Share News

Mahindra: మహీంద్రా జోరు... జూన్‌లో వాహన, ట్రాక్టర్ల విక్రయాల్లో బలమైన వృద్ధి!

ABN , Publish Date - Jul 01 , 2025 | 10:40 PM

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా, జూన్ 2025లో తమ మొత్తం వాహన విక్రయాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

Mahindra: మహీంద్రా జోరు... జూన్‌లో వాహన, ట్రాక్టర్ల విక్రయాల్లో బలమైన వృద్ధి!

హైదరాబాద్: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా, జూన్ 2025లో తమ మొత్తం వాహన విక్రయాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ట్రాక్టర్ల అమ్మకాల్లోనూ కంపెనీ అద్భుతమైన పనితీరు కనబరిచింది. మొత్తం మీద ఆటోమొబైల్, వ్యవసాయ పరికరాల విభాగాల్లో బలమైన వృద్ధిని సాధించినట్లు సంస్థ వెల్లడించింది.

ఆటోమొబైల్ విభాగంలో 14 శాతం వృద్ధి

మహీంద్రా & మహీంద్రా జూన్ 2025లో మొత్తం 78,969 వాహనాలను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే 14 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఇందులో ఎగుమతులు కూడా కలిసి ఉన్నాయి. ఈ వృద్ధికి ప్రధాన కారణం యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) విభాగం. దేశీయ మార్కెట్‌లో ఎస్‌యూవీ విక్రయాలు 18 శాతం పెరిగి 47,306 యూనిట్లకు చేరాయి. ఈ త్రైమాసికం ఎస్‌యూవీలకు సంబంధించి అత్యధిక విక్రయాలు నమోదైన త్రైమాసికం అని కంపెనీ ఆటోమోటివ్ విభాగం సీఈఓ నళినీకాంత్ తెలిపారు. వాణిజ్య వాహనాల దేశీయ విక్రయాలు 20,575 యూనిట్లుగా నమోదయ్యాయి. 3 చక్రాల వాహనాల (ఎలక్ట్రిక్ 3వీలతో సహా) విక్రయాలు 37 శాతం పెరిగి 8,454 యూనిట్లకు చేరాయి. మొత్తం ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 1 శాతం పెరిగి 2,634 యూనిట్లుగా నమోదయ్యాయి.


వ్యవసాయ పరికరాల వ్యాపారంలో 13 శాతం...

మహీంద్రా వ్యవసాయ పరికరాల వ్యాపారం (FEB) జూన్ 2025లో దేశీయ ట్రాక్టర్ల విక్రయాల్లో 13 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం 51,769 ట్రాక్టర్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. జూన్ 2024లో ఇదే సంఖ్య 45,888 యూనిట్లుగా ఉంది. ఎగుమతులతో సహా మొత్తం ట్రాక్టర్ల విక్రయాలు 53,392 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గతేడాది 47,319 యూనిట్ల కన్నా 13 శాతం అధికం. ఎగుమతులు సైతం 13 శాతం పెరిగి 1,623 యూనిట్లకు చేరాయి. మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా మాట్లాడుతూ.. రబీ పంట కోతల నుండి లభించిన నగదు, రుతుపవనాల విస్తృత విస్తరణ కారణంగా జూన్‌లో పరిశ్రమ వృద్ధి సాధించిందని పేర్కొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 10:40 PM