Adani SEC Case: అదానీలపై కేసు కొనసాగుతోంది
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:08 AM
అధికారులకు లంచాలు ఇచ్చారన్న కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతడి దగ్గరి బంధువు సాగర్‌లపై దర్యాప్తు కొనసాగుతోందని అమెరికా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ,సెక్) వెల్లడించింది.

ఇంకా సమన్లు మాత్రం పంపలేదు: ఎస్‌ఈసీ
వాషింగ్టన్: అధికారులకు లంచాలు ఇచ్చారన్న కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతడి దగ్గరి బంధువు సాగర్‌లపై దర్యాప్తు కొనసాగుతోందని అమెరికా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ,సెక్) వెల్లడించింది. అయితే ఈ కేసులో ఇంకా వీరికి సమన్లు జారీ చేయలేదని న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టుకు ఎస్‌ఈసీ తెలిపింది. వీరిద్దరూ విదేశీ పౌరులైనందున వారికి నేరుగా గాక, సరైన దౌత్య మార్గాల్లో సమన్లు పంపాల్సి ఉంటుందని కోర్టుకు తెలియజేసింది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం వీరు అధికారులకు 26.5 కోట్ల డాలర్లు లంచంగా ఇచ్చారనే ఆరోపణలపై ఎస్‌ఈసీ గత ఏడాది నవంబరు 20న వీరిపై అభియోగాలు నమోదు చేసింది. అయితే హేగ్ సర్వీస్ ఒప్పందం ప్రకారం వీరికి సమన్లు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. వీరికి సమన్లు జారీ చేసేందుకు నిర్ణీత గడువంటూ లేదని స్పష్టం చేసింది. లంచాల విషయం దాచిపెట్టి 2021 సెప్టెంబరులో అదానీ గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ.. అమెరికా మార్కెట్ నుంచి రుణ పత్రాల ద్వారా నిధులు సమీకరించడంతో ఈ కేసు నమోదైంది.