Share News

భారత ప్రస్థానం: జాలువారిన జ్ఞాపకాలు

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:49 AM

గోపాల్‌కృష్ణ గాంధీ జీవన యాత్ర అష్ట పదులలోకి ప్రవేశించనున్నది. 22 ఏప్రిల్‌ 2020న ట్విట్టర్‌పై (అప్పటికింకా అది Xగా మారలేదు) ఒక థ్రెడ్‌ (ట్వీట్‌ల పరంపర)ను పోస్ట్‌ చేశాను. ‘మన మధ్య నడయాడుతున్న ఒక విశిష్ట....

భారత ప్రస్థానం: జాలువారిన జ్ఞాపకాలు

గోపాల్‌కృష్ణ గాంధీ జీవన యాత్ర అష్ట పదులలోకి ప్రవేశించనున్నది. 22 ఏప్రిల్‌ 2020న ట్విట్టర్‌పై (అప్పటికింకా అది Xగా మారలేదు) ఒక థ్రెడ్‌ (ట్వీట్‌ల పరంపర)ను పోస్ట్‌ చేశాను. ‘మన మధ్య నడయాడుతున్న ఒక విశిష్ట భారతీయుని 75వ జన్మదినోత్సవ సందర్భమిది: ఆ ప్రముఖుడు ప్రజాసేవకుడు, దౌత్యవేత్త, రచయిత, విద్వజ్ఞుడు గోపాల్‌కృష్ణ గాంధీ’. మాతృదేశానికి ఆయన అందించిన సేవలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సౌహార్దపూర్వకమైన నడవడి గురించి ప్రస్తుతిస్తూ చివరకు ఆయనకు నేను వ్యక్తిగతంగా ఎలా రుణపడి ఉన్నదీ పేర్కొన్నాను. ఆధునిక భారతదేశ చరిత్ర, మహాత్మాగాంధీ గురించి మరెవ్వరి కంటే కూడా ఎక్కువగా ఆయన నాకు బోధించారు’.

ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. మరి మూడు రోజుల్లో గోపాల్‌ 80వ వసంతంలోకి వెళ్లనున్నారు. ఇప్పుడు ఆయన, తన సొంత జీవన ప్రస్థానంతో సమాంతరంగా సాగిన మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య పురోగతి, తిరోగతిపై ఒక జ్ఞానదాయక గ్రంథాన్ని కానుకగా అందించడం ద్వారా నన్ను (ఇంకా ఎంతో మంది భారతీయులను) మరెంతగానో రుణగ్రస్తుడిని చేసుకున్నారు. తన విస్తృత అధ్యయనం, భారత్‌ గురించిన ప్రగాఢమైన అవగాహనతో చారిత్రక ఘటనల వృత్తాంతాలతో మేళవించిన వ్యక్తిగత జ్ఞాపకాల విలక్షణ చరిత్ర అది. ఆయన వచనం అద్భుతమైనది. మన ఆలోచనాశీలతను సునిశితం చేసేది, రచయిత స్ఫూర్తిదాయక జీవిత గమనాన్ని, మన రిపబ్లిక్‌ సమున్నత, సంక్షోభ భరిత ప్రస్థానాన్ని, మునుపెన్నడూ చూడని చాలా అరుదైన ఛాయచిత్రాలతో సహా అక్షరీకరించిన గ్రంథమది. హిందీ, ఇంగ్లీష్‌, బెంగాలీ, తమిళ చలనచిత్రాల గురించిన ప్రేమపూర్వకమైన ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యం, వైదుష్యం, ప్రజాసేవతో పాటు సినిమాలు సైతం ఆయన జీవితాన్ని ప్రభావదాయకంగా తీర్చిదిద్దాయన్నది స్పష్టం.


గోపాల్‌ తాజా గ్రంథం ‘Undying Light : A Personal History of Independent India’ స్వతంత్ర భారత తొలి సంవత్సరాలను, ప్రత్యేకించి మహాత్ముని చివరి నిరాహార దీక్షలు, ఆయన బలిదానం, నెహ్రూ–పటేల్‌ మధ్య విభేదాలు, దేశ హితానికై వారి సమన్వయ కృషి గురించి విశదమైన కథనాలతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత కాలక్రమానుసారంగా ప్రతి సంవత్సరం గురించి క్లుప్త, ఉల్లాసకరమైన కథనాలతో కొనసాగి, చివరి దశాబ్దంన్నర కాలం గురించి ఒక ఏకీకృత అధ్యాయంతో ముగుస్తుంది.

స్వాతంత్ర్య ఆగమనం, దేశ విభజన తరుణంలో జన్మించిన గోపాల్‌కృష్ణ గాంధీ మన రిపబ్లిక్‌తో పాటు ఎదుగుతూ వచ్చారు. దేశభక్తి ప్రపూరితులైన తల్లిదండ్రులు దేవదాస్‌ (మహాత్ముని కుమారుడు), లక్ష్మి (రాజాజీ కుమార్తె) ఆయన మేధో పరిణామాన్ని ప్రభావితం చేశారు. తన తోబుట్టువులు తార, రాజ్‌మోహన్‌, రామచంద్ర గురించి కూడా గోపాల్‌ అవ్యాజ ప్రేమాదరాలతో రాశారు. ఇంకా వివాదాస్పద ప్రధానమంత్రులు, లోక విఖ్యాతులుకాని ఉపాధ్యాయులు, సంఘ సేవకులు, ఎంతో మంది ఆసక్తిదాయక ప్రభావశీల వ్యక్తుల గురించిన విశేషాలు కూడా మనకు గోపాల్‌ గ్రంథం ద్వారా తెలుస్తాయి. గోపాల్‌ తన మాతామహుడు చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) గురించి సహజంగానే ప్రముఖ ప్రాధాన్యంతో రాశారు. స్వతంత్ర భారతదేశంలో అత్యున్నత పదవిని అధిష్టించిన రాజాజీ, తన రాజకీయ జీవితోన్నతికి బాటలు వేసిన భారత జాతీయ కాంగ్రెస్‌ను విడనాడి ‘స్వతంత్ర పార్టీ’ అనే ప్రతిపక్షాన్ని వ్యవస్థాపించారు. ‘తన జీవితంపై ఏకైక అతి పెద్ద ప్రభావం’ తన మాతామహుడేనని గోపాల్‌ వివరించారు.

గోపాల్‌ పదే పదే ప్రస్తావించిన రెండో వ్యక్తి సాటిలేని సంగీత విదుషీమణి ఎమ్‌ఎస్‌ సుబ్బులక్ష్మి. కుటుంబ స్నేహితురాలు అయిన సుబ్బులక్ష్మి సంగీతం, సమున్నత వ్యక్తిత్వం గోపాల్ జీవితంపై ఒక అజరామరమైన ప్రభావం. ఆయనను బాగా ప్రభావితం చేసిన మూడో వ్యక్తి జయప్రకాశ్‌ నారాయణ్‌. ఆయన పరిపూర్ణ చిత్తశుద్ధి, ప్రశాంత వక్తృత్వం, ముఖ వర్ఛస్సు, అన్నిటినీ మించి ఆయన ఆంగ్ల భాషా గరిమ తనను బాగా ప్రభావితం చేశాయని గోపాల్‌ రాశారు. భారత్‌–చైనా సంఘర్షణ కాలంలో తన అభిమాని ఆహ్వానంపై జయప్రకాశ్‌ ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్ కళాశాలలో ఒక ఉపన్యాసం వెలువరించారు. ‘స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతీయవాదం అంటే వలసపాలన నుంచి విముక్తికై పోరాడడం, కోల్పోయిన ఆత్మగౌరవాన్ని పునః సాధించుకోవడం, స్వావలంబన అహింసాత్మకంగా శాసనోల్లంఘన చేయడంగా వర్ధిల్లిందని చెప్పారు. స్వాతంత్ర్య సాధన అనంతరం అసహనం, యుద్ధోన్మాదం, ఇరుగు పొరుగు దేశాలను బెదిరించడం, శ్రుతి మించిన దేశభక్తిని జాతీయ వాదంగా అర్థం చేసుకుంటున్నారని జయప్రకాశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు’.

గోపాల్ మనో ప్రపంచం నుంచి జాలువారిన ఈ జ్ఞాపకమూ, 1960ల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో ఆంగ్లభాష వాడకాన్ని పూర్తిగా త్యజించేందుకు జరిగిన ప్రయత్నాలపై కథనమూ రెండూ నేరుగా వర్తమానంతో సంభాషించేవే. గోపాల్ ఇలా రాశారు: ‘నేను బాధతప్త హృదయంతో నలిగిపోయాను. హిందీని అభిమానిస్తాను, అయితే దాని సామ్రాజ్యవాద డాంబికాన్ని ద్వేషిస్తాను. భాష విషయమై రాజాజీ భావాలతో ప్రభావితుడిని అయిన నేను అధికార భాషగా ఇంగ్లీష్‌కు స్వస్తిచెప్పాలన్న ప్రతిపాదనను ఎటువంటి మినహాయింపు లేకుండా తీవ్రంగా వ్యతిరేకించాను’.


గోపాల్‌కృష్ణ గాంధీ ‘Undying Light : A Personal History of Independent India’ స్వతంత్ర భారతదేశ ప్రస్థానాన్ని వివరించింది. ఈ విశిష్ట కథనం, జాతి గమనాన్ని ప్రభావితం చేసిన ప్రధాన సంఘటనలు, వివాదాలను వ్యాఖ్యాన సహితంగా వర్ణించింది. ఈ నేపథ్యంలో, కర్ణాటక సంగీత కచేరిలో గాత్ర విద్వాంసుడికి వాద్య సహకారం అందించే వాయులీన వాద్యకారుడు సృజించే నాద లయలా, గోపాల్‌ స్వీయ జీవనయానం మనకు అవగతమవుతుంది. ఐఏఎస్‌ అధికారిగా గోపాల్‌ ఉద్యోగ జీవితం గ్రామీణ తంజావూరు ప్రాంతంలో ప్రారంభమయింది. ఆ తొలినాళ్లలో ఆయన ఒక సిరియన్‌ క్రైస్తవుడు, ఒక తమిళ జైనుడు, ఒక ముస్లిమ్‌తో కలిసి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఆ ఉద్యోగ జీవితం ఉచ్చదశలో రాష్ట్రపతి కార్యదర్శిగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. ఆ తరువాత మూడు ఖండాలలో నాలుగు దేశాలలో ఐదు వేర్వేరు దౌత్య బాధ్యతల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఉన్నత విధుల నిర్వహణ గురించి గొప్ప ఖచ్చితత్వం, స్పష్టతతో గోపాల్‌ రాశారు. దక్షిణాఫ్రికా, శ్రీలంక రాజకీయాలపై ఆయన ఆలోచనాత్మకమైన వృత్తాంతాలు ఎంతో విలువైనవి.

తమిళులు, బెంగాలీలు, దిల్లీవాలాలు ఆయనకు బాగా సుపరిచితులే అయినప్పటికీ ఈ సువిశాల భారతదేశంలోని సకల సామాజిక, సాంస్కృతిక వైవిధ్యాల గురించి గోపాల్‌కు మంచి అవగాహన ఉన్నది. ఈశాన్య భారత సమస్యాత్మక సరిహద్దు ప్రాంతాలు, కశ్మీర్‌కు గోపాల్‌ తన కథనంలో సముచిత ప్రాధాన్యమిచ్చారు. ఆయన ‘Undying Light’ పలు ఆసక్తికరమైన ఉదంతాలను వెల్లడించింది. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైన తరువాత రాజాజీ, ఆయన కుమార్తె నామగిరి హైదరాబాద్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా గవర్నర్‌ –జనరల్‌ కుమార్తెకు నిజాం నవాబు వజ్రాలు పొదిగిన ఒక నెక్లెస్‌ను బహుమానంగా ఇచ్చారు. అయితే రాజాజీ ఆ ఆభరణాన్ని తీసుకునేందుకు అంగీకరించలేదు. వితంతువు అయిన తన కుమార్తెకు అటువంటి విలువైన ఆభరణాన్ని ఇవ్వటం సుముచితం కాదని రాజాజీ అభిప్రాయపడ్డారు. ఆ తరువాత నామగిరి తన తండ్రి వైఖరిని ఆక్షేపించారు. వజ్రాల నెక్లెస్‌ను తిరిగి ఇచ్చివేస్తూ ‘మేము గాంధీ గారి శిష్యులం. అంత ఖరీదైన వస్తువులు మాకు అవసరం లేదు’ అని చెప్పి ఉండవలసింది.


గాంధీ, రాజాజీల మనుమడుగా గోపాల్‌కు తమ కుటుంబ విశిష్ట నేపథ్యం గురించి, ఆ గొప్పదనం తన జీవితోన్నతికి ఎలా దోహదం చేసిందో, అప్పుడప్పుడూ ఎలా ఆటంకమయిందో గోపాల్‌కు బాగా తెలుసు. న్యూఢిల్లీలోని తమ స్వగృహానికి నిత్యం ఎంతో మంది అసాధారణ వ్యక్తులు వస్తూ పోతుండడాన్ని బాల్యం నుంచి సన్నిహితంగా పరిశీలించిన గోపాల్‌ ఇలా రాశారు: ‘హరిజన సేవ’ విషయమై మా కుటుంబానికి ఉజ్వలమయిన యశస్సు ఉన్నది. అయితే మా కుటుంబ సన్నిహిత, స్నేహితులలో దళిత వ్యక్తి ఎవరూ లేరు. అవును, ఒక దళితుడు కూడా లేదు. మాకు ముస్లిమ్‌ క్రిస్టియన్‌, సిక్కు స్నేహితులు ఉన్నారు. అమెరికాలో ఆఫ్రికన్‌ అమెరికన్లు ఎంతో మంది మాకు స్నేహితులే. యూదు మతస్థులూ ఎంతో మంది మాకు స్నేహితులే. అయితే ఒక్క భారతీయ దళితుడు కూడా లేడు’.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి గోపాల్‌ ఇలా రాశారు: ‘ఆయన పాత నౌక ఎస్‌.ఎస్‌ ఇండియాకు కొత్త కెప్టెన్‌ కాదు; కొత్త నౌక ఎస్‌.ఎస్‌ భారత్‌కు కొత్త సరంగు. పాత నౌకకు ప్రజాస్వామిక గణతంత్రవాదం, లౌకికవాదం అనే ఇంజిన్లు ఉండగా కొత్త నౌక మెజారిటేరియన్‌ జాతీయవాదం, హిందుత్వ అనే ఇంజిన్లతో నడుస్తున్నది’. డిసెంబర్‌ 1992లో బాబ్రీమసీదు కూల్చివేతకు సంబంధించిన కథనంలో గోపాల్‌ తన డైరీ నుంచి రెండు వ్యాఖ్యలను ఉటంకించారు: ‘30 జనవరి 1948 తరువాత భారతదేశ చరిత్రలో ఇది (6, డిసెంబర్‌ 1992న బాబ్రీ కూల్చివేత) ‘చీకటి క్షణం’ అని పేర్కొంటూ ఆయన ఒక ప్రశ్నను సంధించారు: ‘మనం ఒక నాగరికత పతనం అంచున ఉన్నామా?’


‘అన్‌డైయింగ్‌ లైట్‌’ ముగింపు అధ్యాయంలో వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యల గురించి గోపాల్‌ ప్రస్తావించారు. అవి: విశృంఖలంగా పర్యావరణ విధ్వంసం, మత విద్వేషం, రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి క్షీణించడం, రాజకీయ ఎజెండాలకు గతాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవడం మొదలైనవి. గోపాల్‌కృష్ణ గాంధీ తన యవ్వనంలో ఆవాహన చేసుకుని, ఉద్యోగ, మేధో జీవితంలో స్ఫూర్తిదాయకంగా నిబద్ధమైన భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య ఆదర్శాలకు అవి పెనుసవాళ్లుగా పరిణమించాయి. అయినప్పటికీ గోపాల్‌ తన పుస్తకాన్ని ఈ ఆశావహమైన వాక్యంతో ముగించారు: ‘భారత్‌ వెలుగు మసకబారవచ్చు కానీ అది అంతరించదు. భారత్‌ ఆత్మ తేజస్సు ప్రకాశిస్తూనే ఉంటుంది’.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 19 , 2025 | 05:49 AM