Currency Notes: ఆర్బీఐ తాజా ప్రకటన.. రూ. 2,000 నోట్లు మీ దగ్గరున్నాయా?
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:36 PM
2023, మే నెలలో 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే, ఇప్పటికీ రూ.6వేల కోట్లకు పైగా విలువ చేసే రూ. 2000 నోట్లు ప్రజల దగ్గరున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: 2023, మే 19న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). దీంతో రూ.2000 నోట్ల చెలామణీ ఆగిపోయింది. ఈ మేరకు తమ దగ్గరున్న రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేసేశారు ప్రజలు. అయితే, ఈ పెద్ద నోట్లు రద్దయి ఇప్పటికీ రెండేళ్లకు పైగా గడిచినా ఇంకా చాలా నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయి. అవి ఎంత మొత్తమంటే, ఏకంగా రూ.6,017 కోట్లు విలువైన రూ.2 వేల కరెన్సీ నోట్లు. ఇంత పెద్దమొత్తంలో రెండు వేల రూపాయల నోట్లు ఇంకా ప్రజల దగ్గర ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన తాజాగా వెల్లడించింది.
రెండు వేల రూపాయల నోట్ల రద్దు సమయంలో మార్కెట్లో రూ.3.56 లక్షల కోట్లు విలువైన రెండు వేల నోట్లు ఉండగా(6,017 కోట్ల విలువైన నోట్లు మినహా) క్రమంగా అవి బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చేశాయి. రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన మొత్తం రూ.2వేల నోట్లలో ఇప్పటివరకూ 98.31 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
కాగా, వివిధ కారణాలతో ఇప్పటికీ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోని వారికి ఇంకా వాటిని బ్యాంకులకు ఇచ్చి అంతే విలువ చేసే కరెన్సీ పొందే వీలుంది. హైదరాబాద్ తోపాటు, వివిధ నగరాల్లోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చు. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, భువనేశ్వర్, జైపూర్, కోల్‌కతా, జమ్మూ, కాన్పూర్, ముంబై, లక్నో, ఢిల్లీ, పట్నా, నాగ్‌పూర్, తిరువనంతపురంలోని ఆర్‌బీఐ ఆఫీసులకు నేరుగా వెళ్లి మార్చుకోవచ్చు.
మరో అవకాశం ఏంటంటే, ఈ నోట్లను స్పీడ్ పోస్ట్ ద్వారా ఆర్బీఐ కార్యాలయాలకు పంపించి కూడా మార్చుకోవచ్చు. వాటిని పరిశీలించి మీరు సూచించిన బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. పోస్టాఫీసు ద్వారా పంపించాలనుకునే వారు మీ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, నోట్ల విలువ, తదితర ఆర్బీఐ అడిగిన పూర్తి సమాచారంతో ఉండే ఫారం నింపి పంపించాలి. ఆర్‌బీఐకి సీల్డ్ కవర్లో ఈ నోట్లను పంపించాలి. వాటిని పరిశీలించి మీరు సూచించిన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి