Former IAS Praveen Prakash: సీఎం చెబితే చేయాలంతే
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:02 AM
ముఖ్యమంత్రే సర్వాధికారి.. ఆయన చెప్పినట్లు అధికారులు పనిచేయాల్సిందే అలా చేయనందుకే నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై జగన్ వేటు వేశారు అని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్.
‘కాదు’ అన్నందుకే నాడు ఎల్వీపై జగన్ వేటు
చెప్పింది చేయకుంటే ఇక నేనెందుకని జగన్ అన్నారు
కోపంతోనే వీఆర్‌ఎస్ తీసుకున్నా
వెనక్కి తీసుకోవాలనుకున్నా కానీ చంద్రబాబు అంగీకరించలేదు!
అపాయింట్‌మెంట్ కోసం చాలా ప్రయత్నించా
సీఎం నాపై కోపంగా ఉన్నారట
జగన్‌కు మోకరిల్లలేదు..
నోటి దుర్వాసన వస్తుందనే మోకాళ్లపై కూర్చుని మాట్లాడా
ఆర్‌కేతో ‘బిగ్ డిబేట్’లో రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్
‘‘ముఖ్యమంత్రే సర్వాధికారి.. ఆయన చెప్పినట్లు అధికారులు పనిచేయాల్సిందే! అలా చేయనందుకే నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై జగన్ వేటు వేశారు’’ అని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టంచేశారు. సచివాలయంలో అన్ని ఫైళ్లకూ సీఎం ఆమోదం కచ్చితంగా ఉండాలన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నాడు సీఎంగా ఉన్న జగన్ ఎందుకు సాగనంపారనే రహస్యాన్ని బయటపెట్టారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆదివారం నిర్వహించిన ‘బిగ్ డిబేట్’లో ప్రవీణ్ ప్రకాశ్ పాలుపంచుకున్నారు. కోపంతోనే స్వచ్ఛంద పదవీవిరమణ (వీఆర్‌ఎస్) దరఖాస్తు పెట్టుకున్నానని అంగీకరించారు. తర్వాత మళ్లీ వెనక్కి వద్దామనుకున్నా.. సీఎం చంద్రబాబు సమ్మతించలేదని చెప్పారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆర్‌కే: బాగా టెన్షన్‌గా ఉన్నట్లు ఉన్నారు..
టెన్షన్ కాదు సార్... గత ఏడాది నుంచి జర్నీ వల్ల..
ఆర్‌కే: కోపంతో వీఆర్‌ఎస్ తీసుకున్నారా..?
అవును. కోపంతోనే వీఆర్‌ఎస్ ఇచ్చాను.
ఆర్‌కే: మొత్తానికి తప్పు చేశానని ఫీలవుతున్నారు..!
కానీ ఏ తప్పనేది తెలియదు.. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాను. అందరినీ అడిగాను.. నేనెక్కడ తప్పు చేశానని! ఎవరి నుంచీ సమాధానం రాలేదు. నా దగ్గర కూడా జవాబు లేదు.
ఆర్‌కే: అన్ని హద్దులూ క్రాస్ చేసేశారన్నది మీ మీద నింద. ఐఏఎస్ శిక్షణ ఇచ్చినప్పుడు.. చట్టానికి, రాజ్యాంగానికి, నిబంధనలకు కట్టుబడి ఉండాలని చెబుతారు. సీఎంకు కాదు కదా..!
అవును సర్.. ఈ రోజు మీ దగ్గరకు రావడానికి కారణం ఏమిటంటే.. నాకు ఆంధ్రప్రదేశ్ మీద కమిట్‌మెంట్ ఉంది. నా లైఫ్‌లో 2.0 స్టార్ట్ అయింది. మళ్లీ ఏపీ వైపు అడుగు వేయాలని భావిస్తున్నా. కాబట్టి ఏపీతో మాట్లాడాలి. అది మీ ద్వారా ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలనుకుంటున్నాను.
ఆర్‌కే: ఐఏఎస్‌గా రెస్పాన్సిబుల్‌గా ఉన్నారా.. లేదా అన్నదే ముఖ్యం.
అది చూసే వారి దృష్టి కోణంలో ఉంటుంది. నేను మొదటి నుంచీ ప్రవీణ్‌లానే ఉన్నాను. తెల్లకాగితాన్ని ఎర్ర కళ్లజోడు పెట్టుకున్న వారికి ఎర్రగా, నల్ల జోడు పెట్టుకున్న వారికి నల్లగా కనిపిస్తుంది... అంతే!
ఆర్‌కే: ప్రవీణ్ మాత్రమే ఎందుకు రంగు రంగుల్లో కనిపించారు..? 30 ఏళ్ల తర్వాత కోపంతో రాజీనామా చేశారు.. శిక్షణలో నేర్చుకున్నది ఇదేనా..?
మనం కోపంలో.. హ్యాపీనెస్‌లో ఏ నిర్ణయం తీసుకోకూడదని మొదటి ఏడాదిలోనే నేర్పుతారు. మేనేజ్‌మెంట్ ప్రిన్సిపుల్స్‌లో టెక్నికల్ సమస్యలు ఉండవు. ప్రతి మనిషికీ లిమిట్స్ ఉంటాయి.
ఆర్‌కే: సీఎం ఏది చెబితే అది చేస్తారా..? కొట్టి రమ్మంటే కొట్టివస్తారా?
ఏపీలో ఏ సీఎం అయినా.. జగన్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి.. ఎవరైనా.. ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి డైరెక్షన్సూ ఇవ్వరు. జగన్ గానీ, చంద్రబాబు గానీ మీరు అది చేయండి.. ఇది చేయండి.. చేయకపోతే ట్రాన్స్‌ఫర్ చేసేస్తా అని ఎవరినీ అనరు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది.. ఏం చేయాలి.. ఎలా చేయాలని మాత్రమే అడుగుతారు.
ఆర్‌కే: మీరు జగన్ దగ్గర పని చేసినప్పుడు ప్రభుత్వ భవనాలకు వైసీపీ కలర్స్ వేయించారుగా.. ఎలా వేయిస్తారు..? ఎంత ప్రజాధనం వృథా అయిందో మీకూ తెలుసు? నిబంధనలు అంగీకరించవని మీరెందుకు చెప్పలేదు?
నేను కేవలం ఉద్యోగిని. ఎంప్లాయ్‌గా కొన్ని లిమిట్స్ ఉంటాయి. రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి చెప్పిన తర్వాత.. నేనెలా ఆపగలను? ప్రభుత్వంలో క్యాబినెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా పని చేస్తుంది. మేం పొలిటికల్ సిస్టమ్‌కు అనుగుణంగాచెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఆర్‌కే: చెక్ అండ్ బ్యాలెన్స్ కేవలం చట్టానికి లోబడి ఉండాలి. మీరంతా కలిసి సీఎంను ప్లీజ్ చేయడానికి.. అడ్మినిస్ట్రేషన్‌ను పాడు చేసేశారు..
మేం కేవలం ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు సాయం చేయడానికి ఉండాలి.
ఆర్‌కే: మీకే ఎందుకీ సమస్య వచ్చింది..? లిమిట్స్ క్రాస్ చేశారా.. లేదా..?
నేను వీఆర్‌ఎస్ ఇవ్వడానికి 2024లో 50 శాతం మాత్ర మే నిర్ణయం తీసుకున్నాను. 2021లోనే మొదటి 50ు నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే కేంద్రంలో నాకు ప్రమోషన్ రాలేదు. ఇప్పటి వరకూ ఎవరి వద్దా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. చంద్రబాబును గానీ, జగన్‌ను గానీ ఎవరినీ ప్లీజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అవసరమైతే పాలీగ్రాఫ్ పరీక్షకైనా సిద్ధం. కేంద్రానికి వెళ్లే విషయమై సీనియర్లతో సంప్రదించేవాడిని. అప్పుడు వారు.. ఐఏఎ్‌సలో ఒక సిస్టమ్ ఉంది. నువ్వు సీనియర్స్‌తో మిస్‌బిహేవ్ చేస్తా వా..? ఎల్వీ, ప్రీతి సుడాన్, పీవీ రమేశ్‌తో మిస్‌బిహేవ్ చేస్తే నిన్ను సెంట్రల్‌లో ఎంప్యానెల్ ఎలా చేస్తాం? నువ్వు ఆంధ్రా భవన్‌లో కూర్చుని వ్యతిరేక ప్రచారం(బ్లాక్ బ్యాడ్జ్) వేస్తావా? నీకసలు కామన్‌సెన్స్ ఉందా.. అని గట్టిగా చెప్పారు.
ఆర్‌కే: మేం ప్రచురించాం కదా!
అవును సర్.. నేను చెప్పిన తర్వాత కూడా మీరెందుకు సెక్రటరీని ఆపారని సీఎస్ మెమోలో పేర్కొన్నారు. పై రెండు పోస్టింగ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయనీ మెమో ఇచ్చారు. ఆ తర్వాత... ‘వెంటనే ఏపీలో ఎవరెవరు సీనియర్లు ఉన్నారో లిస్ట్ చెప్పు.. సీఎంకు సీఎస్, సీఎంవో రెండు కళ్లు. ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండాలి. నీకు ఎవరితో కంఫర్ట్‌గా ఉంటుందో చెప్పు’ అని జగన్ అన్నారు. నేను వెంటనే నీలం సాహ్ని మేడం అయితే బాగుంటుందని చెప్పాను. ఇద్దరం జగన్ వద్దకు వెళ్లాం.. ఆ రోజు ఆయన రెండు ఫైల్స్‌పై ఆయన సంతకం చేశారు. నీలం మేడంను ఏపీకి తీసుకురావడంతో పాటు ఎల్వీ సర్‌ను బాపట్లకు ట్రాన్స్‌ఫర్ చేస్తూ జీవో జారీ చేశారు. ఆ తర్వాత నేను సీఎం వద్దకు వెళ్లాను. ఏపీ చరిత్రలో ఇద్దరు సీనియర్ ఐఏఎ్‌సల మధ్య సమస్య వచ్చినప్పుడు సీఎంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పాను. అయితే సీనియర్‌ను బదిలీ చేసినప్పుడు.. జూనియర్‌నూ చేయాలని చెప్పాను. అలా చేస్తే మ నమధ్య సంబంధాలు బాగోలేదని అనుకుంటారని అన్నారు.
ఆర్‌కే: మీ వీఆర్‌ఎస్‌ను సీఎం చంద్రబాబు వెంటనే ఆమోదించారు..!
ఆమోదించాలని నేనే అడిగాను.
ఆర్‌కే: వీఆర్‌ఎస్ తీసుకున్నందుకు పశ్చాత్తాపపడుతున్నారా?
ఎందుకు పశ్చాత్తాపపడాలి సర్? కానీ వీఆర్‌ఎస్ తీసుకున్నందుకు నాకంటే మా తల్లిదండ్రులు ఎక్కువ ఫీలవుతున్నారు. నా భార్యకు కూడా ఇష్టం లేదు.
ఆర్‌కే: జగన్ హయాంలో తప్పు చేసినందుకు ఇప్పుడు సస్పెండ్ చేస్తారని భయపడి వీఆర్‌ఎస్ తీసుకున్నారా?
నాకలాంటి భయమేమీ లేదు. ఈ రోజు కూడా కేసు పెట్టుకోవచ్చు. క్రిమినల్ కేసులు లైఫ్‌లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు.
ఆర్‌కే: రంగుల పేరుతో ప్రజల సొమ్ము వృథా.. నేనైతే ప్రాసిక్యూషన్ చేసేవాడిని.
సర్.. ఒక ప్రశ్న అడుగుతా. కొంత మంది ఒక ప్రోగ్రాం చేయాలంటే పెద్ద మీటింగ్‌లు పెడతారు. ప్రభుత్వంలో కొన్ని మీటింగ్స్‌లో పెద్ద స్టేజ్.. భారీగా చేయాలనుకుంటున్నారు. ఇది డబ్బు వృథా కాదా..?
ఆర్కే: అది వంద శాతం కరెక్టు. కానీ రంగుల విషయంలో నేషనల్స్ బిల్డింగ్స్ కోడ్ ఉంది కదా!
సీఎం ఎలా చెబితే అలా చేయాల్సిందే. పార్లమెంటరీ వ్యవస్థలో ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్లి, కొన్ని చట్టాలు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కూడా ముఖ్యమంత్రి హెడ్. సచివాలయంలోని అన్ని ఫైల్స్‌కు సీఎం ఆమోదం కచ్చితంగా ఉండాలి. అన్ని ఫైల్స్ ఆయనే ఆమోదిస్తారు.
ఆర్‌కే: మళ్లీ సర్వీస్‌లోకి రావాలనే ఆలోచన ఉందా..?
నేను కోపంలో చేశాను. 3 నెలల్లో వీఆర్‌ఎస్ వెనక్కి తీసుకుంటానని అడిగాను. నీరబ్‌కుమార్ ప్రసాద్ (అప్పటి సీఎస్) మాకు బంధువే. మళ్లీ సర్వీస్‌లోకి వస్తానని చెబితే.. సీఎం చంద్రబాబు మీమీద చాలా కోపంగా ఉన్నారని ఆయ న చెప్పారు. ఈ విషయంలో తనపై ఒత్తిడి తెస్తే సస్పెండ్ చేస్తానని సీఎం అన్నట్లు కొందరు నాతో అన్నారు. నేను రోజూ పేషీకి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ ఇప్పించాలని అడిగేవాడిని. గతంలో చంద్రబాబు, నేను దగ్గరగా ఉండేవాళ్లం..! 2019లో సీఎం పేషీలోకి తీసుకుంటామన్నారు.
ఆర్‌కే: జగన్ ముందు మోకాళ్లపై ఎందుకు కూర్చున్నారు..?
జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు కొత్త జిల్లాలు ప్రకటిస్తున్నారు. ఆ ఉదయం హడావుడిలో నేను వ్యాయా మం చేసి రాలేదు. సీఎం చేరువకు వెళ్లి మాట్లాడితే నోటి దుర్వాసన వస్తుందనే భావనతో కొంత దూరంగా మోకాళ్లపై కూర్చోని మాట్లాడాను. అంతే.
ఆర్‌కే: మీకు రాజకీయ పిచ్చి ఉన్నట్లుంది..!
మా వారాణసీలో నన్ను గుర్తుపట్టే వారే లేరు. 30 ఏళ్ల నుంచి అక్కడకు వెళ్లలేదు. మా అమ్మ, నాన్న తప్ప నన్ను అక్కడెవ్వరూ గుర్తుపట్టరు. నాకెందుకు టికెట్ ఇస్తారు సర్? సీఎంలను ఇంప్రెస్ చేస్తే నాకేమొస్తుంది? ఎమ్మెల్యే, ఎంపీ సాధించాలనే ఆలోచన నాకు లేదు.
ఆర్‌కే: జగన్‌ను హీరోలా ఉంటారని ప్యాంపర్ చేసేవారంట..!
(నవ్వుతూ..) నేను చాలా మందిని ప్యాంపర్ చేసేవాడిని. సీఎం చంద్రబాబుతో పాటు మా సీనియర్లందరినీ చేసేవాడిని. వాళ్ల దగ్గరే ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు సంభాషణ మొత్తం సీరియ్‌సగా మాత్రమే ఉండదు కదా.
ఆర్‌కే: ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ఏమిటి సమస్య..?
2019 అక్టోబరులో నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డి రెండు ముఖ్యమైన పథకాల గురించి.. నాడు-నేడు, ఆర్బీకేల (రైతు భరోసా కేంద్రాలు) విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నారు. నాడు-నేడు ప్రోగ్రాంలో భాగంగా పాత స్కూల్స్ చాలా అభివృద్ధి చేయాలని చెప్పారు. ఇదంతా ఎడ్యుకేషన్ స్పెషల్ సీఎస్ బి.రాజశేఖర్ కదా అమలు చేయాల్సింది.. మీరు ఆయన్ను అడిగారా అని నేనన్నాను. ఆ తర్వాత... దీనిని విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీ ద్వారా చేద్దాం.. అప్పుడు మంచి పేరు వస్తుందని రాజశేఖర్ చెప్పారు. తనకు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కావాలని, తెలంగాణలో రిటైరైన ఐఏఎస్ మురళిని తనకివ్వాలని అడిగారు. సీఎం వెంటనే ఆయన్ను ఏపీకి తెప్పించాలన్నారు. తర్వాత రెండ్రోజులకు ఆర్బీకేపై సమీక్ష చేశారు. అప్పుడు పూనం మాలకొండయ్య అగ్రికల్చర్‌కు ఇన్‌చార్జి స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు. ఆర్బీకేల్లో అన్నీ ఉండాలి, ఫెర్టిలైజెర్స్ నాణ్యమైనవి అందుబాటులో ఉంచాలని జగన్ స్పష్టంగా చెప్పారు. ఆమె వెంటనే.. ‘సర్ నేను అగ్రికల్చర్ శాఖకు ఇన్‌చార్జిని మాత్రమే.. ఫుల్ చార్జ్ ఉంటే బాగా చేస్తాను’ అని చెప్పారు. వెంటనే సీఎం ఆమోదించి, ఫైల్ మీద సంతకం చేసి సీఎ్‌సకు పంపించారు. తర్వాతి వారం కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్‌పై సీఎం సమీక్ష పెట్టారు. తాము అడిగినవి జరగలేదని సదరు అధికారులు చెప్పారు. ‘మీరు అంతా స్పీడ్‌గా చేయమంటారు.. మీ దగ్గరే అంతా స్లోగా ఉంది. చిన్న పోస్టింగ్ ఇవ్వడానికి కూడా ఆలస్యమవుతోంది’ అని రాజశేఖర్ అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే నన్ను పిలిచి.. వెంటనే వెళ్లి సీఎస్(ఎల్వీ)ను అడగండని చెప్పారు.
నేను సీఎస్ దగ్గరకు వెళ్లాను. సీఎం దగ్గర నుంచి మీకు రెండు నోట్లు వచ్చాయని.. వెంటనే వాటిని పంపించాలని చెప్పాను. ‘పూనం గురించి మీకు ఐడియా లేదా..? ఆమెకు డిపార్ట్‌మెంట్ ఇచ్చి ప్రమోట్ చేయాలా?’ అని ఆయన నన్ను ప్రశ్నించారు. మంచయినా.. చెడయినా సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారు.. ఆయన చెప్పిన పని కచ్చితంగా చేయాలి. నిర్ణయం తీసుకున్నారు కాబట్టి జీవో ఇచ్చేస్తే సరిపోతుందని నేను చెప్పాను. కానీ ఆయన ఫైల్ పంపించబోనన్నారు. ప్రధానమంత్రి లెటర్ పంపిస్తే క్యాబినెట్ సెక్రటరీ నో చెప్పగలరా..? సీఎం చెబితే సీఎస్ చేయాల్సిందే. కానీ ఎల్వీ చేయనని స్పష్టంగా చెప్పేశారు. ఈ విషయం నేనెవరికీ చెప్పలేదు. రెండు వారాల తర్వాత మళ్లీ ఈ రెండు ప్రోగ్రామ్స్‌పై జగన్ వద్ద సమీక్ష జరిగింది. రెండు ట్రాన్స్‌ఫర్లు కూడా చేయలేకపోతున్నారు.. ఏమైందని ఆయన అడిగారు. నేను ఫైల్ సీఎస్ దగ్గర ఉందని చెప్పాను. ఆ విషయం నాతో చెప్పాలి కదా అని ఆయన అన్నారు. ‘ఇది కూడా జరగక్కపోతే ఇంకెందుకు? నాకు సీఎం పోస్టు అవసరం లేదు. నేను వెళ్లిపోతాను. నేను దీని కోసమే వచ్చానా..? ఇది జరక్కపోతే వెళ్లిపోతాను’ అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యారు. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ఆ హోదాలో జీవో జారీ చేశాను. ఎవరైనా బాస్ చెప్పింది చేయాల్సిందే. ఆ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత సీఎం వద్దకు ఎల్వీ రాలేదు.
ఆర్‌కే: ఎల్వీని బదిలీ చేయాలని ఎవరు చెప్పారు..?
క్యాబినెట్‌లో ఒక చిన్న సమస్య వచ్చింది. విలేజ్ కోర్టుల గురించి చర్చించాలి. క్యాబినెట్ భేటీకి ముందు సీఎంకు బ్రీఫింగ్ ఉంటుంది. సీఎం, సీఎస్ చర్చించిన తర్వాత ఎజెండా నిర్ణయిస్తారు. విలేజ్ కోర్టుల గురించి సవివర ప్రజెంటేషన్ ఇవ్వాలని.. ఆ తర్వాత క్యాబినెట్‌లో పెడదామని సీఎం అన్నారు. లా సెక్రటరీ వేరే పని ఉండడంతో వెళ్లిపోయారు. తర్వాతి రోజు వచ్చారు. సీఎం గారికి ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. నేను అనుమతివ్వలేదు. ఆయన వెంటనే సీఎస్ (ఎల్వీ) వద్దకు వెళ్లారు. ఆయన్ను సీఎం వద్దకు తీసుకెళ్లాలని సీఎస్ నాతో చెప్పారు. నేను ఇప్పుడు వద్దన్నాను. సీఎం కంఫర్ట్‌బుల్‌గా లేరని స్పష్టంగా చెప్పాను. ఇదే అసలు సమస్యగా మారింది. ఆయన్ను ఎందుకు ఆపారంటూ సీఎస్ నాకు మెమో జారీ చేశారు. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు.
ఆర్‌కే: మరి తర్వాత మిమ్మల్ని ఎందుకు పంపించేశారు..?
ఇది జరిగిన రెండున్నరేళ్ల తర్వాత సీఎం వద్దకు వెళ్లాను. 26 నుంచి 28 నెలల తర్వాత ఆఫీసర్‌కు ఎఫిషియన్సీ తగ్గుతుంది.. మూడేళ్లపాటు సీఎంవోలో పని చేశాను.. ఏ పోస్టులో కూడా ఇంత కాలం చేయలేదని చెప్పాను. మీ సొంత స్టేట్‌లో చాలా మం ది ఐఏఎ్‌సలు చాలా కాలం నుంచి ఒకే పోస్టులో పని చేస్తునా ్నరు.. ఢిల్లీలో కూడా ఐఏఎ్‌సలు ఒకే పోస్టులో చాలా కాలం నుంచి కొనసాగుతున్నారని ఆయన అన్నారు. మిగిలిన ఆఫీసర్ల వైపు చూస్తూ.. ప్రవీణ్ ఏం మాట్లాడతారో.. ఏ థియరీ మాట్లాడతారో ఆయనకే తెలియదని నవ్వుతూ చెప్పారు. మీరు అనుమతిస్తే ఢిల్లీ వెళ్లిపోతానని అన్నారు. ఆయన నీ ఇష్టమనేసి వెళ్లిపోయారు.
ఐఏఎస్‌లు కఠినంగా వ్యవహరిస్తే..
పార్లమెంటరీ వ్యవస్థలో చట్టసభలతో పాటు ఎగ్జిక్యూటివ్‌కూ సమానమైన పవర్ ఉంటుంది. ఏపీ అయినా, తెలంగాణ అయినా.. 50-60 మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కఠినంగా వ్యవహరిస్తే.. ఏ ముఖ్యమంత్రీ నిబంధనలు దాటి ముందుకెళ్లాలనుకోరు. ఎవరూ లిమిట్స్ దాటరు. సీఎంగా నేను మా పార్టీ రంగులు వేయాలని చెబితే.. నిబంధనలు అనుమతించవని ఐఏఎస్ అధికారులు రాయాలి.
చంద్రబాబుకు సెక్రటరీ క్లాసు..!
సీఎం చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయిన కొత్తలో ఆరోగ్య శాఖ సెక్రటరీ దగ్గరకు ఓ ట్రాన్స్‌ఫర్ నిమిత్తం వెళ్లారు. ఆయన మీరు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారా అని అడిగారు. ఈ లెటర్ ఎవరి కోసం తీసుకొచ్చారో.. ఆ వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేస్తానన్నారు. ఎందుకంటే రికమండేషన్స్ ప్రోత్సహించకూడదు.. అతడు మీ ద్వారా రావడమే మొదటి తప్పు.. ఎమ్మెల్యేగా మీ పని కేవలం చట్టాలు చేసుకోవడమే.. ఆ వ్యక్తితో ఎక్కడ పనిచేయించుకోవాలో మేం చేయాల్సిన పని.. మీరు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని చెప్పి పంపించారు.
పీవీని నాటి సీఎస్ అడ్డుకున్నారు!
పీవీ నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడు వల్లూరి కామేశ్వరరావు చీఫ్ సెక్రటరీగా ఉండేవారు. అప్పట్లో విజయవాడలో కొన్ని గొడవలవుతున్నాయి. కారెక్కి విజయవాడ వెళ్లాలని సీఎం అనుకున్నారు. అక్కడకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలనుకున్నారు. అది తెలిసి సీఎస్ కిందకు వచ్చి.. మీరు వెళ్లడానికి వీల్లేదన్నారు. నాకు పొలిటికల్ కంపల్షన్ ఉందని పీవీ అన్నారు. సీఎస్‌గా అక్కడ పరిస్థితి నాకు తెలుసు.. మీరు వెళ్తే పరిస్థితి మా చేతులు దాటిపోతుంది.. వెళ్లడానికి వీల్లేదని సీఎస్ అన్నారు. నేను వెళ్తానంటూ పీవీ కారెక్కారు. సీఎస్ వెంటనే ఆ కారు డ్రైవర్‌ను ‘గెటవుట్ ఆఫ్ ది కార్’ అన్నారు. డ్రైవర్ వెంటనే దిగేశాడు. సీఎంకు వెంటనే కోపం వచ్చి.. నువ్వు ఏం చేస్తున్నావని గట్టిగానే అడిగారు. వెంటనే సీఎస్ నేను మీ దగ్గర పని చేస్తున్నాను. కానీ అతడు నా కింద పని చేస్తున్నాడు.. ‘అయామ్ హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్’ అని చెప్పారు. ఆ తర్వాత సీఎ్‌సను పిలిచి పీవీ అభినందించారు. మీలాంటి అధికారులు ఉండాలని చెప్పారు.
- ఆర్‌కే