Share News

UPI-IMF Note: భారత్‌లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు.. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకటన

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:00 PM

యూపీఐ కారణంగా భారత్‌లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు జరుగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి తన తాజా నోట్‌లో పేర్కొంది. ఇంటర్ఆపరబిలిటీ ఫీచర్ కారణంగా యూపీఐ వినియోగం పెరిగిందని వెల్లడించింది.

UPI-IMF Note: భారత్‌లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు.. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకటన
UPI India Fastest Digital Payments

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో యూపీఐ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నాయి. రూపాయి మొదలు లక్ష వరకూ ఈ విధానంలో డబ్బులు చెల్లించేందుకు జనాలు అలవాటు పడిపోయారు. ఇక యూపీఐ కారణంగా భారత్‌‌లో ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన చెల్లింపులు జరుగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) తాజాగా పేర్కొంది.

2016లో దేశంలో యూపీఐ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచీ యూపీఐ లావాదేవీలు క్రమంగా పెరగడం ప్రారంభించాయి. ప్రస్తుతం నెలకు సగటున 18 బిలియన్‌ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ చెల్లింపుల విధానాల్లో యూపీఐ ప్రస్తుతం ప్రథమస్థానంలో నిలిచింది.


యూపీఐ ప్రత్యేకత అయిన ఇంటర్‌ఆపరబిలిటీ కారణంగా యూజర్ల సంఖ్య పెరిగిందని ఐఎమ్ఎఫ్ తన నోట్‌లో అభిప్రాయపడింది. ఇంటర్ఆపరబిలిటీతో యూజర్లకు తమకు నచ్చిన యాప్‌‌తో చెల్లింపులు చేయొచ్చు. ఈ ఫీచర్ వల్ల కొత్త సర్వీసు ప్రొవైడర్లు మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం దక్కిందని ఐఎమ్ఎఫ్ పేర్కొంది. ఫలితంగా డిజిటల్ చెల్లింపులు వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారాయని పేర్కొంది. ఇతర దేశాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన క్లోజ్డ్ లూప్ ప్రత్యామ్నాయాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.

నగదు చెల్లింపుల నుంచి డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లాలనుకుంటున్న దేశాలు ఇంటర్‌ఆపరబుల్ వ్యవస్థల కోసం మౌలిక వసతులు సిద్ధం చేయాలని లేదా దీనిపై చట్టబద్ధ నియంత్రణకు ప్రయత్నించాలని సూచించింది.


నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ రూపొందించిన భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (బీహెచ్ఐఎమ్) యాప్‌తో 2016లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత ఇతర ఫిన్‌టెక్ సంస్థలు తమ యాప్‌లను మార్కెట్‌లోకి తెచ్చాయి. పేమెంట్స్ యాప్స్‌ వేళ్లునుకునేందుకు ప్రభుత్వ జోక్యం ఓ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందనే విషయం ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని కూడా ఐఎమ్ఎఫ్ పేర్కొంది.

ఇవీ చదవండి:

ఏఐ హార్డ్‌వేర్ రేసులో బాగా వెనకబడ్డాం.. ఇంటెల్ సీఈఓ ఆందోళన

చైనా నిపుణులు భారత్‌ను వీడుతున్న వైనంపై కేంద్రం నజర్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 02:55 PM