కాలచక్రంలో ఢిల్లీ రాజకీయాలు
ABN , Publish Date - Jan 29 , 2025 | 12:28 AM
కాలం ఎంత వేగంగా మారుతోంది! గత అయిదేళ్లతో పోలిస్తే ఇప్పుడు దేశ రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో తీవ్ర మార్పులు వచ్చినట్లు కనపడుతోంది. 2014, 2019 సార్వత్రక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లోక్‌సభలో...

కాలం ఎంత వేగంగా మారుతోంది! గత అయిదేళ్లతో పోలిస్తే ఇప్పుడు దేశ రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో తీవ్ర మార్పులు వచ్చినట్లు కనపడుతోంది. 2014, 2019 సార్వత్రక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లోక్‌సభలో అత్యధిక స్థానాలు సాధించింది. అయినప్పటికీ దేశంలో ప్రత్యామ్నాయ శక్తులు బలంగా ఉండేవి. విచిత్రమేమంటే 2024 సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లు సాధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చినా, ప్రత్యామ్నాయ శక్తులు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి. అయిదేళ్ల క్రితం 2020 జనవరిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పౌరసత్వ చట్టంపై భారతీయ జనతా పార్టీని అత్యంత పదునైన భాషలో విమర్శించారు. భారత రాజ్యాంగ పీఠికలో ఏమి రాశారో చదివి మరీ వినిపించారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కూడా అంత బలంగా మాట్లాడేది కాదు. బీఆర్ఎస్ మాత్రమే కాదు, దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎంతో కొంత బలంగా ఉన్నకాలమది. బీజేపీని ప్రాంతీయ పార్టీలే అడ్డుకుంటాయని, బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని విమర్శలు తలెత్తుతున్న రోజులవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా కనిపించేవి.
ఈ అయిదేళ్లలో పరిస్థితులు ఎంతో మారిపోయాయి. ఒడిషాలో 24 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌ను గద్దె దించి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఎవరైనా ఊహించారా? మహారాష్ట్రలో ఒకప్పుడు శివసేనతో పొత్తు కోసం అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ ఆడ్వాణీ ఎంతగానో ప్రయత్నించి బాల్‌థాకరేను తమ వైపునకు తిప్పుకున్నారు. అదే శివసేన మోదీకి ఎదురు తిరిగి కాంగ్రెస్, ఎన్‌సీపీతో కలిసి 2019లో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అప్పుడు బీజేపీకి మహారాష్ట్రలోని 280 సీట్లలో కేవలం 105 సీట్లే దక్కాయి. అయినప్పటికీ శివసేన, ఎన్‌సీపీలను బీజేపీ చీల్చి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి, శివసేన చీలికవర్గం నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు దోహదం చేసింది. గత ఏడాది ఎన్నికల్లో బీజేపీ స్వయంగా అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, చీలిపోయిన ఎన్‌సీపీ, శివసేన పార్టీలు బీజేపీ పంచన చేరతాయని ఎవరు ఊహించారు? హరియాణాలో 2019లో ప్రాంతీయ పార్టీతో చేతులు కలిపి అధికారం ఏర్పాటు చేయాల్సి వచ్చిన బీజేపీ గత ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు. పంజాబ్‌లో 2019 వరకు అకాలీదళ్ లేకుండా బీజేపీ ఒకనాడు పోటీ చేసే పరిస్థితులు ఉండేవి కావు. వాజపేయి, ఆడ్వాణీ ప్రయత్నాల వల్లే అకాలీదళ్ బీజేపీకి స్నేహహస్తం చాచింది. కాని ఇప్పుడు అకాలీదళ్ అంతరించి పోయే పార్టీల జాబితాలో కలిసిపోయే ప్రమాదంలో పడింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి, లోక్ సభలో ఒక్క సీటు కూడా సాధించలేని దుస్థితిలో పడుతుందని, తన పార్టీని జాతీయ పార్టీగా మార్చాలని కలలు కన్న కేసీఆర్ ఫాం హౌజ్‌కు పరిమితమవుతారని, ఆయన పిల్లలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారని ఆ పార్టీ నేతలు కలలో కూడా ఊహించి ఉండరు. ఒకప్పుడు 22 మంది ఎంపీలను, 151 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో స్వయంకృతాపరాధాల వల్ల చిత్తుగా ఓడిపోయి మనుగడ కోసం పోరావలసి వస్తుందని, జగన్ కుడిభుజంగా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి కూడా రాజకీయ సన్యాసం చేస్తారని ఆ పార్టీ నేతల్లో ఎవరు ఊహించారు?
ఈ నేపథ్యంలో ఢిల్లీలో 2013 నుంచీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్ ఏమిటి అన్న విషయం గతంలో ఏనాడు లేని విధంగా చర్చ జరుగుతోంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తర్వాత బీజేపీని ఒంటరిగా ఢీకొంటున్న నేత అరవింద్ కేజ్రీవాల్. 2019లో జరిగిన సార్వత్రక ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ మొత్తం ఏడు లోక్‌సభ సీట్లు దక్కించుకున్నా, ఆరునెలల తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి మెజారిటీ తెచ్చిపెట్టిన నేత కేజ్రీవాల్. తన పథకాల్లో ప్రజల్లో ఆదరణ లభించడంతో తనకు తిరుగులేదని భావించి ఒక దశలో ప్రధానమంత్రి పదవి కోసం కూడా కలలు కన్న కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. నాడు ఢిల్లీలో గెలుపుకోసం అమిత్ షా నిద్రాహారాలు మాని రాత్రింబగళ్లు పనిచేశారు. జామియా, జేఎన్‌యూలలో బీభత్స వాతావరణం నెలకొంది. షాహిన్ బాగ్‌లో నెలల తరబడి నిరసన ప్రదర్శనలు జరిగాయి. పౌరసత్వ చట్టం, 370 అధికరణ రద్దు, త్రిపుల్ తలాఖ్, రామమందిర నిర్మాణంపై తీవ్ర ప్రచారం జరిగింది. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అధునాతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలు, మహిళలు బస్సెక్కితే ఉచితంగా ప్రయాణించేందుకు గులాబీ రంగు టికెట్, మొహల్లా వైద్యశాలలు.. వీటన్నిటితో ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపారు.
కాని 2020లో వచ్చిన ఫలితాలు ఇప్పుడు పునరావృతమవుతాయని చెప్పలేని పరిస్థితి ఢిల్లీలో నెలకొంది. 2019లో మాదిరి 2024లో కూడా బీజేపీ మరోసారి మొత్తం ఏడు లోక్‌సభ సీట్లు సాధించింది. దీన్ని బట్టి ఢిల్లీ ప్రజలు జాతీయ స్థాయిలో నరేంద్రమోదీనే ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారని రెండోసారి రుజువైంది. కాని అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ఖచ్చితంగా చెప్పేందుకు ఆస్కారం లేదు. దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకు అనుసరించిన వైఖరినే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రదర్శించినప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్వయంగా తనంతట తాను తన ప్రతిష్ఠ దిగజారిపోయే పనులు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. టీఆర్ఎస్ మాదిరే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రజా పోరాటం నుంచి పుట్టిన పార్టీ. అవినీతికి వ్యతిరేకంగా జన లోక్‌పాల్ బిల్లుకోసం జరిగిన ఉద్యమమే ఈ పార్టీ ఏర్పడేందుకు దారితీసింది. ఢిల్లీ వీధుల్లో ఒకప్పుడు ఆప్ సంచలనం. యువతీయువకులు ‘నేను ఆమ్ అద్మీని’ అని రాసి టోపీలు ధరించి గల్లీ గల్లీలో పాటలు పాడుతూ, సామాజిక సమస్యలపై నృత్యరూపకాలు ప్రదర్శిస్తూ ప్రజలను ఆకట్టుకునేవారు. సామాన్య ప్రజలకోసం ఇంతగా ఆలోచించిన పార్టీ లేదని, అవినీతికి బద్ద వ్యతిరేకమని ఆ పార్టీ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యమంత్రి అయిన కొత్తలో కేజ్రీవాల్ ప్రజా సమస్యలపై కేంద్రంపై పోరాడేందుకు నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు. దేశ వ్యాప్తంగా ఒకప్పుడు మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ సృష్టించిన సంచలనమే ఆప్ కూడా సృష్టించింది. కేజ్రీవాల్‌తో చేతులు కలిపేందుకు ఎందరో మేధావులు అనేక రాష్ట్రాల్లో ముందుకు వచ్చారు. వారిలో లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్, కోదండరామ్ వంటి వారు కూడా ఉన్నారు.
2020లో ఒక రోజు కేజ్రీవాల్‌ను కలిసి ఆయన పట్ల ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆసక్తి గురించి చర్చించాను. కాని ఆయన దృష్టి ఇతర అంశాలపై ఉన్నట్లు అర్థమైంది. ఆ తర్వాత కొంతకాలానికి బీఆర్ఎస్ నేతలతో ఆయన భవబంధాలు ఏర్పర్చుకోవడం, ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోకి రావడం జరిగింది. ఏ అవినీతి పునాదిగా ఆయన పార్టీ అవతరించిందో ఆ అవినీతి ఆయననే చుట్టుముట్టడం విషాదకరం. తనకంటూ విలాసవంతమైన భవంతిని నిర్మించుకోవడమే కాదు, ప్రభుత్వ పథకాల్లో కూడా వాటా కొట్టేయడం గురించి విజిలెన్స్ నివేదికల్లో బయటపడింది. మొహల్లా క్లినిక్‌లలో నకిలీ పేషంట్లను సృష్టించారని, జరగని వైద్య పరీక్షలను జరిగినట్లు చూపించారని, నాణ్యత లేని మందులు సరఫరా చేశారని ఈ నివేదికలు వెల్లడించాయి. ఒకప్పుడు ఎలాంటి మచ్చాలేని ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి నుంచి అవినీతిపై పాఠాలు నేర్చుకుంది? ఉద్యమాల నుంచి, అణగారిన వర్గాల నుంచి అవతరించిన పార్టీలకు కూడా అవినీతి చెదలు పట్టి హరించుకుపోయే పరిస్థితి ఏర్పడితే ప్రజలకు ఏ రాజకీయ పార్టీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది? కేవలం ఉచితాలే ఈ పార్టీలను కాపాడతాయా?
ఏమైనా దేశంలో ఒంటరిగా ప్రాంతీయ పార్టీలు పోరాడే పరిస్థితి మాత్రం కనపడడం లేదు. ఇందుకు గత ఏడాది జరిగిన సార్వత్రక ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు కుదరకపోయినా జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. లోక్ సభలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 293 మంది సభ్యులు ఉండగా, ఇండియా కూటమిలో 238 మంది సభ్యులు ఉన్నారు. ఏ కూటమికీ చెందనివారు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దేశ రాజధానిలో జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడాన్ని బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహించే స్థితిలో ఉంది. ఢిల్లీలో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల అస్తిత్వం కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ చేతిలో ఆప్ ఓడిపోతే తమకు మళ్లీ కోలుకునే అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనపడుతోంది. ఎందుకంటే ఒకప్పటి కాంగ్రెస్ ఓట్లనే ఆప్ కబళించిందని ఆ పార్టీకి తెలుసు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే పంజాబ్‌లో కూడా ఆప్ ప్రభుత్వానికి చాప కింద నీళ్లు ప్రవేశించే అవకాశాలున్నాయి. ఏమైనా వచ్చే సార్వత్రక ఎన్నికల నాటికి బీజేపీ కూటమికీ, కాంగ్రెస్ కూటమికి ముఖాముఖి హోరాహోరీ పోరు జరిగేందుకు క్రమంగా రంగం సిద్ధమవుతోంది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం