India Economy: జీఎస్‌టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:22 AM
ఈ ఏడాది జూలైలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధితో రూ

గతనెలలో 67% పెరిగిన రిఫండ్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలైలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధితో రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది జూలైలో జీఎ్‌సటీ స్థూల ఆదాయం రూ.1.82 లక్షల కోట్లుగా నమోదు కాగా.. ఈ జూన్‌లో వసూళ్లు రూ.1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నెలలో దేశీయంగా జీఎ్‌సటీ ఆదాయం 6.7% వృద్ధితో రూ.1.43 కోట్లకు చేరగా.. దిగుమతులపై పన్ను వసూళ్లు 9.5% పెరిగి రూ.52,712 కోట్లుగా నమోదయ్యాయి. కాగా, గత నెలలో రిఫండ్లు 66.8% పెరిగి రూ.27,147 కోట్లకు చేరాయి. రిఫండ్లను మినహాయించగా, గత నెలకు జీఎ్‌సటీ నికర వసూళ్లు 1.7% వృద్ధితో రూ.1.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు, తాత్కాలిక మందగమనం నేపథ్యంలోనూ దేశీయంగా వినియోగంతో పాటు ఆర్థిక వృద్ధి స్థిరంగానే ఉందని తాజా జీఎస్‌టీ గణాంకాలు సూచిస్తున్నాయని ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్‌నర్ సౌరభ్ అగర్వాల్ అన్నారు. అలాగే, సకాలంలో పన్ను రిఫండ్లు వ్యాపారులకు నిర్వహణ మూలధనం కొరత రాకుండా తోడ్పడగలవని ఆయన తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో..
గత నెల తెలంగాణ జీఎ్‌సటీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10% వృద్ధితో రూ.5,417 కోట్లకు పెరిగింది. గత ఏడాది జూలైలో ఇది రూ.4,940 కోట్లు గా ఉంది. ఈ జూలైలో ఆంధ్రప్రదేశ్ జీఎ్‌సటీ రెవె న్యూ 14% పెరిగి రూ.3,803 కోట్లకు పెరిగింది. 2024 జూలైలో వసూళ్లు రూ.3,346 కోట్లుగా నమోదయ్యాయి