Share News

YS Sharmila: సీవోఏ అనుమతుల్లేకుండా అడ్మిషన్లా

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:11 AM

కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (సీవోఏ) అనుమతులు లేకుండానే వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇచ్చారు? కోర్సు కాలం పూర్తయితే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఏంటి?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

YS Sharmila: సీవోఏ అనుమతుల్లేకుండా అడ్మిషన్లా

  • జగన్‌, అవినాశ్‌దే ఈ పాపం

  • వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ వర్సిటీ విద్యార్థుల

  • భవిష్యత్తుతో ఆడుకున్న నాటి వైసీపీ ప్రభుత్వం

  • పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శ

  • ప్రస్తుత ప్రభుత్వం తప్పు సరిదిద్దాలని డిమాండ్‌: షర్మిల

చెన్నూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ‘కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (సీవోఏ) అనుమతులు లేకుండానే వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇచ్చారు? కోర్సు కాలం పూర్తయితే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఏంటి?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కడప జిల్లా చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె వద్ద వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనకు ఆమె సోమవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆవేదన వెలిబుచ్చారు. సీవోఏ అనుమతులు లేకుండా 2020 నుంచి మూడేళ్ల పాటు మభ్యపెట్టి అడ్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు కోర్సుకాలం పూర్తయిపోతోందని, ఆ సర్టిఫికెట్లకు విలువ ఉండదని పేర్కొన్నారు. కోర్సు పూర్తయ్యే సరికి రూ.15 లక్షల మేర ఖర్చవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో కష్టపడి చదివి ప్రయోజనం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. 67 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ అనుమతులు లేకుండా నాటి వైసీపీ ప్రభుత్వం మభ్యపెట్టి విద్యార్థులను చేర్చుకోవడం దారుణమన్నారు. ‘ఇప్పటి వరకు తొలి బ్యాచ్‌కే ఎన్‌రోల్‌మెంటు లేదు. ఇలా మూడేళ్లపాటు విద్యార్థుల భవిష్యత్తును ఫణంగా పెట్టారు. ఇది నాటి సీఎం జగన్‌, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిల నిర్లక్ష్యమే’ అని ధ్వజమెత్తారు. 2020 నుంచి 2022 వరకు మూడేళ్ల పాటు చదివిన విద్యార్థులకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత వైసీపీ సర్కార్‌ చేసిన తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని షర్మిల అన్నారు. కేంద్రంలో వారి కూటమినే అధికారంలో ఉందని, ఢిల్లీలో ఉన్న సీవోఏ నుంచి అనుమతులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌లు విద్యార్థుల భవిష్యత్తుపై సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటి వరకు వర్శిటీకి సొంత భవనంతో పాటు పర్మినెంట్‌ వీసీ, ఫ్యాకల్టీ లేరని విమర్శించారు. దీనిపై లోకేశ్‌ తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఇన్‌చార్జి వీసీ వసంతకుమార్‌తో సీవోఏ అనుమతులు, నాటి పరిస్థితులపై షర్మిల ఆరా తీశారు.

Updated Date - Jul 08 , 2025 | 04:12 AM