Share News

ఉచితాలతో అప్పుల ఊబిలోకి!

ABN , Publish Date - Jan 22 , 2025 | 02:11 AM

‘ప్రజలకు స్వీట్ల మాదిరి ఉచితాలను పంచిపెడుతూ పోతే ఆధునిక భారత దేశం అంధకార యుగంలోకి జారిపోతుంది.. ఉచితాలను అమలు చేస్తే ఎక్స్‌ప్రెస్ వేలు, విమానాశ్రయాలు, రక్షణ కారిడార్లను...

ఉచితాలతో అప్పుల ఊబిలోకి!

‘ప్రజలకు స్వీట్ల మాదిరి ఉచితాలను పంచిపెడుతూ పోతే ఆధునిక భారత దేశం అంధకార యుగంలోకి జారిపోతుంది.. ఉచితాలను అమలు చేస్తే ఎక్స్‌ప్రెస్ వేలు, విమానాశ్రయాలు, రక్షణ కారిడార్లను నిర్మించలేం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2022 జూలై 16న యూపీలో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభిస్తూ హెచ్చరించారు. మోదీ దారిలో కేంద్రమంత్రులు కూడా ఉచితాలను విమర్శించారు. అయితే ఆ తర్వాత ఏడాదే మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా పథకం క్రింద మహిళలకు నెలకు రూ. 1250 చొప్పున చెల్లిస్తామని, క్రమంగా దాన్ని రూ. 3వేల వరకు పెంచుతామని బీజేపీ ప్రకటించడంతో ఆ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఈ పథకాన్ని ‘గేమ్ ఛేంజర్’గా ఆ పార్టీ నేతలే అభివర్ణించారు. మధ్యప్రదేశ్‌లోనే కాదు, ఆ తర్వాత ప్రతి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఉచితాల మీద ఉచితాలను ప్రకటిస్తూ ఎన్నికల్లో ప్రయోజనం పొందింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా లడ్కీ బెహన్ పథకం వల్ల బీజేపీకి పెద్ద ఎత్తున మహిళలు ఓట్లు వేశారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రకటిస్తున్న ఉచితాల హామీలను బట్టి చూస్తే ఈ పార్టీయేనా గతంలో ఉచితాలను వ్యతిరేకించింది అని ఆశ్చర్యం కలుగుతుంది.


దేశ రాజకీయాల్లో ఈ ఉచితాల సంస్కృతి ఎంత పెనవేసుకుపోయింది అంటే ఆర్థిక వ్యవస్థపై దీని వల్ల తీవ్రమైన భారం పడుతుంది అని తెలిసినా ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలను ప్రకటించేందుకు వెనుకాడడం లేదు. ఉచితాలను సమర్థంగా అమలు చేస్తే అధికారంలోకి తప్పకుండా రాగలుగుతాం అని ఆమ్ ఆద్మీ పార్టీ పలు ఎన్నికల్లో నిరూపించింది. మంచి నీరు, విద్యుత్, ఆరోగ్యం, విద్య, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థ యాత్ర.. ఇలా ప్రతి రంగంలోనూ ఉచితాలను ప్రవేశపెట్టి అమలు చేయడం ద్వారా 2013 నుంచి ఇప్పటి వరకూ ఆప్‌కు ఎన్నికల్లో తిరుగులేకుండా పోతోంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదల అయిన తర్వాత ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని ఉచితాలను ఎడా పెడా ప్రకటించారు. మహిళలకు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన క్రింద నెలకు రూ. 2100 చొప్పున నగదు బదిలీ చేస్తామని, ఆలయాలు, గురుద్వారాల్లో పూజారులకు నెలకు రూ. 18వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని, ఆటోడ్రైవర్లకు, వారి కుటుంబ సభ్యులకు కూడా బీమా, వివాహాలు, స్కూలు యూనిఫారంల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తామని, ఢిల్లీలో అద్దె గృహాలలో ఉన్న వారందరికీ ఉచిత విద్యుత్, నీరు సరఫరా చేస్తామని ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను కూడా ఆత్మరక్షణలో పడేలా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలనుకుంటున్న బీజేపీ తాను కూడా ఉచితాల వర్షాన్ని కురిపించింది. కేజ్రీవాల్ కంటే ఒక అడుగు ముందుకు వేసి మహిళలకు రూ. 2500 చొప్పున నెలకు చెల్లిస్తామని, గర్భిణీ స్త్రీలకు రూ. 21వేలతో పాటు ఆరు పోషకాహార కిట్లను పంచిపెడ్తామని బీజేపీ ప్రకటించింది. తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఇది కేవలం మొదటి భాగం మాత్రమే అనడాన్ని బట్టి కేజ్రీవాల్ ఆ పార్టీపై ఎంత ప్రభావం చూపుతున్నారో అర్థమవుతుంది. ఢిల్లీ మాత్రమే కాదు, ఇప్పుడు యావద్దేశమూ ఉచితాల బాటలో పయనిస్తోంది. 2024–25లో 9 రాష్ట్రాలు మహిళలకు నగదు బదిలీ క్రింద రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టాయని చట్టసభల పనితీరును అధ్యయనం చేసే పీఆర్ఎస్ పరిశోధనా సంస్థ వెల్లడించింది.


రూ. 76 వేల కోట్ల ఢిల్లీ బడ్జెట్‌లో దాదాపు రూ. 15వేల కోట్లకు పైగా ఉచితాలకు, సబ్సిడీలకే ఖర్చవుతుందని, రూ. 8,159 కోట్ల మేరకు బడ్జెటరీ లోటు ఏర్పడుతుందని, పెద్ద ఎత్తున అప్పులు చేయక తప్పదని తెలిసి కూడా కేజ్రీవాల్ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజలకు హామీలను కురిపించక తప్పడం లేదు. జాతీయ చిన్నపొదుపు మొత్తాల నిధి నుంచి కూడా ఆప్ ప్రభుత్వం అప్పులు చేసి రోజువారీ ఖర్చులను భరించాల్సి వస్తోంది.

కేంద్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత దివ్యంగా ఏమీ లేదు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మార్కెట్ అప్పులతో సహా కేంద్రం అప్పులు రూ. 185 లక్షల కోట్లకు చేరుకోబోతున్నాయి. జీడీపీలో 56.8 శాతం దేశం అప్పులే ఉన్నాయి. ప్రతి ఏడాదీ రూ. 30 లక్షల కోట్లు ప్రభుత్వం అదనంగా అప్పులు చేయాల్సి వస్తున్నది. రాష్ట్రాల పరిస్థితి కూడా ఇంతకంటే దారుణంగా ఉన్నది. ఎన్నికల్లో గెలిచేందుకు రకరకాల ఉచితాలను ప్రకటించిన ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం కోసం నానా కష్టాలు పడాల్సి వస్తోంది. మహారాష్ట్రలో లడ్కీ బెహనా పథకం అమలు చేసేందుకు ఏటా రూ. 46వేల కోట్లు ఎలా తేవాలా అని ప్రభుత్వం గింజుకుంటున్నట్లు సమాచారం.


నగదు బదిలీల వల్ల ప్రజల వినియోగ సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఎంతో కొంత తోడ్పడుతుందనే వాదన ఒకటి ఉన్నది. అయిత నిరుత్పాదక వ్యయం వల్ల జరిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు కదా. ప్రజలకు చేతినిండా పని కల్పించలేని ప్రభుత్వాల అసమర్థత వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంత మేరకు నష్టం జరుగుతుందో, దాని వల్ల సమాజంలో జరిగే నష్టాలు ఎన్నో కూడా ఊహించవచ్చు. ‘ఏదీ ఉచితంగా లభించదు. కొందరికి లభించే ఉచితాలకు సమాజంలో మరెవరో చెల్లించాల్సి వస్తుంది’ అని ఆర్థికవేత్తలు అంటున్నారు. వేల కోట్లు బ్యాంకులకు అప్పులు బాకీపడిన, విదేశాలకు పరారైన, కోట్ల రూపాయలు పన్నులు ఎగ్గొట్టిన, రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన సంపన్నులు మాత్రం ఈ ఉచితాలను భరించడం లేదన్నది మాత్రం వాస్తవం. అందుకే దేశంలో అసమానతలు తగ్గించాలంటే లక్షల కోట్లకు పడగలెత్తిన (సూపర్ రిచ్) సంపన్నులపై మరిన్ని పనులు విధించినప్పుడే దేశంలో అసమానతలు తగ్గుతాయని గత ఏడాది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన ఒక సెమినార్‌లో ప్రసంగించిన ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెటీ అన్నారు. దేశం సంపదలో 40 శాతం పైగా కేవలం ఒక శాతం సంపన్నులు కబళించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బహుశా కార్పొరేట్లకు, సంపన్నులకు రుణాలను రద్దు చేయడం, భారీ ప్యాకేజీని ప్రకటించడం, కొంతమంది సంపన్నులకు అనుకూలంగా విధానాలను రూపొందించడాన్ని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే దేశంలో రాజకీయ పార్టీలు వారిని ప్రలోభపెట్టేందుకు ఉచితాలను ప్రయోగిస్తున్నారేమో అన్న అనుమానం కూడా లేకపోలేదు. నిజానికి ఉచితాలను అమలు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందే పార్టీలు ఎవరి జేబులు కొడుతున్నాయో, సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఉచితాల వల్ల జరిగే భారీ వ్యయాన్ని భరించేందుకు ఆర్థిక లోటు లక్ష్యాలను, పెట్టుబడి, రెవిన్యూ వ్యయాలను, మౌలిక సదుపాయాలకు పెట్టే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం సవరించాల్సి వస్తోంది. దాని వల్ల ఏ వర్గం నష్టపోతోంది?


ఆర్థికవేత్తల ప్రకారం సబ్సిడీలు వేరు, ఉచితాలు వేరు. సబ్సిడీల వల్ల కొన్ని సందర్భాల్లో పెట్టిన ఖర్చు తిరిగి వస్తుంది. కాని ఉచితాలు గోడకు వేసిన సున్నం లాంటిదే. ఆరోగ్యం, విద్య, ప్రభుత్వ సేవలు అందించడాన్ని ఉచితాలుగా వర్గీకరించలేమని, వీటిలొ కొన్ని ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతం కావడానికి తోడ్పడతాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్‌పీ)కి చెందిన పరిశోధకులు అంటున్నారు. ‘ఒక వస్తువు సేకరించినప్పుడు పెట్టే వ్యయానికి, దాన్ని అమ్మిన ధరకు మధ్య తేడాయే సబ్సిడీ’ అని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ సి. రంగరాజన్ నిర్వచించారు. ప్రజలకు అత్యవసరమైన వస్తువులపై, వ్యక్తికన్నా సమాజానికి తోడ్పడే వస్తువులపై పెట్టే సబ్సిడీని సమర్థించవచ్చు కాని అంతకు మించి ఏది చేసినా అది ఉచితమే అవుతుందని ఆయన అన్నారు. ఉత్పత్తి వ్యయాని కంటే తక్కువగా లేదా ఉచితంగా ఇచ్చిన వస్తువు, సేవలను ఉచితాలనే భావించవచ్చని వివేక్ కౌల్ అనే మరో ఆర్థికవేత్త అన్నారు. ఆర్థికవేత్తలు ఏమి చెబుతున్నప్పటికీ సంక్షేమ వ్యయం, సబ్సిడీలు, ఉచితాలకూ మధ్య సరిహద్దులు రోజురోజుకూ చెరిగిపోతున్నాయి. సమాజంలో అట్టడుగు వర్గాలకు చేయూత నిచ్చేందుకు, విద్యను, నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు మాత్రమే సహాయం చేయాలన్న నిబంధనను ప్రభుత్వాలు పెట్టుకోవడం లేదు.


దీనివల్ల దాదాపు అన్ని వర్గాలూ ఉచితాలను ఆశించే పరిస్థితి ఏర్పడుతోంది. ‘ఉచితాలకు మీరు నిధులు కేటాయిస్తారు కాని న్యాయమూర్తుల జీతాలు, పింఛన్లు చెల్లించేందుకు మాత్రం మీ వద్ద డబ్బులు లేవు. ఎంతకాలం హేతుబద్ధత లేకుండా ఈ ఉచితాలను కొనసాగిస్తారు?’ అని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ ఆసుపత్రిని ఇటీవల సందర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ ఆసుపత్రి కారిడార్లలో, ఫుట్‌పాత్‌లపై చికిత్సకోసం రోజుల తరబడి వేచి చూస్తూ రాత్రింబగళ్లు పడిగాపులు కాస్తున్న వేలాది పేదలను చూసి చలించిపోయారు. ఈ మానవత్వ సంక్షోభాన్ని పట్టించుకోవాల్సిందిగా ఆయన ఆరోగ్యమంత్రి నడ్డాకు లేఖ రాశారు. ఎయిమ్స్‌లోనే కాదు, దేశంలో అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ దుస్థితి కొనసాగుతోంది. ఉచితాలపై కంటే ఇలాంటి వాటి గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి వంటివి బీజేపీకి ముఖ్యమే కావచ్చు కాని ఉచితాలపై నరేంద్రమోదీ వివిధ రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధనకు ప్రయత్నించడం తక్షణ అవసరం. పారదర్శకత, నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించడం, అవసరమైన వారిని గుర్తించడం, లక్ష్యాలను సమర్థంగా సాధించారా లేదా సమీక్షించడం వంటి విధానాల ద్వారా ఉచితాలను, సబ్సిడీలను హేతుబద్ధం చేయాల్సి ఉంది. లేకపోతే ఈ ఉచితాల పరంపర ఎంత హాస్యాస్పదమైన స్థాయికైనా దిగజారవచ్చు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jan 22 , 2025 | 02:11 AM