Share News

Political System Coordination: వ్యవస్థలు కాదు, రాజ్యాంగమే సర్వోన్నతం

ABN , Publish Date - Apr 23 , 2025 | 03:11 AM

ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, గవర్నర్‌లు, ఇతర వ్యవస్థల మధ్య సంబంధాలు బలహీనపడడం, అవి పరస్పరం గౌరవాన్ని కోల్పోవడం దేశంలో అరాచక పరిస్థితులను ఏర్పడిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనలు రాజ్యాంగం గౌరవాన్ని కాపాడే అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Political System Coordination: వ్యవస్థలు కాదు, రాజ్యాంగమే సర్వోన్నతం

వ్యవస్థలు పరస్పరం గౌరవం కోల్పోయి ఒక దానిపై మరొకటి దాడి చేస్తే దేశంలో అరాచక పరిస్థితి నెలకొంటుందనడంలో సందేహం లేదు. వ్యవస్థలు బలహీన పడితే వర్తమానంలో ప్రయోజనాలు లభిస్తాయని భావించేవారుంటారు కాని దీనివల్ల దీర్ఘకాలికంగా దేశం నష్టపోతుందని వివేకవంతులు గ్రహిస్తారు. ఇవాళ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రపతి, గవర్నర్ విచక్షణాధికారాల్ని ప్రశ్నిస్తోంది. రెండవ ఉన్నత రాజ్యాంగాధినేత అయిన ఉప రాష్ట్రపతి సర్వోన్నత న్యాయస్థానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికార పార్టీ ఎంపీ ఒకరు మరింత ముందుకుపోయి దేశంలో ప్రజల మధ్య యుద్ధాల్ని ప్రేరేపిస్తున్నారని ప్రధాన న్యాయమూర్తినే నేరుగా ఆక్షేపించారు. ఆ ఎంపీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు అనుమతినివ్వాలని అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కోరింది. తమ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి నిమిత్తం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నారు కాని ఆ ప్రజా ప్రతినిధి నోటికి అడ్డుకట్ట వేసే చర్యలు మాత్రం తీసుకోలేదు! అసలు దేశంలో ఏం జరుగుతోంది? వ్యవస్థల మధ్య సమన్వయం ఎందుకు ఏర్పడడం లేదు? వ్యవస్థల మధ్య సంఘర్షణాయుత వైఖరి ఏర్పడుతోందని చెప్పేందుకు ఈ ఉదంతాలు తోడ్పడుతున్నాయి. అందుకు కారణం ఎవరన్నది మాత్రం చర్చనీయాంశం. మూడేళ్ల క్రితం వరకూ గవర్నర్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్, బీజేపీ ఎంపీ నిశికాంత దుబే ఎవరూ ప్రేరేపించకుండానే సర్వోన్నత న్యాయస్థానాన్ని, భారత ప్రధాన న్యాయమూర్తిని తీవ్రంగా విమర్శిస్తారా అన్న అనుమానాలకు మాత్రం ఆస్కారం ఉన్నది. ఈ దేశంలో న్యాయస్థానాలను విమర్శించేందుకు అనేక కారణాలు ఉండవచ్చు. న్యాయవ్యవస్థలో కూడా అవినీతి ఉండవచ్చు.


న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు, కోర్టుల్లో విచారణ జరుగుతున్న తీరు, వాయిదాలు, ఆలస్యాలు ప్రశ్నార్థకం కావచ్చు. కాని న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టవల్సిన బాధ్యత మాత్రం అందరిపై ఉన్నది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలపై అంతిమంగా తీర్పు చెప్పవల్సింది మాత్రం న్యాయవ్యవస్థే. ఈ దేశంలో అనేకసార్లు ప్రభుత్వాలు పాల్పడిన అరాచకాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఘనత న్యాయ వ్యవస్థదే అన్నది స్పష్టం. అందువల్ల న్యాయవ్యవస్థ తన్ను తాను మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతూ, అదే సమయంలో తన తప్పులు కూడా సవరించుకోవాల్సిన బాధ్యత చట్టసభలు, కార్యనిర్వాహక వర్గానికి మాత్రమే ఉన్నది. ఈ దేశంలో గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారని వస్తున్న విమర్శలు కొత్తవి కాదు. కాంగ్రెస్ హయాంలో ఈ వ్యవస్థ అమితంగా దుర్వినియోగమయింది. రామ్‌లాల్, కుముద్‌బెన్ జోషీ, రమేశ్ భండారీ లాంటి వారు వ్యవహరించిన తీరు చరిత్రలో నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు గవర్నర్‌ లను కాంగ్రెస్‌ ఉపయోగించుకున్న ఉదంతాలు ఎన్నో కదా. యూపీఏ ప్రభుత్వ హయాంలో బిహార్‌లో నితీశ్‌ కుమార్‌కు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ అప్పటి గవర్నర్ బూటాసింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గం ఈ సిఫారసును ఆమోదించింది. రాష్ట్రపతి పాలన ఆదేశాలపై సంతకాలు చేసే పత్రాలను రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు పంపించి నడిరాత్రి సంతకాలు చేయించారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలనను రద్దుచేసి నితీశ్‌ కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనితో బూటాసింగ్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ గవర్నర్, రాష్ట్రపతి రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేసినట్టా కాదా? సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే ఏమయి ఉండేది? బూటాసింగ్ తర్వాత బిహార్ గవర్నర్‌గా ఉన్న గోపాలకృష్ణ గాంధీ, నితీశ్‌ ప్రభుత్వం ఎడా పెడా జారీ చేసిన అనేక ఆర్డినెన్స్‌లను నిలిపివేశారు. నితీశ్‌ కుమార్ చాలా సందర్భాల్లో తన తప్పుల్ని గ్రహించి సరిదిద్దుకున్నారు. గోపాలకృష్ణ గాంధీ మహాత్మాగాంధీ మనుమడు.


ఇదే గోపాలకృష్ణ గాంధీ పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు 2007లో నందిగ్రామ్‌లో తీవ్ర హింసాకాండ జరిగింది. పారిశ్రామిక ప్రయోజనాలకోసం సంకల్పించిన భూసేకరణను గ్రామస్తులు వ్యతిరేకించారు. పోలీసులే కాదు, సీపీఐ(ఎం) కార్యకర్తలు కూడా గ్రామస్తులపై హింసాకాండకు పాల్పడ్డారు. దీనిపై గవర్నర్ ఈ హింసాకాండపై ఆందోళన ప్రకటిస్తూ పత్రికా ప్రకటన చేయాల్సి వచ్చింది. సమస్య పరిష్కరించే పద్దతి ఇది కాదని ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు గవర్నర్‌ సూచించారు. మహాశ్వేతాదేవి వంటి గొప్ప రచయిత్రి గవర్నర్‌కు ఫోన్ చేసి ‘ఏదైనా చేయండి ప్లీజ్’ అని అభ్యర్థించారు. గోపాల కృష్ణ గాంధీ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఇంటికి స్వయంగా వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకురావల్సిందిగా కోరారు. అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి సీపీఐ(ఎం) మద్దతునిస్తోంది. ‘కావాలంటే నన్ను తీసేయమని చెప్పండి’ అని గోపాలకృష్ణ గాంధీ ముఖ్యమంత్రికి చెప్పారు. ‘నేను అలాంటి వ్యక్తిని కాదు’ అని బుద్ధదేవ్ భట్టాచార్య అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ బుద్ధదేవ్‌కు ఫోన్ చేసి ‘మీకు గోపాలకృష్ణ గాంధీ కంటే మంచి గవర్నర్ దొరకడు. ఆయన ఆందోళనను అర్థం చేసుకోండి..’ అని నచ్చజెప్పారు. చివరకు పరిస్థితి సద్దుమణిగింది. నందిగ్రామ్‌లో జరిగిన హింసాకాండ రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యలను తొలుత గవర్నర్, తర్వాత హై కోర్టు సరిదిద్దింది. గ్రామీణులకు అనుకూలంగా మాట్లాడి, హింసాకాండను అరికట్టిన గోపాలకృష్ణ గాంధీ లాంటి గవర్నర్‌లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం– ప్రతిపక్షానికీ మధ్య నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నట్లు కనపడాలి. యూపీఏ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ హయాంలో అన్ని వ్యవస్థలతో సహా గవర్నర్ వ్యవస్థను కూడా సరిదిద్దేందుకు నరేంద్రమోదీకి అవకాశం లభించింది. కాని ఆయన వ్యవస్థలను మెరుగుపరచడంలో ఆసక్తి చూపలేదు. అదే సమయంలో కాంగ్రెస్ దారిలోనే ఆ వ్యవస్థలను తనకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.


ఎవరన్నా ప్రశ్నిస్తే గతంలో జరగలేదా అని నిలదీసేందుకు ఆస్కారం ఉన్నదని ఆయనకు తెలుసు. ‘రాజకీయాల్లో సరైనది న్యాయవ్యవస్థకు సరైనదని అనిపించకపోవచ్చు’ అని కాంగ్రెస్ నేతలు భావించేవారు. ప్రస్తుత ప్రభుత్వమూ అదే దారిలో నడుస్తోంది. న్యాయవ్యవస్థే చట్టాలు చేస్తే పార్లమెంట్ ఎందుకు.. ప్రభుత్వాన్ని వారే నడుపుకోవచ్చు కదా అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పార్లమెంట్ నిజంగా చట్టాలు చేస్తోందా.. ప్రభుత్వాన్ని అడ్డుకుంటుందా అన్న విషయం చర్చించాల్సి ఉన్నది. అసలు పార్లమెంట్, సుప్రీంకోర్టుల్లో ఏది గొప్ప వ్యవస్థ అన్న చర్చ ఎందుకు తలెత్తుతోంది? చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ మూడింటికీ రాజ్యాంగం వేర్వేరు అధికారాలను ఇచ్చింది. ప్రతి ఒక్క వ్యవస్థ బాధ్యతలను నిర్దేశించింది. అవి తమ తమ పరిధుల్లో రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని కాపాడుతూ పనిచేయాల్సిందే.. ఈ మూడు వ్యవస్థలను నిర్దేశించే రాజ్యాంగమే అన్నిటికన్నా గొప్పది అని చెప్పక తప్పదు. రెండేళ్ల క్రితం పంజాబ్‌లో గవర్నర్ అసెంబ్లీనే సమావేశపరిచేందుకు నిరాకరించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఆయన సభను సమావేశపరిచారు. ఆ తర్వాత మనీ బిల్లులతో సహా ఏడు బిల్లులను ఆమోదించకుండా తన వద్దే ఉంచుకున్నారు. దానిపై ప్రభుత్వం ఆర్టికల్ 32 క్రింద మళ్లీ కోర్టుకు వెళ్లింది. రాజ్యాంగంలోని అధికరణ 200 క్రింద గవర్నర్ బిల్లులను తన వద్ద ఉంచుకోవడానికి వీల్లేదని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీర్పునిచ్చారు. తాజాగా తమిళనాడు గవర్నర్ విషయంలో కూడా సుప్రీంకోర్టు కొత్తగా ఏమీ వ్యవహరించలేదు. గవర్నర్ తన వద్ద బిల్లులను ఇష్టం వచ్చినంతకాలం ఉంచుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. నిర్దిష్ట కాలపరిమితి లోపు వాటిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.


నిజానికి గతంలో దాదాపు మూడేళ్ల పాటు బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచిన ఉదంతాలు లేనే లేవు. సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నవారు అసలీ పరిస్థితి ఎందుకు తలెత్తిందని ఎందుకు ప్రశ్నించడం లేదు? రాష్ట్రపతిని కూడా సుప్రీం నిర్దేశిస్తుందని విమర్శిస్తున్నారు కాని రాష్ట్రపతి అనే వ్యక్తి కేంద్ర మంత్రివర్గ సిఫారసులకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందన్న విషయం వారు మరిచిపోతున్నారు. రాష్ట్రపతి పదవి వివాదంలో పడుతున్నదంటే అందుకు కారణం ఆయనను నిర్దేశించే కేంద్ర ప్రభుత్వానిదే కారణం. బూటాసింగ్ బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేసినప్పుడు ఉన్నతమైన వ్యక్తి అని ఎందరో భావించే అబ్దుల్ కలామ్ కూడా వివాదంలో పడ్డారు. ప్రభుత్వంతో న్యాయవ్యవస్థకు సుహృద్భావ సంబంధాలు ఉండాలని దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్యతో అన్నారు. ‘సుహృద్భావ సంబంధాలు అవసరం లేదు, సరైన సంబంధాలు ఉంటే చాలు’ అని సీజేఐ జవాబిచ్చారు. ప్రభుత్వం, న్యాయవ్యవస్థల మధ్య సరైన సంబంధాలు ఉంటే బండి సక్రమంగా నడుస్తుంది. కాని న్యాయవ్యవస్థను తన దారికి అడ్డంగా తొలగించుకోవాలని ప్రభుత్వం భావిస్తే అది వేరే సంగతి. గతంలో ఇందిరాగాంధీ అలాంటి పని చేసి చరిత్రలో నియంతగా నిలిచిపోయారు. వ్యవస్థల్ని గౌరవిస్తున్నారా లేదా అన్నది ప్రశ్న కాదు. రాజ్యాంగాన్ని అయినా గౌరవిస్తున్నారా అన్నదే ప్రధానం. రాజ్యాంగ గౌరవాన్ని కాపాడితే అన్నీ సర్దుకుంటాయి.

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Apr 23 , 2025 | 03:16 AM