Share News

Financial Changes: జూన్‌లో వచ్చే ఆర్థిక మార్పులివే..

ABN , Publish Date - Jun 01 , 2025 | 02:53 AM

జూన్‌లో పీఎఫ్‌, క్రెడిట్‌ కార్డులు, ఆధార్‌ అప్‌డేట్‌, ట్యాక్స్‌ చెల్లింపు వంటి ఆర్థిక విధానాల్లో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి.క్రెడిట్‌ కార్డుల లాంజ్‌ యాక్సెస్‌ నిబంధనలు, PF క్లెయిమ్‌ ప్రక్రియ, ఆధార్‌ అప్‌డేట్‌ గడువు, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వంటి మార్పులు ప్రధానంగా ఉంటాయి.

Financial Changes: జూన్‌లో వచ్చే ఆర్థిక మార్పులివే..

జూన్‌లో ఫైనాన్షియల్‌ మార్కెట్లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) సొమ్ము ఉపసంహరణ, ఆధార్‌ ఉచిత అప్‌డేట్స్‌, క్రెడిట్‌ కార్డు విధానాలు సహా మరికొన్నింటిలోనూ మార్పులు చేర్పులు అమల్లోకి రానున్నాయి. అవేమిటంటే..

క్రెడిట్‌ కార్డులు

క్రెడిట్‌ కార్డుల ద్వారా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలోని లాంజ్‌ సదుపాయాల్ని వినియోగించుకునే విధానాలు ఈ నెల నుంచి మారనున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్‌ క్రెడిట్‌ కార్డు వినియోగదారులు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో లాంజ్‌ (విశ్రమించే చోటు) సదుపాయాల్ని వినియోగించుకునే విధానంలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ మార్పులు చేసింది. ఇక నుంచి ఇలా వెళ్లి అలా కార్డు స్వైప్‌ చేసి లాంజ్‌ సదుపాయాలు ఉపయోగించుకోవడం కుదరదు.

తమ క్రెడిట్‌ కార్డు ద్వారా గత మూడు నెలల్లో చేసిన ఖర్చుల ఆధారంగా బ్యాంకులు ఇక వోచర్లు ఇస్తాయి. ఆ వోచర్ల ఆధారంగానే ఈ లాంజ్‌ల్లో ప్రవేశం లభిస్తుంది. క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని పెంచడంతో పాటు ప్రయోజనాల్ని క్రమబద్దం చేసేందుకు ఈ నెల 10 నుంచి హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఈ విధానం అమలు చేయనుంది.

యాక్సిస్‌ బ్యాంక్‌: యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ నెల 20 నుంచి తన రివార్డ్‌ క్రెడిట్‌ కార్డుపై రివార్డులు, ఫీజు మినహాయింపు విధానంలో మార్పులు చేస్తోంది. ఈ కార్డులపై ఇక ఈ ప్రయోజనాలను వివిధ (రెంట్‌, వ్యాలెట్‌, ఇంధన ఖర్చులు వంటివి) ఖర్చుల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు వీటిని నాలుగు అంకెల మర్చంట్‌ కోడ్స్‌ ఆధారంగా నిర్ణయించేవారు.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: ఈ నెల 1 నుంచే కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తన క్రెడిట్‌ కార్డుల ఫీజు విధి విధానాలను సవరించింది. స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ పాటించడంలో వైఫల్యం, డైనమిక్‌ కరెన్సీ కన్వర్షన్‌ (ఇతర దేశాల్లో ప్రయాణించేటప్పుడు కార్డు ద్వారా మన దేశ కరెన్సీలోనే చెల్లించడం), కరెంట్‌, డీటీహెచ్‌, గ్యాస్‌ వంటి యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, విద్యకు సంబంధించి చేసే లావాదేవీల చెల్లింపులు, వ్యాలెట్‌ టాప్‌ అప్స్‌, పెట్రోల్‌, డీజిల్‌ చెల్లింపులు, నైపుణ్యాల ఆధారిత ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం చేసే చెల్లింపులకు సవరించిన ఈ ఫీజు విధానం వర్తిస్తుంది. దీనికి తోడు కనీస బాకీ మొత్తాన్ని (ఎంఏడీ) లెక్కించే విధానాన్నీ బ్యాంక్‌ మార్చివేసింది.


టీడీఎస్‌ సర్టిఫికెట్‌

మీరు ఉద్యోగి అయితే ఈ నెల 15లోగా మీరు పని చేస్తున్న ఆఫీస్‌ నుంచి ఫారమ్‌-16, ఫారమ్‌-16ఏతో పాటు టీడీఎస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. తప్పులు లేకుండా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసేందుకు ఇవి తప్పనిసరి అనే విషయం మర్చిపోకూడదు.

ఆధార్‌ అప్‌డేట్‌

ఆధార్‌ వివరాల ఉచిత అప్‌డేట్‌ గడువు కూడా ఈ నెల 14తో ముగుస్తోంది. మై ఆధార్‌ పోర్టల్‌ ద్వారా ఈ అప్‌డేట్‌ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో ఆధార్‌ కేంద్రాల వద్ద అప్‌డేట్‌ చేయించుకోవాలంటే ఫీజు చెల్లించక తప్పదు.

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపు

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ తొలి కిస్తీని కూడా ఈ నెల 15లోగా చెల్లించాలి. జీతంతో పాటు డిపాజిట్లపై వడ్డీ, అద్దెలు, మూలధన లాభాలు ఉండి టీడీఎస్‌, టీసీఎస్‌ పోను రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయ పన్ను చెల్లించాల్సిన వ్యక్తులకు ఇది వర్తిస్తుంది. మొత్తం చెల్లించాల్సిన ఆదాయ పన్నులో తొలి కిస్తీ కింద 15 శాతం అడ్వాన్స్‌ ట్యాక్స్‌గా చెల్లించాలి. ఈ ట్యాక్స్‌ చెల్లించకపోయినా, ఆలస్యం చేసినా నెలకు ఒక శాతం చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


ఈపీఎఫ్ఓ 3.0

పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేయడం, నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) అప్‌డేట్‌ చేయడం ఇప్పుడో పెద్ద ప్రహసనం. ఈ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫఓ).. ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో ఈ నెల కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీని ద్వారా క్లెయిమ్స్‌ను త్వరగా ప్రాసెస్‌ చేసే అవకాశం కల్పించనుంది. వీటికి తోడు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకున్నట్టుగా పీఎఫ్‌ విత్‌డ్రాయల్స్‌ కోసం కూడా ప్రత్యేక కార్డులు తీసుకురానుంది.

ఓవర్‌ నైట్‌ ఫండ్స్‌ కటాఫ్‌ టైమ్‌

మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్)కు చెందిన ఓవర్‌ నైట్‌ ఫండ్స్‌ యూనిట్ల రిడంప్షన్‌, కేటాయింపుల విధానం ఈ నెల 1 నుంచి మారుతోంది. ట్రేడింగ్‌ రోజుల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన అప్లికేషన్లకు అంతకు ముందు రోజు ఉన్న ఎన్‌ఏవీ ఆధారంగా, ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లకు ఆ తర్వాతి రోజు ఎన్‌ఏవీ ఆధారంగా యూనిట్ల కేటాయింపు లేదా రిడంప్షన్స్‌ ఉంటాయి.

Updated Date - Jun 01 , 2025 | 02:58 AM