Edible Oil Prices: కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న వంటనూనెల ధరలు
ABN , Publish Date - May 31 , 2025 | 07:46 AM
దేశంలో గృహిణులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా పైపైకి చేరిన వంట నూనెల ధరలు (Edible Oil Prices) మరికొన్ని రోజుల్లో తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.

వంట నూనెల ధరల (Edible Oil Prices) పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం క్రూడ్ వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం మే 31 శనివారం నుంచి అమల్లోకి వచ్చిందని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. ఈ నిర్ణయం దేశీయ రిఫైనింగ్ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తోంది. ఇది వినియోగదారులకు కూడా ఊరటనిచ్చే అంశమని చెప్పుకోవచ్చు.
ధరల తగ్గింపునకు అవకాశం
ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో పాటు ఇతర ఛార్జీలను కలిపిన తరువాత, ఇప్పుడు ఈ క్రూడ్ నూనెలపై దిగుమతి సుంకం 27.5 శాతం నుంచి 16.5 శాతానికి పడిపోయింది. అయితే, రిఫైన్డ్ ఆయిల్స్‌పై ఉన్న 35.75 శాతం సుంకంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. భారతదేశం దాదాపు 50 శాతం ఆహార నూనెల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడింది. గతంలో దిగుమతి సుంకాలు పెంచినప్పుడు మార్కెట్‌లో నూనెల ధరలు పెరిగాయి. ఇప్పుడు సుంకాలను తగ్గించడం వల్ల వినియోగదారులకు వంట నూనెల రేట్లు తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
దేశీయ పరిశ్రమలకు..
ఇది దేశీయ రిఫైనింగ్ పరిశ్రమలకు ఊతమిచ్చే నిర్ణయమని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి. మెహతా అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి దోహదపడే చర్య అని పేర్కొన్నారు. భారతదేశం పామ్ ఆయిల్‌ను ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రూడ్ ఆయిల్స్‌పై సుంకం తగ్గిన తరువాత, స్థానికంగా రిఫైన్ చేసి వినియోగానికి అందించగలిగితే, విదేశీ ఆధారాన్ని తగ్గించుకోవచ్చు.
వెజిటెబుల్ ఆయిల్
క్రూడ్ ఫైన్డ్ ఆయిల్స్ మధ్య దిగుమతి సుంకం తేడా 19.25 శాతానికి పెరగడం ఎంతో సంతోషకరమని ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్ అన్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి బలమవుతుందని అభిప్రాయపడ్డారు. రెండు రకాల నూనెల మధ్య సుంకంలో తేడా పెరగడం వల్ల, రిఫైన్డ్ ఆయిల్స్‌కు దోహదపడే విదేశీ దిగుమతుల పట్ల ఆకర్షణ తగ్గి, దేశీయంగా క్రూడ్ ఆయిల్స్‌ను ప్రాసెస్ చేసి వినియోగించడానికి అవకాశం పెరుగుతుందన్నారు.
గతంలో జరిగిన మార్పులు
గత సంవత్సరం సెప్టెంబర్ 14న కేంద్రం క్రూడ్ ఆయిల్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 0 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. అదే సమయంలో రిఫైన్డ్ ఆయిల్స్‌పై డ్యూటీని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచింది. దీని ఫలితంగా, తక్కువ ధరకే లభించే రిఫైన్డ్ ఆయిల్స్ దిగుమతులు ఊపందుకున్నాయి. కానీ ఇప్పుడు తిరిగి క్రూడ్ ఆయిల్స్‌పై డ్యూటీ తగ్గించడంతో పరిస్థితి మారనుంది.
ఇవీ చదవండి:
ప్రమాదంలో ప్రజలు.. కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు
నీట్ పీజీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి