Kashmir Terror Attack Impact: వార్ వర్రీస్
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:40 AM
భారత్–పాక్ సరిహద్దులపై ఉద్రిక్తతలతో మార్కెట్లు కుదేలై రెండు రోజుల్లో రూ.8.88 లక్షల కోట్ల నష్టం వచ్చింది.కెనరా రొబెకో, ప్రెస్టేజ్ హాస్పిటాలిటీ ఐపీఓలకు సెబీకి డాక్యుమెంట్లు సమర్పించాయి

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..
సెన్సెక్స్ ఒకదశలో 1,196 పాయింట్లు డౌన్
చివరికి 589 పాయింట్ల నష్టంతో సరి
2 రోజుల్లో రూ.8.88 లక్షల కోట్ల నష్టం
ముంబై: కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై తీవ్రవాదుల దాడి అనంతరం భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీయవచ్చన్న భయాలు శుక్రవారం మార్కెట్లను కుదిపేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో సూచీ 1,195.62 పాయింట్లు (1.49 శాతం) క్షీణించి 78,605.81 వద్దకు జారుకుంది. చివరికి 588.90 పాయింట్ల (0.74 శాతం) నష్టంతో 79,212.53 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 207.35 పాయింట్లు (0.86 శాతం) పతనమై 24,039.35 వద్ద ముగిసింది. సూచీలు నష్టపోవడం వరుసగా ఇది రెండో రోజు. ఈ రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 903.96 పాయింట్లు (1.12 శాతం) కోల్పోయింది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎస్ ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.88 లక్షల కోట్లు తగ్గి రూ.421.58 లక్షల కోట్లకు (4.93 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు తగ్గి రూ.85.41 వద్ద ముగిసింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ మడిచమురు పీపా ధర ఒక దశలో 0.66 శాతం తగ్గి 66.11 డాలర్లకు దిగివచ్చింది.
పబ్లిక్ ఇష్యూకు కెనరా రొబెకో ఏఎంసీ
కెనరా రొబెకో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓలో భాగంగా ప్రమోటర్లకు చెందిన 4.98 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనున్నట్లు ముసాయిదా పత్రాల్లో కంపెనీ వెల్లడించింది. కంపెనీ ప్రమోటర్లైన కెనరా బ్యాంక్ 2.59 కోట్ల షేర్లు, ఓరిక్స్ కార్పొరేషన్ యూర్‌ప (గతంలో రొబెకో గ్రూప్) 2.39 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. కెనరా రొబెకో ఏఎంసీలో కెనరా బ్యాంక్ 51 శాతం, ఓరిక్స్ కార్పొరేషన్ 49 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ రూ.2,700 కోట్ల ఐపీఓ
ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనుబంధ విభాగమైన ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్ లిమిటెడ్ కూడా ఐపీఓకు రాబోతోంది. ఐపీఓ ద్వారా రూ.2,700 కోట్లు సేకరించేందుకు అనుమతి కోరుతూ సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది. అందులో రూ.1,700 కోట్ల తాజా ఈక్విటీ జారీ ద్వారా, మరో రూ.1,000 కోట్లు ప్రమోటరైన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వాటా విక్రయం ద్వారా సమీకరించనున్నట్లు సంస్థ తెలిపింది.