Atomic Energy Investment: దేశీయ అణు విద్యుత్ ప్లాంట్లలోకి 49 శాతం విదేశీ పెట్టుబడులు
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:34 AM
దేశీయ అణు విద్యుత్ ప్లాంట్లలో 49 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతించేందుకు కేంద్రం యోచనలో ఉంది.ఇది శుద్ధ ఇంధన ఉత్పత్తిని పెంపొందించడంలో కీలకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

అనుమతించే యోచనలో కేంద్రం
న్యూఢిల్లీ: దేశ అణు విద్యుత్ రంగంలోకి విదేశీ సంస్థలకు గేట్లు తెరిచేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయ అణు విద్యుదుత్పత్తి ప్లాం ట్లలో విదేశీ సంస్థలు 49 శాతం వరకు వాటాలను కొనుగో లు చేసేందుకు అనుమతించే అవకాశం ఉందని ముగ్గురు ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా కథనం వెల్లడించింది. విదేశీ పెట్టుబడులు ఈ రంగానికి ఊతమివ్వడంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దేశీయ అణురంగంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సడలించాలని ప్రభుత్వం 2023 నుంచే ప్రయత్నాలు చేస్తోంది. కాలుష్యకారక బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తికి ప్రత్యామ్నాయంగా శుద్ధ ఇంధన ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచాలనుకుంటోంది. కానీ, ఇందుకు పెద్దఎత్తున పెట్టుబడులు అవసరం. విదేశీ సంస్థలను అనుమతించడం ద్వారానే ఇది సాధ్యమని కేంద్రం భావిస్తోంది. 2047 నాటికి దేశీయ అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 100 గిగావాట్ల స్థాయికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.