Tata Motors: మార్కెట్లోకి టాటా ఏస్ ప్రో
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:25 AM
టాటా మోటార్స్ మార్కెట్లోకి సరికొత్త తేలికపాటి వాణిజ్య వాహనం ఎల్‌సీవీ టాటా ఏస్ ప్రో తీసుకువచ్చింది.

పెట్రోల్, బై-ఫ్యూయల్,ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభ్యం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): టాటా మోటార్స్ మార్కెట్లోకి సరికొత్త తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సీవీ) టాటా ఏస్ ప్రో తీసుకువచ్చింది. సోమవారం నాడిక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ పినాకీ హల్దార్ ఈ చిన్న కార్గో ట్రక్‌ను విడుదల చేశారు. ఈ ఎల్‌సీవీ ప్రారంభ ధర రూ.3.99 లక్షలు. పెట్రోల్, బై-ఫ్యూయల్ (సీఎన్‌జీ ప్లస్ పెట్రోల్), ఎలక్ట్రిక్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుందని హల్దార్ తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక ఫీచర్లతో ఈ వాహనాలను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. 2005లో టాటా ఏస్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తూ వస్తోందన్నారు. 694 సీసీ ఇంజన్‌తో పెట్రోల్ వేరియంట్‌ను తీసుకురాగా బై-ఫ్యూయల్ వేరియంట్‌ను సీఎన్‌జీ మోడ్ సహా 5 లీటర్ల పెట్రోల్ బ్యాకప్ ట్యాంక్‌తో రూపొందించినట్లు ఆయన చెప్పారు. కాగా 14.4 కిలోవాట్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ వేరియంట్ ఒకసారి చార్జింగ్‌తో 155 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందన్నారు. ఎలక్ట్రిక్ వేరియంట్ ధర రూ.6.5 లక్షల నుంచి రూ.6.8 లక్షల మధ్యన ఉండగా బై-ఫ్యూయల్ వేరియంట్ ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.5.99 లక్షల మధ్యన ఉన్నాయని హల్దార్ తెలిపారు.