Share News

పవిత్ర మాసపు ‘ఉమ్రా’ యాత్ర

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:26 PM

ఉమ్రా అనేది ఇస్లాంలో పవిత్రమైన యాత్ర. ఇది హజ్‌ కన్నా చిన్నది కానీ చాలా పుణ్యప్రదమైనది. మక్కాలోని కాబా భవనాన్ని దర్శించేందుకు ప్రత్యేకంగా చేసే యాత్ర. హజ్‌ ఒక్కసారి మాత్రమే నిర్దిష్ట కాలంలో చేయాలి కానీ ఉమ్రా ఏ సమయంలోనైనా చేయవచ్చు.

పవిత్ర మాసపు ‘ఉమ్రా’ యాత్ర

ఇస్లాం అనుసరిస్తున్న ప్రతీ ముస్లిం కచ్చితంగా పాటించాల్సిన ఐదు కర్తవ్యాల్లో ఒకటి హజ్‌ యాత్ర. ఆర్థిక పరిపుష్టి ఉన్న ప్రతీ ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్‌ యాత్రకు వెళ్లాలని అల్లాహ్‌ పవిత్ర ఖురాన్‌లో ఆదేశించాడు. అయితే హజ్‌ యాత్ర ప్రతీ ఏటా నిర్దిష్ట సమయంలో ఉంటుంది. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం 12 నెలల్లోని చివరి నెల ‘దుల్‌ హిజ్జా’లో హజ్‌ ఉంటుంది.

గతేడాది 190 దేశాల నుంచి పాతిక లక్షలకు పైగా ముస్లింలు హజ్‌ యాత్రలో పాల్గొంటే... భారతదేశం నుంచి దాదాపు 1.75 లక్షల మంది వెళ్లారు. అయితే నెల రోజులకు పైగా సాగే హజ్‌ యాత్రతో పోలిస్తే.. ‘ఉమ్రా’ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య ఈ మధ్య భారీగా పెరుగుతోంది. దీనికి నిర్దిష్టమైన సమయం అంటూ ఏదీ లేదు. హజ్‌ మినహా.. మిగతా నెలల్లో ఎప్పుడైనా ఈ యాత్ర చేపట్టవచ్చు. పవిత్ర రంజాన్‌ మాసంలో చేసే ఉమ్రా యాత్ర... హజ్‌ యాత్రకు సమానమైన పుణ్యం లభిస్తుందని దివ్య ఖురాన్‌లో ప్రస్తావించారు. దాదాపు నెలరోజుల పాటు సాగే హజ్‌ యాత్రకు దాదాపు రూ. 7లక్షల వరకు ఖర్చు అవుతుండగా... తక్కువ వ్యవధిలో (ఒక రోజులోనూ పూర్తి చేసుకోవచ్చు) చేసుకునే ఉమ్రా యాత్రకు గరిష్ఠంగా అయ్యే ఖర్చు రూ. లక్షలోపే. ఈ ఏడాది మార్చిలో ముగిసిన రంజాన్‌ మాసంలో ఉమ్రా యాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి రికార్డు సంఖ్యలో కోటి మందికి పైగా హాజరయ్యారు.


15 రోజుల యాత్ర...

ఎలాగైనా ఉమ్రా చేయాలన్న లక్ష్యంతో ఉన్న మాకు రంజాన్‌ మాసంలో అవకాశం లభించింది. నేను మా నాన్న, సోదరితో కలిసి 15 రోజుల ఉమ్రా యాత్రకు మార్చి 23న బయలుదేరాం. హైదరాబాద్‌ నుంచి అనేక ట్రావెల్‌ ఏజెన్సీలు ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఒక్కరికి రూ. 1.10 లక్షల చొప్పున మా యాత్ర ట్రావెల్‌ ఎజెన్సీ ద్వారా జరిగింది. సాధారణంగా ఉమ్రా ప్యాకేజీలు 12-18 రోజుల వరకూ ఉంటాయి. ఇతర రోజుల్లో 15 రోజుల యాత్రకు రూ.70 నుంచి 80వేలు వరకు ఖర్చవ్వగా, రంజాన్‌ మాసంలో డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో రూ. 1.10 నుంచి 1.50 లక్షల వరకు ఖర్చవుతుంది. సౌదీ అరేబియాలో బస, హైదరాబాదీ వంటకాలు, రవాణా, అన్ని ఏర్పాట్లు ట్రావెల్‌ ఏజెన్సీలే చూసుకుంటాయి. అక్కడ ఏదైనా షాపింగ్‌ చేయాలంటేనే సౌదీ కరెన్సీ ‘రియాల్‌’ (ఒక్క రియాల్‌ సుమారు 22 రూపాయలకు సమానం) అవసరం ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి మక్కాకు సమీపంలోని జెడ్డా విమానాశ్రయానికి నేరుగా విమానాలున్నాయి. ప్రయాణ సమయం సుమారు 6 గంటలు.


కాబా వైపు తొలిచూపు...

ఉమ్రా అనేది ఇస్లాంలో పవిత్రమైన యాత్ర. ఇది హజ్‌ కన్నా చిన్నది కానీ చాలా పుణ్యప్రదమైనది. మక్కాలోని కాబా భవనాన్ని దర్శించేందుకు ప్రత్యేకంగా చేసే యాత్ర. హజ్‌ ఒక్కసారి మాత్రమే నిర్దిష్ట కాలంలో చేయాలి కానీ ఉమ్రా ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఉమ్రా మొదలుపెట్టే ముందు పురుషులు ‘ఇహ్రామ్‌’ అనే ప్రత్యేక వస్ర్తాన్ని ధరించాలి. రెండు తెల్ల వస్ర్తాలు ధరించాల్సి ఉంటుంది. మహిళలు సాధారణ వస్ర్తాలతోనే హిజాబ్‌లో ఉండాలి. సాధారణంగా పురుషులు ఇంటి నుంచే ఇహ్రామ్‌ ధరించి వెళ్తారు. జెడ్డా విమానాశ్రయం నుంచి మక్కా నగరం సుమారు 90 కి.మీ. ఉంటుంది. గంటన్నరలోపే మక్కా చేరుకుంటాం. మక్కా చేరుకున్న వెంటనే అందరి లక్ష్యం ఉమ్రా యాత్ర వెంటనే చేయాలనే ఉంటుంది. దీనికోసం అక్కడ ప్రత్యేక సహాయకులను (గైడ్‌) ట్రావెల్‌ ఏజెన్సీలే సమకూరుస్తాయి.


book8.2.jpg

మేము మక్కా చేరగానే సామాను హోటల్లో భద్రపరచుకుని ఉమ్రా యాత్ర కోసం బయలుదేరాం. నల్లటి వస్త్రంతో కప్పి ఉంచిన పవిత్ర భవనం ‘కాబా’ను అల్లాహ్‌ ఇల్లుగా పరిగణిస్తారు. అందుకే ప్రపంచంలోని ముస్లింలు నమాజ్‌ను కాబా వైపు అనుసరిస్తారు. కాబాను తొలిసారి చూసేవారు తన్మయత్వానికి గురవుతారు. తొలిసారి కాబాను చూసిన క్షణం మనసులో ఏది కోరుకున్నా అది నెరవేరుతుందని ప్రతీ ముస్లిం విశ్వసిస్తాడు. ‘కాబా ఉన్న మస్జిదే హరం భవనంలో అడుగు పెట్టగానే అందరి చూపు నేలవంక ఉండాలి. కాబా దగ్గరికి వెళ్లిన తర్వాతే చూపు పైకెత్తాలి. అప్పుడే కాబాను సంపూర్ణంగా చూడవచ్చు..’ అని గైడ్‌ ముందే చెప్పాడు. ఈ నేపథ్యంలో తొలిసారి కాబాను దర్శించిన వారి కళ్లవెంట వారి ప్రమేయం లేకుండానే కన్నీళ్లు జాలువారుతాయి. ఆ మధుర ఘడియల్లో చేతులెత్తి అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. దివ్య ఖురాన్‌లో అల్లాహ్‌ సూచించిన మార్గంలో పయనించే శక్తిని ప్రసాదించాలని వేడుకుంటారు.


కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు...

కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయడం ఉమ్రా యాత్రలో కీలకం. దీనిని ‘తవాఫ్‌’ అంటారు. కాబా చుట్టూ ఏడుసార్లు తిరిగే ముందు ఏడు ప్రత్యేక ‘దువా’లు పఠిస్తూ ఉండాలి. ప్రాపంచిక సమస్యలు, బాధలన్నీ వదిలి... ఏడు ప్రదక్షిణలు సంపూర్ణమైన భక్తితో, మనస్ఫూర్తిగా చేయాలి. తవాఫ్‌ అనంతరం అక్కడే ప్రత్యేక నమాజు ఆచరించాక... కాబా సమీపంలోనే ఉన్న ‘సఫా-మర్వా’ అనే రెండు చిన్నపాటి గుట్టల మధ్య కాలినడక యాత్ర ఉంటుంది. ఈ రెండు గుట్టల మధ్య దూరం దాదాపు అర కిలోమీటరు. ఇస్లాంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ‘జమ్‌జమ్‌’ నీరు ఇక్కడే ఆవిర్భవించింది.


ఇక్కడ సైతం ఏడుసార్లు ప్రదక్షిణలు ఉంటాయి. అక్కడే ప్రత్యేక నమాజు ఆచరించి చివర్లో పురుషులు తల వెంట్రుకలను పూర్తిగా తొలగించాలి. మహిళలు తమ జుట్టు చివర్లను కత్తిరిస్తారు. దీంతో ఉమ్రా పూర్తవుతుంది. ఒక యాత్రలో ఒక ఉమ్రా మాత్రమే చేయొచ్చు. చనిపోయిన లేదా వృద్దాప్యం, అనారోగ్య సమస్యలతో రాలేని తల్లిదండ్రులు, ఇతర బంధుమిత్రుల పక్షాన చేయాలనుకుంటే.. ఒక ఉమ్రా పూర్తయ్యాక మక్కా నగరాన్ని వీడాలి. దాదాపు 100 కి.మీ. దూరంలోని మక్కా నగర సరిహద్దులను (మీఖాత్‌) దాటి వెళ్లాలి. అక్కడి నుంచి పురుషులైతే మళ్లీ రెండు తెల్ల వస్ర్తాలఇహ్రామ్‌ ధరించాలి. మహిళలు సాధారణ దుస్తుల్లోనే హిజాబ్‌తో ఉండాలి. ఇలా ఇతరుల పక్షాన రెండోసారి కూడా ఉమ్రా చేసే వీలుంది.

5 వేల ఏళ్ల నిరంతర ప్రవాహం...

‘జమ్‌జమ్‌’ నీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అత్యంత స్వచ్ఛమైన నీటిని అందించే, ప్రపంచంలోనే అత్యంత పురాతన బావిగా దీనిని పేర్కొంటారు. దాదాపు 5 వేల ఏళ్ల క్రితం అల్లాహ్‌ ప్రవక్త ఇబ్రాహీం అలైసలాంకు 86 సంవత్సరాల వయస్సులో కుమారుడు ఇస్మాయిల్‌ అలైసలాం జన్మిస్తాడు. లేకలేక జన్మించిన సంతానంతో ఎంతో సంతోషంగా ఉన్న ఇబ్రాహీంకు అల్లాహ్‌ పరీక్ష పెడతాడు. కలలో వచ్చి తన కుమారుడిని మండు ఏడారిలో వదిలేయాలని ఆజ్ఞాపిస్తాడు. అల్లాహ్‌ ఆజ్ఞ పాటించేందుకు ఇబ్రాహీం భార్య హాజరా సిద్ధమవుతుంది. తన భార్య, నెలలు కూడా నిండని శిశువును తీసుకెళ్లి మండు ఏడారిలో వదిలేస్తాడు. దాహంతో శిశువు కేకలకు తల్లి హాజరా నీటి కోసం సఫా-మర్వా గుట్టల మధ్య అటూ ఇటూ పరుగులు పెడుతూ తన బిడ్డ దాహాన్ని తీర్చాలని అల్లాహ్‌తో వేడుకుంటుంది. తన ఆజ్ఞను పాటించినందుకు అల్లాహ్‌ సంతోషిస్తాడు. ఓ తల్లి తల్లడిల్లే హృదయంతో చేసిన ప్రార్థనను అల్లాహ్‌ అంగీకరిస్తాడు. వెంటనే శిశువు ఇస్మాయిల్‌ అలైసలాం పాదాల కింద భూమి రెండుగా చీలిపోతుంది. అందులో నుంచి నీటి ఊట ఉబికి వస్తుంది. అయితే నీటి ప్రవాహం క్రమక్రమంగా వేగంగా పెరుగుతుండటం చూసి ఆమె ఆందోళనకు గురవుతుంది. తన శిశువు ఎక్కడ మునిగిపోతాడో అన్న ఆందోళనతో ఆమె అల్లాహ్‌ను ప్రార్థిస్తుంది. ఆ నీటి ప్రవాహం వంక చూస్తూ ‘జమ్‌ జమ్‌’ (ఆగిపో ఆగిపో) అనడంతో ప్రవాహం తగ్గుతుంది. దీంతో ఆ నీటికి జమ్‌జమ్‌గా పిలుస్తారు. ఈ సంఘటన దాదాపు 5 వేల ఏళ్ల క్రితం జరిగిందని ఇస్లాం పండితుల అంచనా. అప్పటి నుంచి అక్కడ నీరు నిరంతరాయంగా ఉబికి వస్తూనే ఉంది. అల్లా అపార కరుణకు సంబంఽధించి దివ్య ఖురాన్‌లో ప్రస్తావించిన వందలాది ఉదాహరణల్లో ఇది ఒకటి. హజ్‌, ఉమ్రా యాత్రకు వచ్చే ప్రతీ ముస్లిం ‘సఫా-మర్వా’ గుట్టల మధ్య ప్రదక్షిణలు చేయడం తప్పనిసరి. తన ఆజ్ఞను పాటించిన విధేయులకు.. అల్లాహ్‌ ఎడారిలోనూ నిరంతర నీటి ప్రవాహాన్ని సృష్టించాడు. అంటూ జమ్‌జమ్‌ ఆవిర్భావం గురించి దివ్య ఖురాన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. తన పరీక్షలో నెగ్గిన ప్రవక్త ఇబ్రాహీం అలైసలాం, హాజరా దంపతుల స్ఫూర్తి ఈ ప్రపంచం ఉన్నంతవరకూ గుర్తుండాలన్నదే.. ఉమ్రా, హజ్‌ యాత్రలో సఫా-మర్వా గుట్టల చుట్టూ ప్రదక్షిణల ముఖ్య ఉద్దేశం. యాత్రీకులు జమ్‌జమ్‌ నీటిని సేవించడం పుణ్యప్రదంగా భావిస్తారు. హజ్‌, ఉమ్రా పూర్తిచేసిన యాత్రీకులు ఇక్కడి నీటిని బంధుమిత్రులకు బహుమతిగా అందిస్తారు.


మక్కా నుంచి మదీనాకు...

15 రోజుల ఉమ్రా యాత్రలో 7 రోజులు మక్కా, 7 రోజులు మదీనాలో గడుపుతారు. ఇస్లాం ధర్మంలో మక్కా తర్వాత మదీనా నగరానికి ఉన్నతమైన స్థానం ఉంది. ఈ రెండు నగరాలు సౌదీ అరేబియాలో ఉన్నాయి. ముస్లింలకు పవిత్రమైన మూడు నగరాలలో మక్కా, మదీనా తర్వాత మూడో జెరూసలం. ఇస్లాంలో చివరి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కాలో జన్మించారు. ఆయనకు మొదటిసారిగా వహీ (అల్లా దివ్య సందేశం) ఉత్పన్నమైంది. ఇస్లాం ధర్మం ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ప్రవక్త ముహమ్మద్‌ మక్కా నుంచి మదీనా వెళ్లడంతో ఆ నగరం ఆవిర్భవించింది.


మదీనాలో ఉన్న ‘మస్జిద్‌ అల్‌ నబవీ’ అనేది ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా నిర్మించిన మసీదు. ఇది ఇస్లాంలో రెండవ గొప్ప మసీదు. ప్రవక్త ముహమ్మద్‌ మదీనాలోనే తుదిశ్వాస (వఫాత్‌) విడిచారు. ఆయన సమాధి మస్జిద్‌ నబవీ లోపల ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు మదీనాకు వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించి సలామ్‌ చెబుతారు. మక్కా, మదీనా ముస్లింల హృదయాలలో అత్యంత పవిత్రమైన స్థలాలు. ఇవి ఆధ్యాత్మికత, శాంతి, ఐక్యతకు ప్రతీకలు. ప్రతీ ముస్లిం జీవితంలో కనీసం ఒక్క సారైనా ఈ పవిత్ర నగరాలను సందర్శిం చాలని ఆకాంక్షిస్తాడు. ఇవి ఇస్లాం ధర్మానికి మూలస్తంభాలుగా నిలిచిన నగరాలు.

- ముహహ్మద్‌.ఆర్‌.హెచ్‌.షరీఫ్‌, 99854 06327


ఈ వార్తలు కూడా చదవండి

లిక్కర్‌ దందాల కవితకు రాహుల్‌ పేరెత్తే అర్హత లేదు

పొన్నం చొరవతో స్వస్థలానికి గల్ఫ్‌ బాధితుడు

జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా డీకే అరుణ

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 27 , 2025 | 01:26 PM