Teen Girl: ఆస్పత్రిలో దారుణం.. అందరూ చూస్తుండగా యువతిపై కూర్చుని..
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:46 AM
Teen Girl: అభిషేక్ ఆస్పత్రిలోని ట్రోమా సెంటర్ దగ్గర సంధ్యను అడ్డగించాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అతడామెపై దాడికి దిగాడు. ఆమెను నేలపై పడేసి గుండెలపై కూర్చున్నాడు.

ప్రేమ పేరుతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతి తన ప్రేమను కాదన్న కోపంతో ఆమె ప్రాణాలు తీసేశాడు. ఆస్పత్రిలో.. అందరూ చూస్తుండగా .. ఆమె గుండెలపై కూర్చుని గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ సంఘటన మధ్య ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్, నర్సింగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల సంధ్యా చౌదరి ఇంటర్ మీడియట్ చదువుతోంది. అభిషేక్ కోస్తీ అనే యువకుడు సంధ్యను వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు.
ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. గత కొద్దిరోజుల నుంచి వేధింపులు బాగా పెరిగాయి. అతడంటే ఇష్టం లేదని ఆమె తేల్చి చెప్పింది. తన వెంట పడొద్దని అంది. అయితే, అభిషేక్ మనసు మాత్రం మారలేదు. ఆమె తన ప్రేమ కాదందని పగ పట్టాడు. తనకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదని నిశ్చయించుకున్నాడు. ఆమెను చంపడానికి పథకం రచించాడు. సంధ్య జూన్ 27వ తేదీ మధ్యాహ్నం నర్సింగ్‌పూర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. స్నేహితురాలి వదిన కాన్పయిందని, చూడ్డానికి ఆస్పత్రికి వెళుతున్నాని తల్లిదండ్రులకు చెప్పింది.
ఈ విషయం అభిషేక్‌కు తెలిసింది. ఆమె కంటే ముందే అతడు ఆస్పత్రికి వెళ్లాడు. సంధ్య రాకకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆమె ఆస్పత్రికి చేరుకుంది. అభిషేక్ ఆస్పత్రిలోని ట్రోమా సెంటర్ దగ్గర సంధ్యను అడ్డగించాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అతడామెపై దాడికి దిగాడు. ఆమెను నేలపై పడేసి గుండెలపై కూర్చున్నాడు. ఆ తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. ఈ దారుణం జరుగుతున్నపుడు అక్కడ చాలా మంది ఉన్నారు. డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్స్, రోగులు, వారి బంధువులు.. ఇలా చాలా మంది ఉన్నారు.
ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. సంధ్య గొంతు కోసిన తర్వాత అభిషేక్ అక్కడినుంచి పారిపోయాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు యువతి తల్లిదండ్రులకు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకునే వరకు శవం నేలపైనే పడిఉంది. దీంతో సంధ్య కుటుంబసభ్యుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఆస్పత్రి బయట ధర్నాకు దిగారు. నిందితుడ్ని వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షిస్తామని అధికారులు భరోసా ఇవ్వటంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సహజ సౌందర్యానికి ముక్కుపుడక..దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
మొబైల్ షాపుకు కన్నం వేసి 5 లక్షల విలువైన ఫోన్లు చోరీ..