PM Jeevan Jyoti Bima Yojana: ఏడాదికి రూ. 436 చెల్లిస్తే.. మీ కుటుంబానికి రక్షణ
ABN , Publish Date - Nov 28 , 2025 | 10:44 AM
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమానికి, వారి కుటుంబ భద్రతకు పలు రకాల బీమా సౌకర్యాలు కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో ఫ్యామిలీకి ఆర్థిక భద్రత కల్పించే అవకాశం ఇస్తోంది. ఇందులో భాగంగానే కేవలం రూ. 436 చెల్లించి..
ఇంటర్నెట్ డెస్క్: సంవత్సరానికి కేవలం రూ. 436 ప్రీమియం చెల్లించి రెండు లక్షల రూపాయల వరకు మీ కుటుంబానికి రక్షణ కల్పించవచ్చని మీకు తెలుసా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమాతో ఇది సాధ్యం. ఏ కారణం చేతనైనా పాలసీ దారుడు మరణిస్తే, రూ. రెండు లక్షలు నష్టపరిహారంగా చెల్లిస్తారు. ప్రతీ ఏడాది రూ. 436 చెల్లించి ఈ పాలసీని రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన సామాజిక భద్రతా పథకం. తక్కువ ప్రీమియం, సులభమైన నమోదు ప్రక్రియ, వంద శాతం పేపర్‌లెస్ ఆన్-బోర్డింగ్, వైద్యపరీక్షలు అవసరం లేకపోవడం ఈ పాలసీలోని కీలక ప్రయోజనాలు.
ఒక సంవత్సరం పాటు ఫోర్స్‌లో ఉండే ఈ జీవిత బీమా 18 సంవత్సరాల నుండి 50 ఏళ్ల వయస్సు గల బ్యాంకు, సేవింగ్స్ ఖాతాదార్లకు అందుబాటులో ఉంది. ఇండియా పోస్ట్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, ఇతర ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు ఈ పాలసీ తీసుకునే అవకాశం కలుగుతుంది. 55 సంవత్సరాల వయస్సు వరకు జీవిత కవరేజ్ కూడా ఉంటుంది. ఈ బీమా కవర్ జూన్ 1 నుండి మే 31 వరకు ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దీని కోసం సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుండి నిర్ణీత ఫార్మాట్‌లో ఆటో-డెబిట్ ద్వారా చేరడానికి, లేదా చెల్లించడానికి ప్రతి సంవత్సరం మే 31 లోపు అనుమతి ఇవ్వాలి.
జూన్ 1 న లేదా ఆ తర్వాత చేరిన కస్టమర్లకు , ఈ కవర్.. ఖాతాదారుడు అభ్యర్థించిన తేదీ నుండి ప్రారంభమై వచ్చే ఏడాది మే 31 న ముగుస్తుంది. ఉమ్మడి బ్యాంక్ ఖాతాల విషయంలో, ప్రతి ఖాతాదారుడు జీవితానికి ప్రత్యేక ప్రీమియం చెల్లించడం ద్వారా ఒక్కొక్కరికి రూ.2 లక్షల ప్రత్యేక బీమాలను పొందవచ్చు. జూన్ 1 , 2022 నుండి ఖాతాదారుడు సులభవాయిదాల్లో ప్రీమియం చెల్లించేలా కూడా అవకాశం కల్పించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. రూ. 436 ఒకేసారి చెల్లించనక్కరలేకుండా ప్రతీ మూడు నెలలకు ఒక సారి చొప్పున కూడా ప్రీమియం చెల్లించొచ్చు.
ఒక వేళ ప్రస్తుత సభ్యుడు గడువు తేదీలోగా పాలసీని పునరుద్ధరించకపోతే, అంటే జూన్ 1న తరువాత నమోదు కోసం తిరిగి వస్తే, వారిని కొత్త సభ్యుడిగా పరిగణిస్తారు. కొత్త నమోదు ప్రకారం ప్రీమియం వసూలు చేయబడుతుంది. దీంతో పాటు కొత్త సభ్యుల సంఖ్య కేటాయించబడుతుంది. మొదటిసారి నమోదు చేసుకునే సభ్యులకు 30 రోజుల ప్రారంభ వెయిటింగ్ పీరియడ్ (కస్టమర్ ఖాతా ఆటో డెబిట్ తేదీ నుండి) వర్తిస్తుంది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు మరణానికి మాత్రమే బీమా మొత్తం చెల్లించబడుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News