Share News

Venkaiah Naidu: మహిళా సాధికారతతోనే వికసిత భారతం

ABN , Publish Date - Mar 08 , 2025 | 06:40 AM

ఈ సమయంలో ఓ విషయం నన్ను ఎంతగానో ఆకట్టుకునేది. ఏ విద్యాసంస్థ కార్యక్రమానికి వెళ్లినా, అక్కడ మంచి ప్రతిభ చూపిన వారికి నా చేతుల మీదుగా అవార్డులు అందింపజేసేవారు. ఆ సమయంలో నా చేతుల మీదుగా అవార్డులు అందుకునే వారిలో...

Venkaiah Naidu: మహిళా సాధికారతతోనే వికసిత భారతం

  • మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

నేను ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి యువతతో కలవడం, వారి ఆకాంక్షలను తెలుసుకోవడం, నా అనుభవాలను పంచుకోవడం, భవిష్యత్ దిశగా వారికి దిశానిర్దేశం చేయడాన్ని నా కర్తవ్యంగా ముందుకు సాగుతున్నాను. ఈ సమయంలో ఓ విషయం నన్ను ఎంతగానో ఆకట్టుకునేది. ఏ విద్యాసంస్థ కార్యక్రమానికి వెళ్లినా, అక్కడ మంచి ప్రతిభ చూపిన వారికి నా చేతుల మీదుగా అవార్డులు అందింపజేసేవారు. ఆ సమయంలో నా చేతుల మీదుగా అవార్డులు అందుకునే వారిలో... ఎక్కువ శాతం (65 శాతానికి పైగా) ఆడపిల్లలే ఉండేవారు. అవకాశం ఇస్తే... వారు ఏ విధంగా ఎదగగలరు అనే విషయానికి ఇదే ఉదాహరణ. విద్యా రంగంలోనే కాదు, నేడు అనేక రంగాల్లో మహిళా సాధికారత ఫలాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చెప్పిన ఓ మాట నాకు జ్ఞప్తికి వస్తోంది.

‘‘మహిళలు ఇతరులపై ఆధారపడకుండా, తమ జీవితాలను తాము నియంత్రించుకోగలిగే విధంగా, తమ సవాళ్ళను తామే పరిష్కరించుకునే విధంగా సాధికారత పొందాలి.’’

ఈ ఆకాంక్షలోని ఆంతర్యాన్ని ఈ తరం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మహిళా సాధికారత, స్త్రీ స్వేచ్ఛను అనేక కోణాల్లో ఆలోచించి అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా సంప్రదాయవాదులం అని చెప్పుకుంటూ మహిళా స్వేచ్ఛకు అడ్డంకిగా మారుతున్న ఆలోచనా విధానాల్లో మార్పు రావలసిన అవసరం ఉంది.


భారతీయ సంస్కృతి స్త్రీని శక్తి స్వరూపంగా పూజించింది. ‘శక్తి రూపేణ సంస్థిత’ అంటూ మన సనాతన ధర్మం అమ్మవారిని అభివర్ణించింది. ఇక్కడ నదుల పేర్లు స్త్రీ రూపాలే. భూమాత, ప్రకృతి మాత, చెట్టు తల్లి... ఇలా మనిషికి మేలు చేసే ప్రతిదీ అమ్మ స్వరూపంగా భావించాం. విద్యలకు సరస్వతి మాతను, వేదాలకు గాయత్రి మాతను, సంపదకు లక్ష్మీ మాతను, ధైర్యానికి పార్వతీ మాతను పూజిస్తాం. సీతారాములు, పార్వతి పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు అంటూ అగ్రస్థానాన్ని అమ్మవారికే ఇస్తూ వస్తున్నాం. అంతేనా శివుడు అర్ధనారీశ్వరుడుగా సగభాగం అమ్మవారికి ఇస్తే, శ్రీమహావిష్ణువు గుండెల్లో నిలుపుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది... ఇంతగా స్ర్తీలను భారతీయ సంస్కృతి గౌరవించింది.

ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న భారతదేశం మీద కన్నేసిన పరాయి దేశాలు, మన సంస్కృతిని నాశనం చేసి, మన మీద పెత్తనం చేయాలని చూశాయి. అదే సమయంలో భారతదేశం మాత్రమే గాక... భారతీయ స్త్రీల సాధికారత సైతం చీకటిలోకి వెళ్ళిపోయింది. స్వరాజ్యం సాధించుకునే సమయానికి పరదేశీయులకు భయపడి ఏర్పాటు చేసుకున్న ఆంక్షలు సంప్రదాయాలుగా మారిపోయాయి. అవే మహిళా సాధికారతకు అడ్డంకిగా మారడం విచారకరం. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే... ముందుగా సమాజం ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలి. ‘‘స్త్రీలను గౌరవించి, వారికి అధికారం ఇచ్చే దేశాన్ని అభివృద్ధి చెందిన, నాగరిక దేశంగా భావించాలి’’ అన్న స్వామి వివేకానంద పలుకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.


ప్రపంచ శక్తిగా భారత్ ఎదిగే క్రమంలో ప్రధాన అడ్డంకిగా మారుతున్న వివక్షలు, అసమానతలకు వ్యతిరేకంగా యువతీ యువకులు గళం ఎత్తాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి రావాలంటే ముందుగా ‘స్త్రీ విద్య’ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి. పురుషుడి చదువు అతడికి మాత్రమే భవిష్యత్‌ను ఇస్తే, స్త్రీ విద్య మొత్తం కుటుంబ అభివృద్ధికి బాటలు వేస్తుంది. మహిళలు విద్యావంతులు కావడం వల్ల శిశుమరణాల రేటు తగ్గుతుంది. కుటుంబ ఆరోగ్యం మెరుగు పడుతుంది. పిల్లల పోషణ, ఆరోగ్యంతో పాటు వారి విద్యాపరమైన అవకాశాల మీద సానుకూల ప్రభావం ఏర్పడి అనేక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ప్రారంభించిన బేటీ బచావ్ – బేటీ పఢావ్, సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలు సమాజంలో మార్పునకు బీజాలు వేశాయి. నేను నెల్లూరు వెళ్ళినప్పుడు స్వర్ణభారత్ ట్రస్ట్‌కు వచ్చి, నన్ను కలిసే చాలా పేద కుటుంబాలు ఈ పథకాల వల్ల తమకు ఎలాంటి ఉపయోగాలు లభించాయో తెలియజేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.


స్వరాజ్యం సముపార్జించుకుని 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మహిళా విద్య, మహిళా సాధికారత లాంటి అంశాల మీద మాట్లాడాల్సిన పరిస్థితి రావడం ఓ విధంగా బాధాకరమే. అయితే గత పదేళ్లుగా మొదలైన మార్పులు ప్రజా ఉద్యమాలుగా రూపుదాల్చి, వికసిత భారత సాకారం దిశగా ముందుకు సాగుతుండటం ఆనందదాయకం. ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్ద దేశాలతో పోల్చి చూస్తే, భారత్ సాధించిన మహిళా సాధికారత వేగం ఆశ్చర్యం కలిగించకమానదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం మహిళా భద్రత, మహిళా సాధికారతను మరింత కీలకంగా భావించి ముందుకు సాగడం వల్లనే ఈ మార్పు సాధ్యమైందని భావిస్తున్నాను. ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందిపుచ్చుకోవాలి. సమాజంలో నేటికీ అక్కడక్కడా కనిపిస్తున్న లైంగిక హింస, అసమానతలు, బాల్యవివాహాలు, నిరక్షరాస్యత, సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటివి మహిళా సాధికారతకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. లింగ వివక్ష సమసిపోవడమే ఈ సమస్యకు మేలైన పరిష్కారం. నా దృష్టిలో మహిళా సాధికారతకు నిదర్శనం మహిళలకు సమానంగా ఆస్తి హక్కు, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు వంటివే. సమాజం ఆలోచనా ధోరణిలో మార్పు ద్వారానే ఇది సాధ్యమౌతుంది.

సమాజం ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చి వచ్చి, మహిళా శక్తిని బలహీన పరుస్తున్న కొన్ని అంశాల్లో పునరాలోచన జరగాలని సూచిస్తూ... మహిళామణులు విద్య, సాధికారతలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగి, వికసిత భారత నిర్మాణాన్ని ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను.

ముప్పవరపు వెంకయ్యనాయుడు

పూర్వ ఉపరాష్ట్రపతి

Updated Date - Mar 08 , 2025 | 06:45 AM