుణంగా ఆయా కంపెనీలకు చెందిన మద్యాన్ని అధికారులే కొనుగోలు చేసేవారు. 2019 వరకు ఇదే విధానం తెలుగునాట అమల్లో ఉంది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని సమూలంగా మార్చి దాన్నొక పాడి ఆవుగా చేసుకున్నారు. పాపులర్ అయిన బ్రాండ్లను పక్కనబెట్టి, కమీషన్లు ముట్టజెప్పిన కంపెనీల మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేసే విధానాన్ని తెరమీదకు తెచ్చారు. ఊరూ పేరూ లేని కంపెనీలను సృష్టించి, వాటి ద్వారా నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయించి కొనుగోలు చేశారు. ఫలితంగా పలువురు మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోగా, మరెందరో అనారోగ్యం పాలయ్యారు. ఈ కుంభకోణానికి పాల్పడిన వారు కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము జేబులో వేసుకోవడంతోపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ కారణంగా దీన్నొక ఆర్థిక నేరంగానే కాకుండా ప్రజల చావుకు కారకులుగా గుర్తించి కేసు కట్టాల్సిన అవసరం ఉంది.
కమీషన్లకోసం కసరత్తు
మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న నాటి పాలకులు మద్యం కొనుగోళ్ల విధానం రూపకల్పనకు భారీ కసరత్తు చేశారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే అధికారులను ఏరికోరి మరీ తెచ్చుకొని మద్యం కొనుగోళ్ల బాధ్యతను అప్పగించారు. ఇసుక, మద్యంను సొంత ఆదాయ వనరులుగా మార్చుకున్న ఘనత జగన్ అండ్ కోకు మాత్రమే చెల్లింది. గత పాలకులు ఎవరూ ఇసుకను ఆదాయ వనరుగా చూడలేదు. ఇసుక నుంచి డబ్బు పిండుకొనే ఆలోచన చేయలేదు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ఇసుకను కూడా పార్టీకి ప్రధాన ఆదాయ వనరులలో ఒకటిగా చేర్చారు. ఇసుక ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా మాత్రమే నష్టపోయారు. కానీ, మద్యం విషయంలో అలా కాదు. ఆరోగ్యాలు దెబ్బతిని ప్రాణాలు కూడా కోల్పోయారు. లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన వారితో పాటు విచారణకు హాజరైన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం... ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ అమానవీయంగా వ్యవహరించారు. తమ ధనదాహం పేదల ఉసురు తీస్తుందన్న విషయాన్ని విస్మరించారు. అధికారం శాశ్వతం అని భావించి సమాజమే ఉలికిపాటుకు గురయ్యే స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారు. మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన బేవరేజస్ కంపెనీ ఎండీగా పనిచేసిన వాసుదేవ రెడ్డి, మరో అధికారి సత్యప్రసాద్ అప్పట్లో ఏం జరిగిందో, ఎవరి ప్రోద్బలంతో తాము అలా చేయవలసి వచ్చిందో న్యాయాధికారి ఎదుట చెప్పేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి సిట్ అధికారుల విచారణలో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు. తామంతా నిమిత్తమాత్రులమేనని, కమీషన్లు చేరాల్సిన చోటుకు చేరాయని చెప్పుకొచ్చారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అప్పట్లో ఏం జరిగిందో చెప్పేశారు. కమీషన్ల సొమ్మును అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకొనేవారని నేరుగా చెప్పకుండా... అదే అర్థమొచ్చేలా సిట్ అధికారులకు చెప్పేశారు. మద్యం కొనుగోళ్లలో తప్పు జరగలేదని విజయసాయిరెడ్డి ఎక్కడా పేర్కొనలేదు. ప్రతి సందర్భంలోనూ ‘మద్యం కుంభకోణం’ అనే మాట్లాడారు. అయితే, ఆ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అని చెప్పారు.
చెడిన దోస్తీ...
ఇద్దరు తెలివైన నేరస్తులు ఎక్కువకాలం కలసి ప్రయాణం చేయలేరు. విజయసాయిరెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఒకప్పుడు సన్నిహితంగానే ఉండేవారు. విజయసాయి ఆదేశాల ప్రకారమే కసిరెడ్డి పనిచేసేవారు. అయితే, జగన్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఆ తర్వాత విజయసాయిరెడ్డిని పట్టించుకోవడం మానేశారు. ఇసుక, మద్యం వ్యాపారాల నుంచి జగన్‌రెడ్డి తనను దూరం పెట్టడానికి రాజ్ చెప్పిన చాడీలే కారణమని విజయసాయిరెడ్డి భావించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ అని విజయసాయి అభివర్ణించారు. అయితే, ఆర్థిక నేరాలు చేయడంలో విజయసాయిరెడ్డిని మించిన వారు లేరన్న అభిప్రాయం అప్పటికే ఉంది. జగన్‌రెడ్డితో మాయా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మింపజేయడంలో విజయసాయిరెడ్డిదే ప్రధాన పాత్ర అన్నది అందరికీ తెలిసిన విషయమే. అధికారం–డబ్బు మనుషులను కుదురుగా ఉండనివ్వవు. ఈ రెండూ వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు కూడా విడిపోవడం చూశాం. రక్త సంబంధాలను మరచిపోయి కొట్టుకోవడం చూస్తున్నాం. తనకు వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా వారి వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్‌రెడ్డి ఆరోపిస్తారు గానీ... అసలు కారణం వారి వెనుక ఉన్నది డబ్బు–అధికారమే! దివంగత రాజశేఖరరెడ్డి కుటుంబంలో కలతలు ఏర్పడటానికి ఈ రెండూ కారణం కాదా? అధికారం, తద్వారా సమకూరిన డబ్బును రక్తం పంచుకుపుట్టిన షర్మిలతో పంచుకోవడానికి జగన్‌రెడ్డి సిద్ధపడి ఉంటే వారి మధ్య గొడవలు జరిగేవి కావు కదా? సొంత అన్నపై కత్తులు దూయడానికి షర్మిల సిద్ధపడ్డారంటే ఆస్తుల పంపకంలో న్యాయం చేయకపోవడమే కారణం కాదా? చివరకు తుచ్చమైన ఆస్తులకోసం సొంత తల్లి విజయలక్ష్మిపైనే జగన్‌రెడ్డి కేసు వేశారు కదా? జగన్‌రెడ్డి తన తల్లి, చెల్లిపై కేసు వేయడానికి కూడా చంద్రబాబే కారణం అని చెప్పగలరా? పులివెందులపై పెత్తనం ఎవరికి దక్కాలన్న వివాదం తలెత్తడం వల్లనే కదా వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు! రక్త సంబంధీకులను ఖైదు చేయించడం, హత్యలు చేయించడం మొఘల్ సామ్రాజ్య కాలంలో జరిగాయని చరిత్ర పుస్తకాల్లో చదివాం. ఇప్పుడు మళ్లీ ఇంత కాలానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో అలాంటివి జరగడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జగన్‌రెడ్డి–విజయసాయిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తడాన్ని చూడాలి.
సాయిరెడ్డి ప్రస్థానం...
విజయసాయిరెడ్డి చెబుతున్నట్టుగా 2019 వరకు వైసీపీలో అన్నీ తానే అయి నడిపించారు. అప్పుడు అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఎన్నో కుటిల పన్నాగాలు పన్నారు. జగన్‌రెడ్డికి కుడి భుజంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 2019లో వారి కుట్రలు ఫలించి జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు పార్టీలో నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి ప్రభుత్వంలో కూడా నంబర్ టూగా చెలామణి కావచ్చునని భావించారు. ఏడాదికి పైగా అంతులేని అధికారాన్ని చలాయించారు కూడా! అదే సమయంలో మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి వంటివారు జగన్‌రెడ్డికి సన్నిహితం అయ్యారు. వనరుల దోపిడీ, కమీషన్ల వసూలు బాధ్యతను ముఖ్యమంత్రి హోదాలో జగన్‌రెడ్డి ఆ ముగ్గురికీ అప్పగించారు. దీంతో విజయసాయిరెడ్డి ప్రభ మసకబారడం మొదలైంది. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు ప్రధాన అధికార కేంద్రాలుగా మారారు. అధికారం వస్తే దున్నేద్దామని అనుకున్న విజయసాయిరెడ్డికి ఈ పరిణామం సహజంగానే రుచించలేదు. మద్యం విషయంలోనే కాకుండా మిగతా సహజ వనరుల నుంచి కమీషన్లు పిండుకొని తనకు అందజేసే బాధ్యతను జగన్‌రెడ్డి తన చుట్టూ ఉండే కోటరీకే అప్పగించారు. అన్ని వ్యవహారాలనూ ఒకరికే అప్పగించకూడదన్న ప్రాథమిక సూత్రానికి అనుగుణంగా అరడజను ముఖ్యులకు బాధ్యతలను పంచిపెట్టారు. విచిత్రం ఏమిటంటే వీరెవరికీ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉండదు. కమీషన్లు వసూలు చేయడం మాత్రమే వారి బాధ్యత. అందుకు అవసరమైన అధికారాన్ని మాత్రమే దఖలు చేసేవారు. విధాన నిర్ణయాలలో వారెవరికీ సంబంధం ఉండేది కాదు. తమకు అప్పగించిన శాఖలలోనే ఆయా వ్యక్తుల మాట చెల్లుబాటు అయ్యేది. ఒకప్పుడు పార్టీలో అంతా తానై వ్యవహరించిన విజయసాయిరెడ్డికి ఈ అధికారాల పంపిణీ సహజంగానే రుచించలేదు. అధికారం–డబ్బు వల్ల మనస్పర్థలు రావడం సహజం కనుక జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య కూడా దూరం పెరిగింది. తాను జగన్‌రెడ్డి నమ్మకం కోల్పోయానని, ఆయన గుండెల్లో తనకు స్థానం లేదని విజయసాయిరెడ్డి తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వైసీపీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి చాలా ముందు నుంచే విజయసాయిరెడ్డి తన అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరికి ఇరువురి మధ్య విభేదాలు రోడ్డునపడ్డాయి. తన దారి తాను చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీ ముఖ్యులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇంటి గుట్టు లంకకు చేటు అని గ్రహించిన జగన్‌రెడ్డి తన మనుషులతో విజయసాయిరెడ్డి పైన ఎదురుదాడి చేయించడం మొదలుపెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ గుట్టుమట్లు విజయసాయిరెడ్డికి తెలుసు. ఆయన నిజాయితీగా నోరు విప్పితే జగన్‌రెడ్డి కథ కంచికి చేరుతుంది. ఈ కారణంగానే విజయసాయిరెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో చేరిపోయారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. విజయసాయిని ద్రోహిగా చిత్రించే పనిలో జగన్ అండ్ కో బిజీగా ఉన్నారు. జగన్‌రెడ్డితో విభేదించి ఎదురుతిరగడం వల్ల ఎదురయ్యే పరిణామాలు విజయసాయిరెడ్డికి తెలుసు. అందుకే అయన ముందుగా బీజేపీ ప్రముఖుల ఆశ్రయం పొందారు. లిక్కర్ కుంభకోణంలో జగన్‌రెడ్డికి కమీషన్ల సొమ్ము ముట్టిందని చెప్పడం మినహా మిగతా అన్ని విషయాలనూ అయన సిట్ అధికారులకు పూసగుచ్చినట్టు చెప్పేశారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారి బట్టలు సగమే విప్పానని, మిగతా సగం దుస్తులు కూడా త్వరలోనే విప్పుతానని ఆయన తాజాగా ప్రకటించారు. అంటే విజయసాయిరెడ్డి త్వరలో జగన్‌రెడ్డి దుస్తులు కూడా విప్పుతారా? అన్న సందేహం కలుగుతోంది.
జగన్ పరిస్థితి ఏమిటి?
నాలుగేళ్ల తర్వాత తాను తిరిగి అధికారంలోకి వస్తానని, అప్పుడు తమపై కేసులు పెట్టిన పోలీసు అధికారుల బట్టలు విప్పిస్తానని జగన్‌రెడ్డి చెప్పుకొంటున్న వేళ విజయసాయిరెడ్డి హెచ్చరికలు వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, కపట నాటకాలకు మారుపేరైన విజయసాయిరెడ్డిని ఇప్పటికీ చాలామంది నమ్మడం లేదు. జగన్‌రెడ్డితో ఆయనకు విభేదాలు ఏర్పడటం డ్రామా అని నమ్ముతున్న వాళ్లు కూడా గణనీయంగానే ఉన్నారు. వారిరువురి మధ్య విభేదాలు నిజమే అయిన పక్షంలో విజయసాయిరెడ్డి తదుపరి ఎత్తుగడలు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. జగన్‌రెడ్డి గుట్టుమట్లు అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. జగన్ అవినీతి కేసులలో విజయసాయిరెడ్డి ఏ–2గా ఉన్నారు. వాటిలో ఆయన అప్రూవర్‌గా మారితే పరిస్థితి ఏమిటి? అది సాధ్యమా? జగన్‌రెడ్డి నైజం తెలిసిన విజయసాయిరెడ్డి ప్రాణాలకు తెగించి అప్రూవర్‌గా మారగలరా? ఇలాంటి సందేహాలు సహజంగానే కలుగుతాయి. ఆయన ఇవాళ కాకపోతే రేపైనా బీజేపీలో చేరిపోతారు. జగన్‌రెడ్డిపై నమోదైన కేసులలో శిక్ష పడితే విజయసాయిరెడ్డికి కూడా శిక్ష పడుతుంది. అలా అయితే భారతీయ జనతా పార్టీలో చేరడం ఎందుకు? అని ప్రజల్లో సందేహం కలగకుండా ఉంటుందా? అవినీతి విషయంలో జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి శరీరం అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలవంటి వారు. ఈ ఇద్దరిలో ఒకరిని తప్పించి మరొకరిని శిక్షించలేరు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతే అవినీతి కేసులలో పురోగతి ఉండకపోవచ్చు. అంటే, విజయసాయి చర్యల వల్ల పరోక్షంగా జగన్‌రెడ్డికి కూడా మంచి జరగబోతున్నదని భావించాలి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంపై సిట్ విచారణ వేగం పుంజుకుంది.
ఎవరి భయం వారిది...
మద్యం కేసులో మరో కీలక నిందితుడు బాలాజీ సిట్ అధికారులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు తదుపరి ఏం చేయబోతున్నారో వేచిచూడాలి. అయితే, ఈ కేసులో తనను అరెస్టు చేయబోతున్నారని మిథున్‌రెడ్డి మానసికంగా సిద్ధపడుతున్నారు. తనను మళ్లీ విచారణకు పిలిస్తే మరిన్ని వివరాలు చెబుతానని విజయసాయిరెడ్డి చెబుతున్నందున సిట్ అధికారులు త్వరలోనే ఆయనను విచారణకు పిలవవచ్చు. అప్పుడు ఆయన ఏమి చెబుతారు? ఆయన నోటివెంట వెలువడే నిజాలతో ఈ కుంభకోణంలో జగన్‌రెడ్డిని నిందితుడిగా చేర్చుతారా? అన్న సందేహం సర్వత్రా వ్యాపించింది. ఏది ఏమైనా అవినీతికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడిన ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారందరినీ శిక్షించాల్సిందే. ఢిల్లీలో లిక్కర్ కొనుగోళ్లలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలను అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడ అంతా కలపి కొన్ని వందల కోట్ల రూపాయలు మాత్రమే చేతులు మారాయి. కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టినా తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయనపై ప్రజల్లో ఎలాంటి సానుభూతీ ఏర్పడలేదు. ఆప్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అవినీతి విషయాలలో ప్రజలు పెద్దగా స్పందించలేకపోవచ్చునుగానీ, మద్యం వంటి వ్యవహారాలలో ఇరుక్కుంటే దాన్ని జీర్ణించుకోలేరు. ఈ కారణంగానే తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఇదే కేసులో జైలుకు వెళ్లి వచ్చినా ఆమెపై ప్రజల్లో సానుభూతి ఏర్పడలేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణాన్ని చూడాలి.
హేయం... నీచం...
దేశ చరిత్రలోనే ఇంతటి నీచమైన కుంభకోణం జరగలేదు. అధికారంలో ఉన్నంత కాలం నాసి రకం మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. హేయమైన ఈ కుంభకోణంతో తనకు సంబంధం లేదని జగన్‌రెడ్డి చెప్పగలరా? చెప్పినా ప్రజలు నమ్ముతారా? జగన్‌రెడ్డిని కుల, మత ప్రాతిపదికన గుడ్డిగా అనుకరించేవారు, అభిమానించేవారు గణనీయంగా ఉంటే ఉండవచ్చునుగానీ చేసిన పాపానికి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. పుష్కర కాలం క్రితం తనపై సీబీఐ దాఖలు చేసిన కేసు విచారణకు నోచుకోకుండా తప్పించుకోగలుగుతున్నామని జగన్ అండ్ కో ధీమాగా ఉండవచ్చునుగానీ, మద్యం కుంభకోణంలో పాపం కూడా చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు... ఏపీలో జరిగిన కుంభకోణం వైపు ఇంకా చూడటం లేదు. దీనికి కారణం తెలియదు. ఐదేళ్ల పాటు సాగిన ఈ కుంభకోణంలో వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసిన లిక్కర్ కంపెనీలు అనూహ్యంగా మద్యం వ్యాపారంతో సంబంధం లేని కంపెనీలకు, సంస్థలకు చెల్లింపులు చేశాయి. ఈ విధంగా జరిగిన చెల్లింపులన్నీ చివరకు ‘మూల విరాట్’కే చేరాయి. ఉదాహరణకు ఒక డిస్టిలరీ కంపెనీ ముంబైలోని ఒక వస్త్ర దుకాణానికి 28 కోట్ల రూపాయలు చెల్లించింది. ఆ దుకాణం నుంచి సదరు డిస్టిలరీ వస్ర్తాలు కూడా కొనుగోలు చేయలేదు. ఈ విధంగా డిస్టిలరీలు ప్రభుత్వ పెద్దలకు చెల్లించాల్సిన కమీషన్లను వారు చెప్పిన కంపెనీలకు బదలాయించారు. అంతిమంగా, ఈ డబ్బు ఎవరికి చేరింది? ఏ మేరకు అక్రమ లావాదేవీలు జరిగాయి? ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత? అనేది ఇంకా తెలియవలసి ఉంది. చరిత్రలో జరగని, చూడని రీతిలో జరిగిన ఈ కుంభకోణంపై దర్యాప్తును సిట్ అధికారులకే పరిమితం చేయకుండా ఆర్థిక వ్యవహారాలలో నిపుణులైన వారికి కూడా భాగస్వామ్యం కల్పించాలి. దర్యాప్తు పరిధిని విస్తరించాలి. అవసరాన్ని బట్టి మరిన్ని ఏజెన్సీలు రంగంలోకి దిగాలి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జాతీయ స్థాయిలో పతాక శీర్షికలతో ప్రచురితమైంది, ప్రచారం పొందింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది అంతకు మించిన మహా ఘాతుకం కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభకోణంపై జాతీయ స్థాయిలో తెలిసేలా చేయాలి. జగన్‌రెడ్డి పాలనలో చోటుచేసుకున్న పాపాలను దేశ ప్రజలకు వివరించి అటువంటి నేరాలకు పాల్పడే వారికి రాజకీయాలలో చోటులేని విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇంటి గుట్టు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నందున... పాపులను శిక్షించడానికి సహకరించే వారందరికీ తగిన రక్షణ కల్పించాలి. భవిష్యత్తులో మరెవరూ లిక్కర్ కొనుగోళ్లలో ఇటువంటి దరిద్రపు ఆలోచన చేయకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి అరాచకాలపై ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారు. నోరు పారేసుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగినా ఫర్వాలేదుగానీ... మద్యం కుంభకోణం విచారణలో జాప్యం జరగకూడదు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగినా ఇలాంటి పాపాలకు పాల్పడిన వారికి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది.
జగన్ బేఖాతరు...
లిక్కర్ కుంభకోణంలో అయినా విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతారో లేదో తెలియదు. ఎవరు అప్రూవర్‌గా మారినా మారకపోయినా ఈ కేసులో నిందితులను శిక్షించడానికి అవసరమైన ఆధారాలను సిట్ అధికారులు ఇదివరకే సేకరించారు. ఈ కేసులో జగన్‌రెడ్డి ప్రధాన నిందితుడు అవుతారా? లేదా? అన్నదే ప్రస్తుత ప్రశ్న. లిక్కర్ కేసులో చిక్కుకున్నవారు భయపడుతున్నట్టుగా జగన్‌రెడ్డి మాత్రం భయపడటం లేదు. అతనొక అసాధారణ మనస్తత్వం కలిగిన వ్యక్తి. సాధారణంగా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినవారు కోలుకోవడానికి సమయం తీసుకుంటారు. 2019లో ఓడిపోయిన చంద్రబాబు కోలుకోవడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది. 2023లో తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ కూడా ఏడాది పాటు మౌనంగా ఉండిపోయారు. జగన్‌రెడ్డి అంచనాలకు అందని విధంగా పరాజయం పాలైనా కుంగిపోలేదు. మూడు నెలలకే నిలదొక్కుకున్నారు. ఆరు నెలలు గడిచేసరికి త్వరలో నేనే అధికారంలోకి వచ్చేది అంటూ ప్రకటిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా వ్యవధి ఉంది. అయినా రేపో మాపో అధికారంలోకి వచ్చేసినట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎంత బలంగా ప్రచారం చేస్తున్నారంటే, నిజంగా జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారా? అని ప్రజలతో పాటు కూటమి కార్యకర్తలు భయకంపితులు అవుతున్నారు. ఒక వ్యక్తి విషయంలో ప్రజలు కూడా భయపడటం ఇప్పుడే చూస్తున్నాం. కూటమి నాయకత్వం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన జగన్ అండ్ కో హేయమైన పాపాలకు ఒడిగట్టారని ప్రజలకు వివరించగలిగినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేర్చినవారు అవుతారు. జగన్‌రెడ్డిని రాజకీయంగా సీసాలో బంధించడానికి లిక్కర్ కుంభకోణం రాష్ట్ర ప్రభుత్వానికి అందివచ్చిన ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించబోతున్నారో వేచి చూద్దాం!
ఆర్కే
ఇవి కూడా చదవండి
Rahul Gandhi: భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Shruti Haasan: పాపం శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టుకోలేకపోయింది..