Share News

Tesla: వచ్చేనెలలో టెస్లా తొలి షోరూం ప్రారంభం

ABN , Publish Date - Jun 21 , 2025 | 05:12 AM

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా.. భారత్‌లో తొలి షోరూమ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిసింది.

Tesla: వచ్చేనెలలో  టెస్లా తొలి షోరూం ప్రారంభం

మేడ్‌ ఇన్‌ చైనా కార్లతో భారత్‌లోకి ప్రవేశం

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా.. భారత్‌లో తొలి షోరూమ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ జూలై ప్రథమార్థానికల్లా ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం కానుందని, తర్వాత కంపెనీ ఢిల్లీలోనూ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టెస్లా తన చైనా ఫ్యాక్టరీలో తయారు చేసిన కార్లతో భారత్‌లోకి అరంగేట్రం చేయబోతోందని ఆ వర్గాలు తెలిపాయి. కంపెనీకి చెందిన ‘మోడల్‌ వై’ రేర్‌ వీల్‌ డ్రైవ్‌ ఎస్‌యూవీ కార్లు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయని వారు పేర్కొన్నారు. మోడల్‌ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ కారు. ప్రస్తుతం టెస్లా ఈ కారును అమెరికాలో 44,990 డాలర్లకు విక్రయిస్తోంది. భారత్‌లో మాత్రం దీని ధరను 56,000 డాలర్ల స్థాయిలో నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం.


యూరప్‌, చైనా మార్కెట్లలో టెస్లా కార్ల విక్రయాలు గత కొన్ని నెలల్లో భారీగా క్షీణించాయి. బీవైడీ, విన్‌ఫా్‌స్ట బ్రాండ్ల నుంచి టెస్లాకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మస్క్‌ కంపెనీ ప్రపంచంలో మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌ అయిన భారత్‌పై భారీ ఆశలు పెట్టుకుంది.

Updated Date - Jun 21 , 2025 | 05:12 AM