Woman And Daughter: 13 ఏళ్ల కూతురితో కలిసి భర్తను చంపేసిన భార్య
ABN , Publish Date - Aug 03 , 2025 | 06:10 PM
Woman And Daughter: జులై 25వ తేదీన సోనాల్ తన కూతురితో కలిసి భర్తను ఇంట్లోనే చంపేసింది. ఇందుకోసం ఓ ఇద్దరు యువకుల సాయం తీసుకుంది. భర్తను చంపేసి.. అతడు గుండెపోటుతో చనిపోయాడని ఇతర కుటుంబసభ్యుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది.

ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. 13 ఏళ్ల కూతురితో కలిసి భర్తను చంపేసింది. హత్యను.. హార్ట్ ఎటాక్ అని చెప్పి, తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, వారు చేసిన పాపం చాలా త్వరగా బయటపడింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ జైలు పాలయ్యారు. ఈ సంఘటన అస్సాంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. దిబ్రూఘర్, బోర్బరువా ఏరియాకు చెందిన ఉత్తమ్ గోగయ్, బాబీ సోనాల్ గోగయ్ భార్యా భర్తలు. వీరికి 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. 13 ఏళ్ల ఓ పాప ఉంది. ఆ పాప ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది.
ఏమైందో ఏమో తెలీదు కానీ, జులై 25వ తేదీన సోనాల్ తన కూతురితో కలిసి భర్తను ఇంట్లోనే చంపేసింది. ఇందుకోసం ఓ ఇద్దరు యువకుల సాయం తీసుకుంది. భర్తను చంపేసి.. అతడు గుండెపోటుతో చనిపోయాడని ఇతర కుటుంబసభ్యుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఉత్తమ్ గుండె పోటుతో చనిపోయాడని అతడి సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. ఉత్తమ్ సోదరుడు పరుగున ఆ ఇంటికి వచ్చాడు. అయితే, ఉత్తమ్ చెవి తెగి ఉండటంతో అతడికి అనుమానం వచ్చింది. సోనాల్ అతడ్ని తికమక పెట్టడానికి చోరీ డ్రామా ఆడింది.
ఇంట్లో దొంగలు పడ్డారని, ఆ సమయంలోనే ఉత్తమ్‌కు గుండెపోటు వచ్చిందని చెప్పింది. అతడికి సోనాల్ మాటలు నమ్మబుద్ధి కాలేదు. అక్కడినుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఉత్తమ్ మరణంపై అనుమానాలు ఉన్నాయని కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో భార్య, కూతురు కలిసి ఉత్తమ్‌ను మర్డర్ చేసినట్లు తేలింది. ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. తల్లీకూతుళ్లకు సహకరించిన ఇద్దరు యువకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వారు ఈ హత్య ఎందుకు చేశారన్నది తెలియరావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
బాలిక ఫొటోలు స్టేటస్ పెట్టిన యువకుడు.. చావగొట్టిన అన్న..
మానవత్వం అంటే ఇది.. 200 కేజీల ఆవును భుజాలపై మోసుకెళ్లి..