Lawyer Phone Gift: పెళ్లి రోజున భార్యకు కొత్త స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన లాయర్‌కు ఊహించని షాక్
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:21 PM
పెళ్లి రోజున భార్యకు స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చిన ఓ లాయర్‌కు దిమ్మతిరిగినంత పనైంది. ఆ స్మార్ట్‌ఫోన్ ఓ సైబర్ క్రైమ్‌తో లింక్ అయి ఉందంటూ సడెన్‌గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో లాయర్ అవాక్కయిపోయారు. కోల్‌కతాలో ఈ ఉదంతం వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్‌లకు సంబంధించి రోజుకో కొత్త స్కామ్ పుట్టుకొస్తోంది. ఫలితంగా సామాన్యులు అకారణంగా ఊహించని చిక్కుల్లో పడాల్సి వస్తోంది. ఇందుకు సంబంధించి కోల్‌కతాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి రోజున భార్యకు బహుమతిగా ఇచ్చేందుకు కొత్త స్మార్ట్ ఫోన్ కొన్న ఓ లాయర్‌కు చివర్లో ఊహించని పరిస్థితి ఎదురైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, సాల్ట్ లేక్ ప్రాంతానికి చెందిన ఆ లాయర్ తన పెళ్లి రోజును పురస్కరించుకుని భార్యకు స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇద్దామనుకున్నారు. స్థానిక మిషన్ రో ఎక్స్‌టెన్షన్‌లోని షాపులో రూ.49 వేలు పెట్టి ఓ కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారు. పూర్తి సీల్‌తో, జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌తో కూడా ఉన్న ఆ ఫోన్‌ను తీసుకొచ్చి భార్యకు బహుమతిగా ఇచ్చాడు. ఆమె కూడా సంతోషించింది. కానీ ఆ తరువాత కథ ఊహించని మలుపు తిరిగింది.
ఫోన్ కొనుగోలు చేసిన కొన్ని వారాల తరువాత గుజరాత్ పోలీసులు హఠాత్తుగా లాయర్ ఇంటి తలుపు తట్టారు. లాయర్ భార్య వినియోగిస్తున్న ఫోన్ ఓ సైబర్ నేరానికి ముడిపడి ఉందని అన్నారు. ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్‌ను ట్రాక్ చేసి అక్కడకు వచ్చామని చెప్పారు.
ఈ ఆరోపణలు విని ఆ భార్యాభర్తలు షాకయిపోయారు. తమకు ఏ సైబర్ నేరంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో లాయర్ అప్రమత్తమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తను ఫోన్ కొనుగోలు చేసిన షాపుపై ఫిర్యాదు చేశారు. ఆ తరువాత రంగంలోకి దిగిన పోలీసులు షాపు యజమానిని విచారించారు. అయితే, ఈ ఘటనలో అతడి తప్పేమీ లేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో, ఫోన్‌ను షాపు యజమానికి సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్‌పై దృష్టి సారించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక లాయర్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలించారు. ఫోన్ ఎవరెవరి చేతులు మారిందో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఉదంతం వెనక గ్యాంగ్ ఏదైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రియుడి మోజులో వివాహిత దారుణం.. మంచానపడ్డ భర్తను కిరాతకంగా హత్య
ఢిల్లీలో సీరియల్ కిల్లర్ అరెస్టు.. 24 ఏళ్ల తరువాత పట్టుకున్న పోలీసులు