Share News

Selfless Devotion: ఉడుతా భక్తి

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:01 AM

ఉడుతా భక్తి అంటే ఎంత చేసినా స్వార్థం లేకుండా, ప్రేమతో చేయడం. మన శక్తికి తగినంత సేవ కూడా భగవంతుడి దృష్టిలో ఎంతో విలువైనది

Selfless Devotion: ఉడుతా భక్తి

తెలుసుకుందాం

డుతా భక్తిగా ఏదో మాకు ఉన్నంతలో మేము ఇచ్చాం. మా శక్తి మేరకు మేము చేశాం’ అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ఉడుతా భక్తిగా అంటే... అల్పంగానో, స్వల్పంగానో, నామమాత్రంగానో చేయడం అని కాదు. ‘ఎంత చేశాం, ఎంత ఇచ్చాం’ అని కూడా కాదు. ‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకం మెచ్చును’’ అంటాడు అన్నమయ్య. ‘‘పుష్పం పత్రం ఫలం తోయం... నిర్మల బుద్ధితో, నిష్కామ భావంతో సమర్పించే పత్రంకానీ, ఫలంకానీ, జలంకానీ నేను ప్రీతితో స్వీకరిస్తాను’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంతకన్నా ఇంకేం కావాలి?

సాయం చిన్నదే కానీ...

ఉడుతాభక్తికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఒక కథ ఉంది. వానర వీరులందరూ నూరు యోజనాల విస్తీర్ణం ఉన్న మహా సముద్రాన్ని దాటి, లంకకు వెళ్ళడానికి వారధి నిర్మిస్తున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళను దొర్లించుకొని పోతున్నారు. ఇదంతా ఒక ఉడుత మూలన ఉండి గమనిస్తోంది. ‘ఈ వానర వీరులందరూ సీతారాముల సమాగమం కోసం ఇంత కష్టపడుతున్నారే! మరి నేనేమిటి, ఎలాంటి సాయం చెయ్యకుండా ఊరకే ఇలా ఉండిపోయాను?’ అనుకుంది. ఒడ్డుకు కొట్టుకు వస్తున్న సముద్రపు అలల్లో తడిసింది. తడి శరీరంతో ఇసుకలో పొర్లింది. ఒంటికి అంటిన ఇసుకను నిర్మాణంలో ఉన్న వారధి మీద విదిలిస్తోంది. అలా నీటిలో తడవడం, ఇసుకలో పొర్లడం, వారధిపై విదిలించడం.. అలుపూ సొలుపూ లేకుండా నిర్విరామంగా చేస్తోంది.


రాయికీ రాయికీ మధ్య ఇసుక ఉంటే... అవి గట్టిగా అతుక్కుంటాయని దాని ఆలోచన. నిజమే కదా! కానీ దాని శ్రమను ఎవరూ గుర్తించలేదు. అసలు దాని ఉనికినే ఎవరూ పట్టించుకోలేదు. ఎవరి పనిలో వారు తలమునకలై ఉన్నారు. అయినా ఉడుత కూడా తన కష్టాన్ని ఎవరో గుర్తించాలనీ, తనను కీర్తించాలనీ అనుకోలేదు. తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలనుకుంది. శక్తివంచన లేకుండా పని చేస్తోంది. వారధి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న శ్రీరాముడు... ఆ ఉడుత శ్రమను, తాపత్రయాన్ని గుర్తించాడు. దాన్ని దగ్గరకు తీసుకున్నాడు. దాని శరీరాన్ని ఆప్యాయంగా నిమిరాడు. అది సంతోషం పట్టలేక... కృతజ్ఞతగా స్వామి చుట్టూ ముమ్మారు తిరిగింది. దాని జన్మ చరితార్థమయింది. ఉడుత ఒంటిమీద కనిపించే మూడు చారలు... రాముడి చేతి వేళ్ళ అనవాళ్ళని చెబుతారు.


అహంకారం విడిచిపెట్టాలి...

ఉడుతా భక్తి అంటే ఏది చేసినా ఆత్మార్పణ బుద్ధితో చేయడం, నిస్వార్థంగా చేయడం, దీక్షగా చేయడం. దేవుడు మెచ్చేది మన భక్తిని, ఆయన పట్ల మనకున్న విశ్వాసాన్నే కానీ... మనం సమర్పించే కానుకలను కాదు. దేవునికైనా, మరెవరికైనా మం చేసే సేవను కానీ, కైంకర్యాన్ని కానీ, ఉపకారాన్ని కానీ... మన బతుకుకు సార్థకత కల్పించుకోవడం కోసం చేస్తున్న కృషిగానే భావించాలి. భక్త కవి కంచర్ల గోపన్న ‘దాశరథీ శతకం’లో ఒక చోట ‘‘ఓ దశరథరామా! నాకు ఏ వరాలూ వద్దు. నీవు ఇచ్చిన ఈ అవయవాలతో నీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నా చేతులు నీకు నమస్కరించాలి. నా కన్నులు నిన్నే చూస్తూ ఉండాలి. నా నాలుక నీ నామస్మరణే చేయాలి. నా చెవులు నీ సత్కథలనే వినాలి. నా నాసిక నీ మెడలోని పూలదండల సువాసనకు ఆశపడాలి.


అప్పుడే నువ్వు ఇచ్చిన ఈ ఇంద్రియాలకు సార్థకత. అలా చేస్తేనే పంచేంద్రియాలు మోక్ష సాధనాలు అవుతాయి. లేకపోతే నిరర్థకాలు అవుతాయి’’ అంటాడు. ఇంద్రియాలను గెలవడం తేలికైన పని కాదు. కొండలను, బండలను సముద్రంలో తేలేలా చేయాలన్నా, విషయాసక్తి నుంచి ఇంద్రియాలను మరల్చాలన్నా... జగదేక శరణ్యమూర్తి రామచంద్ర ప్రభువు దయ ఉండాలి. అన్నిటికన్నాముందు... ఉడుతలోని ప్రేమపూర్వక త్యాగభావాన్ని మనం అలవరచుకొని, నిష్టతో కర్మలను ఆచరించాలి. ఉడుతా భక్తి అంటే అది. మనకు ఉన్నవి కొద్దిపాటి శక్తి సామర్థ్యాలే కావచ్చు. వాటిని సంపూర్ణంగా భగవదర్పణ చేయడమే ఉడుతాభక్తి. శ్రమను గౌరవించండి. శ్రమించి పనిచేసేవారిని ఆదరించండి. సంస్థల నిర్వాహకులు, అధికారులు, అమాత్యులు... ఇలా అందరూ తామే అందరికన్నా అధికులం అనే అహంకారాన్ని వదిలి పెట్టి, చిన్నవారిని చేరదీసి ప్రోత్సహిస్తే... వారు కూడా అద్భుతాలు సృష్టిస్తారు. ఈ ఉడుత కథ వాల్మీకి రామాయణంలో లేదు. ఎవరు రాశారో, ఎక్కడినుంచి గ్రహించారో, ఎవరు ప్రాచుర్యంలోకి తెచ్చారో తెలీదు. అయితేనేం, మంచి కథ.

- ప్రయాగ రామకృష్ణ

Updated Date - Apr 25 , 2025 | 12:01 AM