Share News

Nirmala Sitharaman Trade Tariffs: దీర్ఘకాలిక వ్యూహంతో గట్టెక్కుతాం

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:46 AM

ట్రంప్‌ సుంకాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగుతుందని అన్నారు. భారత్‌ త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నీతి ఆయోగ్‌ పేర్కొంది

Nirmala Sitharaman Trade Tariffs: దీర్ఘకాలిక వ్యూహంతో గట్టెక్కుతాం

  • సుంకాల కల్లోలంపై నిర్మల

ముంబై: ట్రంప్‌ ప్రతీకార సుంకాలతో తలెత్తిన అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ పరిణామాలపై భారత్‌ కుంగిపోవడం లేదన్నారు. విధానపరమైన సత్వర నిర్ణయాలు, దీర్ఘకాలిక ముందు చూపుతో ఈ అడ్డంకులను భారత్‌ అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బలమైన ఆర్థిక పునాదులు ఈ విషయంలో మన దేశానికి కలిసి వస్తాయన్నారు. బీఎస్‌ఈ 150వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రారంభించిన ఈ వాణిజ్య యుద్ధంతో స్వీయ వాణిజ్య రక్షణ విధానాలు పెరిగిపోతాయన్నారు. దీంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడమే గాక అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకూ ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. దీంతో పెట్టుబడుల విషయంలోనూ అనిశ్చితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ట్రంప్‌ సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుదేలైనా, మన మార్కెట్‌ మాత్రం వేగంగా కుదుట పడిందన్నారు. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దం చివరికల్లా ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్నదన్నారు.


జర్మనీ, జపాన్‌లనీ దాటేస్తాం

వచ్చే మూడేళ్లలోనే భారత్‌ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుందని నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రమణియం అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 4.3 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.367 లక్షల కోట్లు) ఉన్న భారత జీడీపీ వచ్చే ఏడాది చివరికల్లా జర్మనీ జీడీపీని, ఆ పై సంవత్సరం జపాన్‌ జీడీపీని అధిగమించనుందన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 01:48 AM