Shravan Masam 2025: శ్రావణ మాసంలో ఏమి తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ABN , Publish Date - Jul 31 , 2025 | 02:08 PM
శ్రావణ మాసంలో భక్తులు ఆధ్యాత్మికంగా ఉండేందుకు ఆహారపు నియమాలను పాటిస్తారు. అదే సమయంలో వర్షాకాలం కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యం. అయితే, ఈ మాసంలో ఏమి తినాలి? ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: శ్రావణ మాసం హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత కలిగిన మాసం. ఈ మాసంలో భక్తులు ఎక్కువగా శివుడిని, విష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. మహిళలు ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి నోములు, వ్రతాలు ఆచరిస్తారు. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం అఖండ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆనందాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.
శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు, శనివారాలు కూడా ప్రత్యేక పూజలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. శ్రావణ మాసంలో ఉపవాసాలు పాటించడం, ఆచారాలు చేయడం వల్ల మనస్సు, శరీరం శుద్ధి అవుతాయని భక్తులు నమ్ముతారు. భక్తులు ఆధ్యాత్మికంగా ఉండేందుకు ఆహారపు నియమాలను పాటిస్తారు. అదే సమయంలో వర్షాకాలం కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యం. కాబట్టి, శ్రావణ మాసంలో ఏమి తినాలో, ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏం తినకూడదు?
శ్రావణ మాసంలో మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఆకుకూరలు, పాలు, పెరుగు వంటివి తినకూడదని చెబుతారు. ముఖ్యంగా ఉపవాసం చేసే రోజుల్లో సాత్విక ఆహారం తీసుకోవాలి. కొన్ని చోట్ల బంగాళాదుంపలు, చిలగడదుంపలు కూడా తినకూడదని చెబుతారు. అలాగే, ఈ మాసంలో మద్యం సేవించడం, పొగ తాగడం వంటివి చేయకూడదని అంటారు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎకువగా ఉంటుందని చెబుతారు.
శ్రావణ మాసంలో ఈ ఆహార పదార్థాలను ఎందుకు తినకూడదు అనేదానికి కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలు సులభంగా కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి, వాటిని తినడం వల్ల అజీర్ణం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఏం తినాలి?
హిందూ శాస్త్రాల ప్రకారం.. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, ప్రతిరోజూ పూజా గదిని శుభ్రం చేయాలి. ఏదైనా శివాలయాన్ని సందర్శించి శివునికి అభిషేకం చేయాలి. ఈ కాలంలో సాత్విక ఆహారమే తీసుకోవాలి. సాత్విక ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు తీసుకోవాలి. తేలికపాటి, పోషకమైన భోజనం తినాలి.
ఇవి కూడా చదవండి:
వీసా-ఫ్రీ.. వీసా-ఆన్-అరైవల్.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా
పాస్‌పోర్టు విషయంలో ఈ తప్పులు చేస్తే చుక్కలే..