PAN-Aadhaar linking: పాన్-ఆధార్ లింక్ అయిందా?.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే.?
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:54 PM
మీ పాన్‌కు ఆధార్‌తో లింక్ అయిందా? కాకపోయుంటే వీలైనంత త్వరగా స్పందించండి. సంబంధిత గడువు త్వరలోనే ముగుస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ వినియోగదారుల్ని మరోసారి అప్రమత్తం చేస్తూ.. మార్గదర్శకాలను సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం.. ఆధార్‌తో అనుసంధానం చేస్కోవాల్సి ఉంటుంది(PAN-Aadhaar linking). దీనికి సంబంధించిన గడువు 2025 డిసెంబర్ 31న ముగియనుంది. అంటే పాన్‌కు ఆధార్ లింక్ అవ్వకపోతే.. 2026 జనవరి 1 తర్వాత పాన్ కార్డు డియాక్టివేట్ అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆదాయపు పన్ను విభాగం.. పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) ఇటీవల నోటిఫై చేసిన నూతన ఆధార్ నిబంధనల ప్రకారం.. వినియోగదారులు తమ పాన్ కార్డును ఆధార్‌కు లింక్ చేస్కోవడం తప్పనిసరి. వినియోగదారులు గడువులోగా స్పందించకపోతే.. తర్వాత ఆ పాన్ నిరుపయోగంగా మారుతుందని తెలిపింది. ఒకవేళ.. మీ పాన్‌కు ఆధార్ అనుసంధానమైందో లేదో తెలుసుకోవాలంటే.. ఆదాయపు పన్ను శాఖ అఫీషియల్ వెబ్‌సైట్లోకి వెళ్లి ‘లింక్ ఆధార్ స్టేటస్(Link Aadhaar Status)’పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
పాన్-ఆధార్ లింక్ ఎలా చేయాలంటే?
తొలుత.. అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫిల్లింగ్ పోర్టల్ (https://www.incometax.gov.in/iec/foportal/ ) ను సందర్శించాలి.
ఆ విండోలో ఎడమ వైపు ప్యానెల్‌లో కనిపించే “లింక్ ఆధార్” పై క్లిక్ చేయాలి.
మీ పాన్, ఆధార్ నంబర్‌లను ఎంటర్ చేసి.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం కోసం “validate” పై క్లిక్ చేయాలి.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. మీరు మీ ఆధార్ వివరాలను, మీ పాన్ కార్డుకు లింక్ చేయమనే అభ్యర్థనను విజయవంతంగా సమర్పించారు అని చూపిస్తుంది. అంతటితో ఆ ప్రక్రియ ముగిసినట్టవుతుంది. ఆ తర్వాత మరోసారి 'లింక్ ఆధార్ స్టేటస్' ద్వారా చెక్ చేసి వెరిఫై చేస్కోండి.