Shiva Linga Mystery: శివలింగ మర్మం
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:09 AM
శివలింగం కేవలం ఆరాధన కోసం కాదు, అది విశ్వ శక్తి ధారల ప్రాతినిధ్యం చేస్తూ మానవ ఉనికికి మార్గదర్శిగా నిలుస్తుంది. రాగి, స్ఫటిక, పాదరస లింగాల వెనుక ఉన్న తత్త్వం పరిశోధనకు పూర్వీకులు దారి చూపారు

శివుడి సాకార ఆరాధనను లింగ రూపంలో నిర్వహించడం అనాది సంప్రదాయం. కొన్ని వేల ఏళ్ల నుంచి శివలింగాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారికి మార్గదర్శిగా భావించి అనేక ఆధ్యాత్మిక ప్రక్రియలను, ఽధ్యాన పద్ధతులను మన పూర్వీకులు అభివృద్ధి చేశారు. వీటిని పరిశీలిస్తే శివలింగం ఆకారం వెనుక ఒక మార్మికత దాగి ఉందనే విషయం మనకు అర్ధమవుతుంది.
శివలింగ సమీపంలో ‘ఓం నమఃశివాయ’’ అనే మూల మంత్రాన్ని జపం చేస్తుంటే ఒక శక్తివలయం ఏర్పడుతుందని, తద్వారా ధ్యానం చేసే వ్యక్తి దృష్టి కోణంలో మార్పు వస్తుందని ‘శివపురాణం’ లాంటి ప్రాచీన గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. జ్యోతిర్లింగ దేవాలయాలలో ఉండే శివలింగాలకు అనేక ప్రత్యేకతలుంటాయి. ఇక్కడ బలమైన శక్తి వలయాలు ఏర్పడతాయని, వీటి వల్ల మానవులకు మేలు జరుగుతుందని పూర్వ గ్రంథకర్తలు పేర్కొన్నారు. ఇక మనకు రాగి శివలింగాలు కంబోడియా, థాయ్‌లాండ్, వియత్నాంలలో ఎక్కువ కనిపిస్తాయి. రాగి ద్వారా శక్తి ప్రసారం జరుగుతుందని మనకు తెలుసు. ఈ రాగి లింగాలను నీటిలో పెట్టినప్పుడు వాటి నుంచి కొంత శక్తి ప్రసారమవుతుంది. ‘కుబ్జిక తంత్ర’, ‘రుద్ర యమల తంత్ర’ గ్రంథాలలో ఈ రాగి లింగాల విశిష్టత గురించి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో స్ఫటిక లింగాలు కూడా మనం చూస్తాం. అలాగే కొన్ని తంత్ర శాస్త్రాలలో పాదరసంతో చేసిన శివలింగాల ప్రస్థావన కూడా ఉంది. ఈ శివలింగాలన్నీ ఈ విశ్వంలో నిబిడీకృతమై ఉన్న శక్తిని ఒక ధారలా చేసి... వాటిని ఈ భౌతిక ప్రపంచంలోని వ్యక్తులతో అనుసంధానించడానికి సహకరిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
ఋషులతో...
మన పూర్వ గ్రంథాలు, శాసనాలు.. ఇతర ఆధారాల ద్వారా చూసినప్పుడు- కొందరు ఋషులకు శివలింగాలతో ప్రత్యేక సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. ఉదాహరణకు ఆగస్య మహామునికి శివలింగాలకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ప్రస్తుత దక్షిణ భారత దేశం నుంచి అగస్త్యుడు కొన్ని ప్రత్యేకమైన శివలింగాలను తీసుకొని దక్షిణాసియాకు వెళ్లాడనేది కూడా పూర్వ రచనల ద్వారా తెలుస్త్తుంది. ఈ ఒక్క ఆధారమే కాకుండా... ప్రస్తుతం వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్‌లలోని అనేక శాసనాలలో అగస్త్య మహాముని ప్రస్తావన ఉంది. అగస్త్యుడు దక్షిణ భారతదేశం నుంచి తీసుకువెళ్లాడని చెబుతున్న కొన్ని శివలింగాలను మనం వియత్నాంలోని మ్యూజియంలలో కూడా చూడవచ్చు. ఇదే విధంగా ‘మహాభారతం’లో - మార్కండేయ మహర్షి శివలింగం దగ్గర ధ్యానం చేస్తుంటే మహాప్రళయం వస్తుందనే సంకేతాలు వచ్చాయని ఉంది.
చిదంబరంలో ఉన్న నటరాజ స్వామి దేవాలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. దీని నిర్మాణ శైలి శివతత్త్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది.
హిందూ సంప్రదాయంలో శ్రీ యంత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనిని శివలింగంతో కలిపి కానీ, శివలింగ సమీపంలో కానీ ప్రతిష్ఠించినప్పుడు - ఆ ప్రాంతంలో శక్తి ప్రతిష్టంభన జరుగుతుందని.. దానిని మానవ అభ్యున్నతికి ఉపయోగించుకోవచ్చని భావిస్తారు. శ్రీశైల క్షేత్రంలో ఈ తరహా ప్రతిష్ఠలను మనం గమనించవచ్చు.
-లిడియా లక్ష్మి
బ్రహ్మసూత్ర
లింగ పరిశోధకురాలు
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్