Akshaya Tritiya 2025: అలా ఆచరిస్తే ఫలాలు అక్షయం
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:01 AM
వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయ పర్వదినం పుణ్యకార్యాలకు శుభప్రదం. ఈ రోజున చేసే వ్రతాలు, దానాలు, పూజలు నాశనంలేని ఫలితాలను ఇస్తాయి

పర్వదినం
30న అక్షయ తృతీయ
వసంత ఋతువులో చైత్ర, వైశాఖ మాసాలు అక్షయుడైన మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. లక్ష్మీసమేతుడైన విష్ణవును ఈ మాసాలలో... ప్రధానంగా వైశాఖ శుద్ధ తదియనాడు భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయోదాయకమని, ఆ రోజు చేసే వ్రతమైనా, జపమైనా, దానాలైనా అక్షయమైన ఫలితాలను ఇస్తాయని ‘భవిష్యోత్తర పురాణం’ చెబుతోంది. ఆ పవిత్రమైన రోజునే ‘అక్షయ తృతీయ’గా నిర్వహించుకోవడం సంప్రదాయంగా స్థిరపడింది.
‘అక్షయం’ అంటే ‘నాశనం లేనిది’, ‘తరుగు లేనిది’ అని అర్థం. అక్షయ తృతీయ... త్రేతాయుగాదిగా, పరశురామ జయంతిగా, బలరామ జయంతిగా ప్రసిద్ధి చెందింది.ఎన్నో పురాణ గాథలు ఈ పవిత్ర దినంతో ముడిపడి ఉన్నాయి.భాగవత పురాణంలో హిరణ్యాక్ష, హిరణ్య కశిపుల గాథ విశేషమైనది. ఆ సోదరులు ఇరువురు విష్ణు ద్వేషులు. వారిని సంహరించడానికి వరాహ, నారసింహ అవతారాలను శ్రీహరి దాల్చవలసి వచ్చింది. వరాహావతారంలో హిరణాక్షుడిని శ్రీహరి వధించాడు. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నారాయణ భక్తుడు. లోకకంటకుడై, కుమారుణ్ణి సైతం ఎన్నో కష్టాలకు గురిచేసి, చంపాలని ప్రయత్నించిన హిరణ్యకశిపుణ్ణి నృసింహావతారంలో శ్రీహరి సంహరించాడు. ఉగ్రరూపుడైన నరహరి... ప్రహ్లాదుడి కోరికమేరకు శాంతించాడు. వరాన్ని కోరుకోమన్నాడు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను వధించిన వరాహ, నారసింహ రూపాలలో... లక్ష్మీదేవితో కలిసి దర్శనం ఇవ్వాల్సిందిగా ప్రహ్లాదుడు ఆయనను వేడుకున్నాడు. అప్పుడు ఆ రెండు రూపాలను జోడించి, సతీ సమేతుడై... శ్రీ వరాహ లక్ష్మీ నారసింహుడిగా... శాంత వదనంతో ప్రహ్లాదుడి ముందు శ్రీహరి సాక్షాత్కరించాడు. సింహాచలంలో వెలిశాడు. ఆ రోజు అక్షయ తృతీయ.
సింహగిరిపై చందనోత్సవం
ప్రహ్లాదుడి అనంతరం స్వామి విగ్రహానికి పూజాదికాలు లేక మరుగునపడింది. దానిపై పుట్ట పెరిగింది. కొంతకాలం తరువాత... షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు... ఊర్వశితో కలిసి విహరిస్తూ, సింహగిరిపై విశ్రమించాడు. అతనికి స్వామి కలలో కనిపించి... తన విగ్రహాన్ని వెలికి తీసి, ఆలయం నిర్మించాలని ఆదేశించాడు. మరుసటిరోజు ఉదయం పూరురవుడు ఆ ప్రాంతంలోని పుట్టను తొలగించి, స్వామిని బయటకు తీసి, క్షీరంతో అభిషేకించి, పూజలు చేశాడు. ఆ రోజు వైశాఖ శుద్ధ తదియ. భక్తులకు ఏడాదిలో ఒక రోజు తన నిజరూపాన్ని దర్శనం చేసుకొనే వీలు కల్పించాలని, మిగిలిన రోజుల్లో... తన విగ్రహం దొరికిన పుట్ట బరువుకు సమానమైన చందనాన్ని తన విగ్రహానికి పూయాలని పురూరవుడికి స్వామి ఆదేశాన్ని ఇచ్చాడు. సింహగిరీశుడు ఆవిర్భవించిన ఆ రోజున సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది. ఆ రోజున స్వామి నిజరూపంలో కనిపిస్తారు. ఆ తరువాత... చందనాన్ని వైశాఖ శుద్ధ తదియ, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో... నాలుగు విడతలుగా పూస్తారు. ఏడాది పొడవునా సింహగిరీశుడు లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఇదే రోజున పూరీలో జగన్నాథ, సుభద్ర, బలభద్రుల ఆలయ సంప్రోక్షణ, ఆ తరువాత చందనోత్సవం జరుగుతాయి. ఆషాఢ శుద్ధ విదియనాడు నిర్వహించే రథోత్సవం నిమిత్తం... ఆ ముగ్గురు మూర్తులకు మూడు రథాలు నిర్మించడానికి అంకురారఝఝణ చేస్తారు. కాగా, శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు సూర్యుణ్ణి ధర్మరాజు ప్రార్థించి అక్షయపాత్రను పొందడం, అర్జునుడు అక్షయ తూణీరాలను పొందడం, విశ్రామిత్రుడి ద్వారా సకల విద్యలతో పాటు అక్షయ తూణీరాలను అందుకోవడం లాంటి కథలు కూడా అక్షయ తృతీయతో ముడిపడి వినిపిస్తూ ఉంటాయి.
ఎన్నెన్నో విశ్వాసాలు...
అక్షయ తృతీయను అత్యంత శుభప్రదమైన రోజుగా పూర్వులు పేర్కొన్నారు. ఈ రోజు చేసే భక్తి శ్రద్ధలతో ఆచరించే ఏ పుణ్యకార్యమైన అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుందన్న కారణంగానే పూర్వ ఋషులు ఈ పేరు పెట్టారని పెద్దలు చెబుతారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి అత్యంత పవిత్రమైనది భావిస్తారు. గృహిణులు వీసమెత్తు బంగారాన్నైనా కొని, లక్ష్మీదేవి ముందు ఉంచి పూజిస్తే... వారి సంపద అక్షయం అవుతుందనే నమ్మకం ఉత్తర భారతదేశంలో ఉంది. అది ఇపుఝఝడు దేశమంతటా వ్యాపించింది. ఈ రోజు లక్ష్మీ నారాయణులను, గౌరీ శంకరులను అర్చిస్తే త్వరగా వివాహం అవుతుందనే విశ్వాసం కూడా ఉంది. అలాగే అక్షయ తృతీయ రోజున సంపద్గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే... సౌభాగ్యం, సంపదలు లభిస్తాయనేది పురాణ వచనం. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనులను ఈ రోజున ప్రారంభిస్తారు. దీనివల్ల ఫలసాయం సమృద్ధిగా లభిస్తుందనే నమ్మకం ఉంది.
-ఆయపిళ్ళ రాజపాప
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్