Share News

Nellore Crime Case: కాళ్లూచేతులూ కట్టేసి.. గొంతుకు వైరు బిగించి..

ABN , Publish Date - Jul 18 , 2025 | 06:11 AM

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ ఇల్లాలు...

Nellore Crime Case: కాళ్లూచేతులూ కట్టేసి.. గొంతుకు వైరు బిగించి..
Nellore Crime Case

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

  • తల గోడకు కొట్టుకుని పడిపోయాడంటూ నాటకం

  • పోలీసుల రంగప్రవేశంతో తామే చంపామని వెల్లడి

  • నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో దారుణం

రాపూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ ఇల్లాలు. మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తను అర్ధరాత్రి కాళ్లూచేతులు కట్టేసి, మెడకు కరెంటు వైరు బిగించి కిరాతకంగా కడతేర్చింది. అనంతరం తన భర్త తాగొచ్చి తనతో గొడవపడి, తల గోడకు కొట్టుకుని పడిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే చెవుల నుంచి రక్తం కారడం, మెడ కమిలిపోయి ఉండడంతో మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాపూరులోని దళితవాడకు చెందిన లేబాకు రత్నయ్య, రమణమ్మ దంపతుల కుమారుడు లేబాకు శీనయ్య (28)కు పంగిలి గ్రామానికి చెందిన ధనమ్మతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. రత్నయ్య దంపతులు, శీనయ్య పక్కపక్కనే వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. కూలి పనులు చేసుకునే శీనయ్య మద్యం మత్తులో తరచూ ధనమ్మతో గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. రోజూలాగే కూలి పనులు ముగించుకొని ఇంటికొచ్చిన శీనయ్య బుధవారం రాత్రి నిద్రపోయాడు. గురువారం ఉదయం ఆయన నిద్ర లేవకపోయేసరికి ధనమ్మ పక్క ఇంట్లో ఉన్న అత్తామామల వద్దకు వెళ్లి శీనయ్య లేవడం లేదని చెప్పింది.


రాత్రి తనతో గొడవపడ్డాడని, తల గోడకు కొట్టుకొని పడిపోయాడని నమ్మబలికింది. వెంటనే లోపలికి వెళ్లి చూసిన తల్లిదండ్రులు అప్పటికే శీనయ్య మృతిచెందినట్టు గమనించారు. అతని మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టారు. అయితే శీనయ్య చెవి నుంచి రక్తం కారడం, మెడపై నల్లగా కమిలినట్లు ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు, కొంతమంది బంధువులు ధనమ్మను ప్రశ్నించారు. అయితే ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పేసరికి వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు రాపూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధనమ్మను గద్దించి అడగడంతో జరిగిన విజయం బయటపెట్టింది. తనతో సాన్నిహితంగా ఉన్న కల్యాణ్‌ అలియాస్‌ వెంకటరమణయ్యతో కలిసి శీనయ్యను హత్యచేసినట్టు అంగీకరించింది. తాము ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం బుధవారం అర్ధరాత్రి పడుకుని ఉన్న శీనయ్య కాళ్లూచేతులూ కట్టేసి కరెంట్‌ వైర్‌తో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశామని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నిందితురాలు చెప్పిన వివరాల ప్రకారం కల్యాణ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 06:12 AM