2025 Budget : ప్రగతి పరుగు!
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:22 AM
2047 నాటికి ‘వికసిత్‌భారత్’ సాధించడమే లక్ష్యంగా ‘ఎన్డీయే సర్కార్ 3.0’ తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 74 నిమిషాల్లో కాస్త క్లుప్తంగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను సూటిగా వివరించారు. ‘శీఘ్రగతిన అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం, కుటుంబాల ఆకాంక్షలకు ఊతం,

4 ఇంజన్లతో వికసిత్ భారత్ వైపు.. సాగు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులే మూలం
పేదలు, రైతులు, మహిళలు, యువతే కీలకం
ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు మందగమనం
సవాలుగా తీసుకుని పురోగమిస్తున్నాం
మోదీ నేతృత్వంలో దేశం కోసం ప్రస్థానం
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల
‘దేశమంటే మట్టికాదోయ్...
దేశమంటే మనుషులోయ్’ అనే గురజాడ మాట!
అందులోనూ... పేదలు, రైతులు,
యువత, మహిళా వికాసమే లక్ష్యం!
సంస్కరణలే ఇంధనం.. సమ్మిళిత
అభివృద్ధే మంత్రం... ‘వికసిత భారత్’ గమ్యం!
వ్యవసాయం, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు,
పెట్టుబడులు, ఎగుమతులు...
అనే నాలుగు ఇంజన్లతో ప్రయాణం!
ఇదీ... 2025-26 కేంద్ర బడ్జెట్ దశా, దిశ!
2047 నాటికి ‘వికసిత్‌భారత్’ సాధించడమే లక్ష్యంగా ‘ఎన్డీయే సర్కార్ 3.0’ తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 74 నిమిషాల్లో కాస్త క్లుప్తంగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను సూటిగా వివరించారు. ‘శీఘ్రగతిన అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం, కుటుంబాల ఆకాంక్షలకు ఊతం, మధ్యతరగతి భారతీయుల వ్యయ సామర్థ్యం పెంపు’... అనే తమ ప్రభుత్వ ప్రయత్నాలను కొనసాగించేలా ఈ బడ్జెట్ ఉంటుందని నిర్మల తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ సామర్థ్యాన్ని, సంపదను మరింత పెంచే దిశగా కొత్త ప్రయాణం మొదలుపెట్టామన్నారు. 21వ శతాబ్దిలో నాలుగోవంతు పూర్తి చేసుకున్న సమయంలో... ప్రపంచవ్యాప్తంగా మందగిస్తున్న వృద్ధి రేటు సవాళ్లు విసురుతున్నప్పటికీ ‘వికసిత్ భారత్’ నినాదం తమకు స్ఫూర్తినిస్తోందన్నారు. ‘వ్యవసాయం, ఉత్పత్తి, పెట్టుబడులు, ఎగుమతులు... ఈ నాలుగు రంగాలను దేశాన్ని ముందుకు నడిపే ‘ఇంజిన్లు’గా అభివర్ణించారు. ఈ రంగాల్లో వృద్ధికోసం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ నిర్ణయాలను ప్రకటించారు. 2019 నుంచి ఇప్పటిదాకా గ్రామీణ భారతంలోని 80 శాతం ఇళ్లకు ‘జల్ జీవన్’ మిషన్ ద్వారా రక్షిత మంచినీటిని అందించామని... దీనిని వందశాతం చేసేందుకు వీలుగా 2028 వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లి... దేశంలో ఉత్పత్తిరంగానికి ఊతమిస్తామని చెప్పారు. రాబోయే పదేళ్లలో 120 కొత్త విమానాశ్రయాలను అనుసంధానించే లక్ష్యంతో ‘ఉడాన్’ను కొనసాగిస్తామన్నారు. పర్యాటకాభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు. 28 పేజీల ప్రసంగాన్ని ఏకధాటిగా చదివారు.
మధ్య తరగతి కోసం...
మధ్యతరగతిలో... మరీముఖ్యంగా పన్ను చెల్లింప దారుల్లో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు ప్రకటించారు. ‘మధ్యతరగతికి మందహాసం’ అంటూ రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను పడదు.... అంటూ నిర్మలా సీతారామన్ సగర్వంగా ప్రకటించారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అధికార పార్టీ సభ్యులు నిమిషానికిపైగా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంవల్ల పన్ను చెల్లింపుదారుల చేతిలో ఎక్కువ డబ్బులు మిగులుతాయన్నారు. అలాగే... ఉపాధి కల్పనకు వీలు కల్పించేలా తోలు, జౌళి, ఇతర ఉత్పత్తి రంగాల వృద్ధిపై దృష్టి సారించారు. ఇక... మూలధన వ్యయం కేటాయింపుల్లో ఈసారి పెద్దగా వృద్ధి కనిపించలేదు. గత బడ్జెట్‌లతో పోల్చితే ఇది భిన్నమైన ధోరణిగా చెప్పవచ్చు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో... తొలిసారి ‘రెగ్యులేటరీ రిఫామ్స్’పై దృష్టి సారించడం మరో విశేషం.
ఇదీ వికసిత్ భారత్...
‘‘పేదరిక నిర్మూలన, వందశాతం నాణ్యమైన విద్య, అందరికీ అందుబాటులో ఉత్తమ వైద్య సేవలు, వందశాతం నిపుణులైన కార్మికులు - చక్కటి ఉపాధి, 70 శాతం మంది మహిళల్లో ఆర్థిక క్రియాశీలత, మన రైతులు దేశాన్ని ప్రపంచ ఆహార కేంద్రంగా మార్చడం... ఇదే ‘వికసిత్ భారత్’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2047 నాటికి కనీసం 100 గిగావాట్ల అణు ఇంధన ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
10 రంగాలపై కీలక దృష్టి..
పేదలు, రైతులు, మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకుని 10 రంగాలపై కీలక దృష్టి. అవి... వ్యవసాయాభివృద్ధి-ఉత్పాదకత పెంపు, గ్రామీణ ప్రాంతాల బలోపేతం, సమ్మిళిత వృద్ధి, ఎంఎ్‌సఎంఈలకు ఊతం, ఉపాధి అవకాశాలు పెంచే వృద్ధి, ఆర్థికం - నైపుణ్యంపై వ్యయం, ఇంధన భద్రత, ఎగుమతులకు ప్రోత్సాహం, ఆవిష్కరణలకు అండగా నిలవడం.