Maruti Suzuki Net Profit: మారుతి సుజుకీ లాభం రూ.3,911 కోట్లు
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:29 AM
2024–25 మార్చితో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకీ నికర లాభం 1 శాతం తగ్గి రూ.3,911 కోట్లుగా నమోదైంది.అయితే ఆదాయం పెరగగా, ఖర్చుల పెరుగుదల లాభాలపై ప్రభావం చూపింది; ఒక్కో షేరుకు రూ.135 డివిడెండ్ ప్రకటించింది

ఒక్కో షేరుకు రూ.135 డివిడెండ్
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) కన్సాలిడేటెడ్ నికర లాభం 1 శాతం క్షీణించి రూ.3,911 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.3,952 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో వ్యయాలు గణనీయంగా పెరగటం పనితీరును దెబ్బతీసిందని తెలిపింది. మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం మాత్రం రూ.38,471 కోట్ల నుంచి రూ.40,920 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు కూడా 8.5 శాతం పెరుగుదలతో రూ.34,624 కోట్లుగా నమోదైనట్లు మారుతి సుజుకీ తెలిపింది.
స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం రూ.3,878 కోట్ల నుంచి రూ.3,711 కోట్లకు తగ్గగా నికర ఆదాయం రూ.36,697 కోట్ల నుంచి రూ.38,849 కోట్లకు పెరిగింది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ రూ.1,52,913 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.14,500 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కాగా గడచిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతి షేరుకు రూ.135 డివిడెండ్‌ను సిఫారసు చేసింది.